
సాక్షి, హైదరాబాద్ : అడ్వొకేట్ జనరల్ (ఏజీ).. రాజ్యాంగబద్ధ పదవుల్లో కీలకమైనది.. న్యాయపర వ్యవహారాల్లో అమూల్యమైన సలహాలతో రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమైన వ్యక్తి.. శాసనసభలో ఆయనకు ఎప్పుడూ ఓ ప్రత్యేక సీటు కేటాయించి ఉంటుంది.. అంతటి కీలక పదవి ఇప్పుడు రాష్ట్రంలో ఖాళీగా ఉంది.. అదీ 3 నెలలుగా.. దేశంలో ఏజీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణే. ఏజీని నియమించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విశ్రాంత, సిట్టింగ్ న్యాయమూర్తుల్లోనూ ప్రభుత్వ తీరుపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగి ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే తెలంగాణ తొలి ఏజీ నియామకం జరిగింది. తొలి ఏజీగా కె.రామకృష్ణారెడ్డిని నియమిస్తూ జూన్ 21న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయన మూడేళ్లు పదవిలో కొనసాగారు. 2017 జూలై 12న రాజీనామా చేశారు. సరిగ్గా 5 రోజులకు (జూలై 17న) కొత్త ఏజీగా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ పెద్దల ఆగ్రహంతో ఏడాది తిరగక ముందే ఏజీ పదవికి రాజీనామా చేశారు.
ఎసరు తెచ్చిన హామీ
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం విషయంలో ప్రభుత్వం, శాసనసభ తరఫున హైకోర్టుకు హామీ ఇవ్వడం ప్రకాశ్‌రెడ్డి పదవికి ఎసరు తెచ్చింది. కోమటిరెడ్డి విసిరిన హెడ్‌ఫోన్ వల్ల మండలి చైర్మన్ గాయçపడ్డారన్న ఆరోపణలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించిన రికార్డులను కోర్టు ముందుంచుతానని ఏజీ హామీ ఇవ్వడం ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. అప్పటికే ప్రకాశ్‌రెడ్డి వ్యవహారశైలిపై ఐఏఎస్ అధికారులు ఫిర్యాదులు చేయడం, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా కోర్టుకు హామీ ఇవ్వడంతో ఇక ఆయన్ను సాగనంపాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. తమను సంప్రదించకుండానే హామీ ఇవ్వడంపై ప్రకాశ్‌రెడ్డిని గట్టిగానే నిలదీశారు. దీంతో ఈ ఏడాది మార్చి 26న ఏజీ పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే ప్రకాశ్‌రెడ్డి రాజీనామా ఇచ్చి 3 నెలలైనా ఇప్పటివరకు ప్రభుత్వం ఆమోదించకపోవడం విశేషం. రాజీనామాను ఆమోదించాలంటూ ప్రభుత్వానికి ప్రకాశ్‌రెడ్డి లేఖ రాసినట్లు కూడా ఓ దశలో ప్రచారం జరిగింది. ప్రభుత్వం తన రాజీనామాను ఆమోదించకపోవడంతో సీనియర్ న్యాయవాదిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కేసుల్లోనూ ఆయన హాజరు కాలేకపోతున్నారు.
సీఎం మల్లగుల్లాలు
ప్రకాశ్‌రెడ్డి రాజీనామా తరువాత ఎవరిని ఏజీగా నియమించాలన్న విషయంలో సీఎం కేసీఆర్ పెద్ద కసరత్తే చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఏజీ పదవి అప్పగించాలన్న కృతనిశ్చయంతో ఉన్న సీఎం.. పోస్టుకు అర్హులైన వారి గురించి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఏజీ తరువాతి స్థానంలో ఉంటూ వ్యవహారాలు చక్కబెడుతున్న వ్యక్తి కొందరి పేర్లను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆ పేర్లు పరిశీలించిన సీఎం.. ఇంటెలిజెన్స్ ద్వారా వారికి సంబంధించి పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. ఏజీ స్థాయి పదవిని నిర్వహించే సామర్థ్యం వారికి లేదని ఇంటెలిజెన్స్ సీఎంకు నివేదించడంతో ఏజీ ఎంపిక ఆయనకు తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో ఏజీ తరువాత స్థానంలోని వ్యక్తి ఏజీ పదవి తమకివ్వాలంటూ ఒకరిద్దరు నేతల ద్వారా సీఎంపై ఒత్తిడి తెచ్చారు. అతని శక్తి, సామర్థ్యాలు మొదటి నుంచి తెలిసిన సీఎం కేసీఆర్.. ఇలాంటి సిఫార్సులు చేయొద్దంటూ ఆ నేతలకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. మరోవైపు ఏజీ లేక న్యాయ వ్యవహారాల్లో ప్రభుత్వానికి దిశానిర్దేశం కరవుతోంది. ఆయన సలహా మేరకే ప్రభుత్వం విధానాపర నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. అధికారులు, ప్రభుత్వ పెద్దలకు అందుబాటులో ఉంటూ ఏజీ తగు సలహాలు ఇవ్వాలి. ఏజీ లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
సుప్రీంకోర్టు చెప్పింది ఇదీ
యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ గోపాల్‌చంద్ర మిశ్రా కేసు (1978)లో సుప్రీంకోర్టు ఓ తీర్పునిచ్చింది. రాజ్యాంగ పదవుల్లోని వ్యక్తులు ఏ తేదీన పదవికి రాజీనామా చేస్తారో ఆ రోజు నుంచే అమల్లోకి వస్తుందని ఆ తీర్పులో స్పష్టం చేసింది. రాజీనామా లేఖపై నిర్దిష్ట తేదీ రాసి సమర్పించి ఉంటే ఆ తేదీన ఆ వ్యక్తి రాజీనామా చేసినట్లేనని పేర్కొంది. ఇలాంటి సమయంలో ఆ రాజీనామా లేఖను ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రాజీనామా లేఖపై భవిష్యత్ తేదీ ఉంటే ఆ రాజీనామా పరిపూర్ణమైంది కాదని పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేసిన తేదీ నుంచే ఆయన రాజీనామా అమల్లోకి వచ్చినట్లు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment