
సాక్షి, అమరావతి: చంద్రబాబుకున్న భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయలేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆయనకున్న జెడ్ ప్లస్ కేటగిరినీ కూడా తగ్గించలేదని, కాన్వాయ్‌కు జామర్ సదుపాయం కూడా కల్పించామని పునరుద్ఘాటించారు. చంద్రబాబు నిర్ధిష్టంగా ఫలానా వ్యక్తినే ప్రధాన భద్రత అధికారి (సీఎస్‌ఓ)గా నియమించాలని కోరుతున్నారని, అది ఆచరణ సాధ్యం కాదని ఏజీ చెప్పారు. ఒకవేళ చంద్రబాబు కోరిన అధికారినే సీఎస్‌ఓగా నియమిస్తే భవిష్యత్తులో మరికొందరు ఇదే రకమైన అభ్యర్థనలు చేసే అవకాశం ఉందని, దీనివల్ల పలు సమస్యలు వస్తాయన్నారు. చంద్రబాబుకు ఏర్పాటు చేసిన సీఎస్‌ఓ విషయంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తనకున్న భద్రతను కుదించిందని, గతంలో ఉన్న విధంగానే తనకు భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్ మరోసారి విచారించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) బి.కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు భద్రతను కేంద్రం పునః సమీక్షించిందని, ప్రస్తుతం ఆయనకున్న ఎన్‌ఎస్‌జీ భద్రతను అలాగే కొనసాగించాలని నిర్ణయించిందని చెప్పారు.
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. మూడు షిప్టుల్లో ఐదుగురు చొప్పున కానిస్టేబుళ్లను ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లనే ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. సీఎస్‌వోలను ఇద్దరిని ఇవ్వాల్సి ఉండగా, ఒక్కరినే ఇచ్చారని చెప్పారు. ఈ వాదనలను ఏజీ తోసిపుచ్చారు. చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ భద్రతే ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో జామర్ సదుపాయాన్ని కూడా కల్పించామన్నారు.