సాక్షి, విశాఖపట్నం: నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కోర్టు జడ్జిమెంట్‌ను క్షుణ్ణంగా చదివి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి ఓ సూచన చేశారని వెల్లడించారు. అధికార పార్టీని గూండాలు, రౌడీలు అంటూ నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాశారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ రాసిన లేఖనే నిమ్మగడ్డ ఎందుకు పంపారని అడుగుతున్నా. ప్రజాస్వామ్య రక్షకులా లేక మీరు ప్రజాస్వామ్య హంతకులా. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా ఉండాలని చంద్రబాబు ఎందుకు పట్టుపడుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారు.
(చదవండి: హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ నియామకమే చెల్లదు)
హైకోర్టు తీర్పువచ్చిన కొన్ని గంటల్లోనే టీడీపీ శ్రేణులు ఎందుకు సంబరాలు చేసుకున్నాయి. కోర్టు తీర్పు పూర్తిగా రాకుండానే నిమ్మగడ్డ తనకు తానే ఎస్‌ఈసీగా ఎలా నియమించుకుంటారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొందరికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వైఎస్సార్ కార్యకర్తలకి న్యాయవ్యవస్దపై అపార నమ్మకం ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాపై తప్పుడు కేసులు పెట్టినా న్యాయవ్యవస్ధపై నమ్మకంతోనే మేము పదేళ్లుగా శాంతియుత మార్గాన్నే నమ్ముకున్నాం. నా పేరుతో తప్పుడు ఐడీ సృష్టించి ఫేక్ అకౌంట్‌లో ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్సించినట్టుగా పోస్టు పెట్టారు.
నా సోషల్ మీడియా కార్యకర్తలకి నేను అండగా ఉంటా. సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేసిన వారంతా మా పార్టీ వారే కావచ్చు... ఇతరులు కూడా కావచ్చు. కోర్టులని తప్పుపట్టడం లేదు. న్యాయ వ్యవస్ధపై మాకు అపార నమ్మకం ఉంది. తప్పు చేసిన వారెవరైనా శిక్షించమనే చెబుతాం. టీడీపీ కవ్వింపులకే మా సోషల్ మీడియా కార్యకర్తలు స్పందించి పోస్టులు పెట్టారు. గత పదేళ్లగా టీడీపీ చేసిన అక్రమాలపై కేసులు పెట్టి ఉంటే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవు’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
(చదవండి: టీడీపీకి ఉన్న నమ్మకాలన్నీ నిమ్మగడ్డ మీదే)
Comments
Please login to add a commentAdd a comment