
పదిమందిని కొంటే ప్రభుత్వమే పడిపోయేది!
ఓటుకు కోట్లు కేసు కేవలం ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రమే పరిమితం కాదని, ఇది ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేసే కుట్ర అని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలో లేకపోయినా.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో పాటు, కేంద్రంలో కూడా అధికారంలో ఉందని ఆయన తెలిపారు. పది మంది ఎమ్మెల్యేలను కొని ఉంటే.. తెలంగాణలో ప్రభుత్వమే పడిపోయి ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో కుట్ర ఉందని ఆయన చెప్పారు.
కాగా, దీనికి తగ్గట్లే.. గురువారం ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో ఒక కేసు నమోదైంది. కొంతమంది న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టులో చంద్రబాబు నాయుడిపై 'రాజద్రోహం' ఫిర్యాదు చేశారు. తనను అరెస్టు చేస్తే అదే తెలంగాణ ప్రభుత్వానికి ఆఖరి రోజు అవుతుందని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు అనడాన్ని ప్రస్తావించారు. దాంతోపాటు, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు మంత్రులు గవర్నర్పై చేసిన వ్యాఖ్యల మీద కూడా వేరే ఫిర్యాదు కోర్టులో దాఖలు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఎల్బీనగర్ పోలీసులను కేసు నమోదు చేయాల్సిందిగా సూచించింది. ఆమేరకు చంద్రబాబు, మంత్రులపై ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్లో రాజద్రోహం కేసు నమోదైంది.