టీడీపీ కుట్రకు యాప్‌ దన్ను | SEC Own App For Election Monitoring And Complaints In AP | Sakshi
Sakshi News home page

టీడీపీ కుట్రకు యాప్‌ దన్ను

Published Fri, Jan 29 2021 5:00 AM | Last Updated on Fri, Jan 29 2021 9:21 AM

SEC Own App For Election Monitoring And Complaints In AP - Sakshi

సాక్షి, అమరావతి: పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రయోజనాలే లక్ష్యంగా భారీ కుట్రకు పావులు కదులుతున్నాయి. మొదటి నుంచీ తెదేపా అధినేత చంద్రబాబునాయుడి కనుసన్నల్లో పనిచేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. దీన్లోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నారనేందుకు బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. కరోనా వేళ వ్యాక్సిన్‌ తీసుకుంటున్న ఉద్యోగుల ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూలు విడుదల చేయటం.. అధికారుల బదిలీలతో పాటు నోటీసులు కూడా ఇవ్వకుండా  అధికారుల్ని అభిశంసిస్తూ (సెన్సూర్‌) ఉత్తర్వులివ్వటం.. ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సింది పోయి వ్యతిరేకించేలా వాŠయ్‌ఖ్యానించటం చేసిన ఈసీ.. ఈ సారి ఎన్నికలను వెబ్‌కాస్టింగ్‌ బదులు యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తామంటూ కొత్త ఎత్తుగడకు తెరతీశారు. బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఎన్నికల వెబ్‌క్యాస్టింగ్‌ అంశం చర్చకు వచ్చింది. అయితే వెబ్‌ కాస్టింగ్‌ క్వాలిటీ బాగుండటం లేదంటూ నిమ్మగడ్డ అసంతృప్తి వ్యక్తంచేశారు.

పైపెచ్చు ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు చేయడానికి ఒక యాప్‌ అవసరమన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం తాలూకు నిఘా యాప్‌ ఉంది కదా? అని ఓ అధికారి చెప్పగా... తనకు అది అవసరం లేదని నిమ్మగడ్డ సమాధానమిచ్చారు. ఈ ఫిర్యాదుల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఒక యాప్‌ను తీసుకొచ్చిందని, అలాంటిదే తానూ తయారు చేయించానని, దాన్ని వాడతామని ఆయన చెప్పటంతో విస్తుపోవటం అధికారుల వంతయింది. ఎందుకంటే యాప్‌కు సంబంధించి ఆయన ఇతరత్రా ఏ వివరాలూ వెల్లడించలేదు. పైపెచ్చు ఇప్పటిదాకా యాప్‌ గురించి ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయినా ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు చేయడానికి ఎన్నికల కమిషనర్‌ తన సొంత యాప్‌ను తయారు చేయించటమేంటి? దాన్ని ఇప్పటిదాకా గోప్యంగా ఉంచటమేంటి? ఒకవేళ అలాంటివేవైనా తయారు చేయిస్తే ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారమిచ్చి ఉండాలి కదా? ఏ కంపెనీ తయారు చేసింది? ఆ కంపెనీకి ఆ పని ఎవరు అప్పగించారు? ప్రయివేటు కంపెనీల డేటా చౌర్యం ఎన్ని అనర్ధాలకు దారి తీస్తోందో తెలియంది కాదు కదా? అసలు ఎన్నికల కమిషనర్‌ తనే సొంతంగా తనకు నచ్చిన కంపెనీతో ఇలాంటివి తయారు చేయించొచ్చా? వీటిని ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికల్లో వినియోగించవచ్చా? ఇదేమైనా ఆయన సొంత వ్యవహారమా? అధికారులను వేధిస్తున్న ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ ఈసీ అయితే జవాబివ్వలేదు. మాటలకు, చేతలకు పొంతనలేని నేపథ్యంలో ఎన్నికల్లో పారదర్శకత కూడా ప్రశ్నార్థకమేనని వస్తున్న వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుతున్నట్లవుతోంది.  

అంతా తెదేపా కనుసన్నల్లోనే... 
ఎన్నికల కమిషనర్‌గా తీసుకున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదమవుతుండటం వెనక తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడాలన్న ఉద్దేశమే కనిపిస్తోంది. ఈ యాప్‌ విషయంలోనూ అదే తీరు. పోలింగ్‌ రోజున తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర్‌రావు, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఈ యాప్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి ఎన్నికలను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని తెలుగుదేశం నాయకుడొకరు చెప్పారు. పైపెచ్చు పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేయటానికి చంద్రబాబు ఏకంగా టీడీపీ తరఫున మ్యానిఫెస్టోనే విడుదల చేశారు. తమ పార్టీ వారంతా ఎక్కడికక్కడ నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి బలం లేని గ్రామాల్లోనూ నామినేషన్లు వేయించాలని, ఏకగ్రీవ ఎన్నిక జరిగేందుకు అవకాశం ఉన్న గ్రామాల్లో ఘర్షణలు సృష్టించాలని వ్యూహం పన్నినట్లు సమాచారం.

దీనికోసం ఏకంగా ఓ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే యాప్‌ గురించి ఎక్కువ వివరాలు వెల్లడించకుండా నిమ్మగడ్డ గోప్యత పాటిస్తున్నారని, పోలింగ్‌ నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యాప్‌ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు చేసేలా... వాటిని సమీక్షించి వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా వ్యూహం రచించారని సమాచారం. అందుకనే తాను మరో రెండు నెలల పాటు ఈసీగా పదవిలో ఉండగానే ఎన్నికల ప్రక్రియను జరిపించడానికి ఆయన తొందరపడుతున్నట్లు చెబుతున్నారు. నిజానికి శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘వెబ్‌ కాస్టింగ్‌’ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తోంది. ఇక ఫిర్యాదుల విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా నిఘా యాప్‌ను నిర్వహిస్తోంది. వీటన్నిటినీ కాదని సొంత యాప్‌ను పెడతానని ఆయన చెప్పటమే విచిత్రమని అధికారులు వాపోతున్నారు.  

బాబుతో బంధం ఈనాటిది కాదు... 
గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేయడంతోనే రాష్ట్ర ప్రజలకు ఈసీ నిజ స్వరూపం తెలిసింది. తనకు భద్రత కల్పించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నిమ్మగడ్డ రాసిన ఓ లేఖ టీడీపీ అనుకూల మీడియా సంస్థలో తయారైందంటేనే ఆయనకు వారికి మధ్య ఎంత బలమైన సంబంధాలున్నాయో ఊహించుకోవచ్చు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రిని విమర్శించారు. పైపెచ్చు విచారణలో భాగంగా ఆ లేఖ ఈసీ కార్యాలయంలో తయారైంది కాదని అక్కడి కంప్యూటర్లను పరిశీలించాక ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఆ తరవాత కూడా ఆయన తన కంప్యూటర్లను తనకివ్వాలని కోరటం గమనార్హం.

ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే ఇద్దరు నేతలతో ఎందుకు భేటీ అయ్యారనేది ఇప్పుడు బయటపడుతున్న కుట్రలకు సజీవ సాక్ష్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబుకు బినామీగా పేరున్న ఓ మీడియా అధిపతి ఆధ్వర్యంలో పన్నెండేళ్ల క్రితం ఓ ఎల్లో టీవీ ఛానెల్‌ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పడిన ఆ ఛానల్‌కు రేటింగ్‌ దక్కేందుకు ‘రాజ్‌భవన్‌లో రాసలీలలు’ పేరిట రహస్య కెమెరాలతో చిత్రీకరించిన వీడియో ఫుటేజీ సదురు ఎల్లో టీవీ ఛానల్‌కు మాత్రమే లీక్‌ అవడం వెనుక కుట్ర దాగి ఉందని అప్పట్లోనే గుప్పుమంది. ప్రస్తుత ఎస్‌ఈసీ ఆ సమయంలో నాటి గవర్నర్‌కు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం నిమ్మగడ్డ కుమార్తెకు భారీగా లబ్ది చేకూర్చిన వైనం ఇప్పటికే బయటపడింది. 

‘యాప్‌’ యమ డేంజర్‌ 
– యాప్‌ను పోలింగ్‌ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కూడా డౌన్‌లోడు చేసుకోవచ్చు.  
– ఈ విధానంలో ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదుకు అనుకూలంగా ఆడియో, వీడియోలను పంపించే అవకాశం ఉంటుంది. 
– అంటే జరిగిన సంఘటన జరిగినట్టుగా కాకుండా తమ వాదనకు తగ్గ రీతిలో పంపించవచ్చు. ఫోన్‌లోని యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తున్న వ్యక్తి ఏది అనుకుంటే అది ఫిర్యాదుకు ఆధారంగా పంపించవచ్చు. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడితే ఒకరు మాత్రమే దాడి చేసిన దృశ్యాలను యాప్‌ ద్వారా పంపించొచ్చు. అవతలి వ్యక్తి కూడా దాడి చేసినప్పటికీ ఆ విషయాన్ని రికార్డు చేయకుండా వాస్తవాలను తొక్కిపెట్టవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా వాస్తవాలను వక్రీకరిస్తూ అందుకు అనుగుణంగా ఆధారాలను సృష్టించవచ్చు.  
– అంతే కాదు...యాప్‌ నిర్వహణను ఎవరైనా ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. ఆ సంస్థలోని తమ వ్యక్తుల ద్వారా వాస్తవాలను వక్రీకరించవచ్చు.సెంట్రల్‌ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులలో ఎంపిక చేసిన వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటే అభ్యంతరం తెలిపే అవకాశం ఉండదు. 
–యాప్‌ ద్వారా ఎడిట్‌ చేసిన వీడియో, ఆడియోలు పంపిస్తే...వాటి ఆధారంగా ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 
– అవి ట్యాంపర్‌ చేసిన వీడియోలు, ఆడియో రికార్డులు అని రుజువు చేయాలంటే వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాలి. ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ. ఇంతలో ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సక్రమంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తుంది.  
 
ఒక్క మాటలో చెప్పాలంటే... 
‘వెబ్‌ కాస్టింగ్‌ అన్నది ఆబ్జెక్టివ్‌( పారదర్శక విధానం)...యాప్‌ సబ్జెక్టివ్‌ (తమ ఫిర్యాదుకు అనుకూలంగా ఆధారాలు సృష్టించే విధానం). ఇంతటి వివాదాస్పద నిర్ణయానికి కమిషనర్‌ ఎందుకు తీసుకుంటున్నారన్నది అంతుపట్టనిదేమీ కాదు. అతని వ్యవహారశైలి ముందునుంచి వివాదాస్పదమే. అఖిలభారత సర్వీసు అధికారిగా 23 ఏళ్లుగా నేను ఆయనను గమనిస్తున్నాను. ఓ రాజ్యంగబద్దమైన పదవిలో ఉండటానికి ఎంత మాత్రం అర్హత లేని వ్యక్తి. మళ్లీ చెపుతున్నా వెబ్‌ కాస్టింగ్‌ అన్నది ఫ్యాక్ట్, యాప్‌ అన్నది ట్యాంపర్‌.  –ఓ మాజీ ఐఎఎస్‌ అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement