తీర్పు ఎందుకు ఇవ్వకూడదు? | AP High Court Justice Rakesh Kumar clarified to the petitioners | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం వైఫల్యం చెందిందని తీర్పు ఎందుకు ఇవ్వకూడదు?

Published Sat, Nov 7 2020 3:27 AM | Last Updated on Sat, Nov 7 2020 10:52 AM

AP High Court Justice Rakesh Kumar clarified to the petitioners - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందంటూ తీర్పునిచ్చేందుకు ఉన్న అవకాశాలను హైకోర్టు పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేసులో ఇచ్చిన తీర్పు, శాసన మండలి రద్దు వివరాలు, న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లపై సీబీఐ దర్యాప్తు తీర్పు, నర్సీపట్నం వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ కేసులో సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పు.. ఇలా పలు అంశాల్లో ఇచ్చిన తీర్పులను, ఇతర వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. వీటితోపాటు రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని భావించేందుకు ఆస్కారం ఉన్న వివరాలన్నింటినీ తమ ముందు ఉంచవచ్చని పిటిషనర్లకు వెసులుబాటునిచ్చింది. అంతేకాకుండా రాజ్యాంగం వైఫల్యం చెందిందని ఎందుకు తీర్పునివ్వకూడదో చెప్పాలని పిటిషనర్లకు సూచించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యంపై తీర్పునిస్తామని పేర్కొంది. కాగా దీనిపై పోలీసుల తరఫున హాజరవుతున్న సీనియర్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ సర్వా సత్యనారాయణ ప్రసాద్‌ అభ్యంతరం తెలిపారు.

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లలో రాజ్యాంగం వైఫల్యం చెందిందంటూ తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. అలాంటి తీర్పునిచ్చే పరిధి హైకోర్టుకు లేదని, దీనిపై పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తామని నివేదించారు. ఏ అంశాల ఆధారంగా తీర్పునివ్వబోతున్నారో ముందే తమకు తెలియచేయాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ హైకోర్టును కోరారు. తద్వారా ఆయా అంశాలపై తాము స్పష్టమైన వివరణలతో వాదనలు వినిపిస్తామన్నారు. పిటిషనర్ల వాదనల నిమిత్తం తదుపరి విచారణను ఈ నెల 10వతేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు 144 సెక్షన్‌ ప్రయోగిస్తున్నారని, తమకు పోటీగా ఎవరూ కార్యక్రమాలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత తెనాలి శ్రవణ్‌కుమార్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. అలాగే వేర్వేరు అంశాలకు సంబంధించి పోలీసులపై ఆరోపణలు చేస్తూ పలువురు వ్యక్తులు వేర్వేరుగా పలు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది.

ఇలా అయితే పోలీసులు పని చేసేదెలా?
పోలీసుల తరఫున సీనియర్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ సత్యనారాయణ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ పోలీసులు అరెస్ట్‌ చేసింది తీవ్రమైన ఆర్థిక నేరానికి పాల్పడిన వారినని, పోలీసులపై పిటిషనర్లు చేసిన ఆరోపణలు ఏ దశలోనూ నిరూపితం కాలేదని తెలిపారు. ఇతర వివాదాస్పద అంశాల జోలికి న్యాయస్థానం వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. న్యాయస్థానం ఇలా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ, ప్రతి పనినీ తప్పుపడుతుంటే పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేరన్నారు. వ్యక్తుల అరెస్ట్‌పై పిటిషన్లు దాఖలు చేస్తే రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం లాంటి అంశాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.  

ఆ వివరాలు ముందే తెలియచేయండి..
అంతకు ముందు ఇదే అంశంపై అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ జోక్యం చేసుకుంటూ ఏ అంశాల ఆధారంగా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని ఈ న్యాయస్థానం భావిస్తోందో ఆ వివరాలను ముందుగానే తమకు తెలియచేయాలని ధర్మాసనాన్ని కోరారు. తగిన సమయంలో వాదనలకు అవకాశం ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. కోర్టు ముందుంచే వివరాలను ఏజీకి అందచేయాలని పిటిషనర్లకు సూచించింది. ఈ సందర్భంగా పాట్నా హైకోర్టు గురించి చర్చకు రావడంతో ధర్మాసనం స్పందిస్తూ వివాదాస్పద విషయాల గురించి తాము మాట్లాడబోమని పేర్కొంది. మహారాష్ట్రలో ఏం జరుగుతోందో (జర్నలిస్ట్‌ అర్నబ్‌ గోస్వామి విషయం) అందరం చూస్తూనే ఉన్నామని, మహారాష్ట్రతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎంతో నయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement