సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు హైకోర్టు త్వరితగతిన పరిష్కరించాల్సిన అంశాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో విధించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది.
► రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది, ఎస్.నిరంజన్‌రెడ్డి, మెహ్‌ఫూజ్ నజ్కీ, పి.గౌతమ్‌తో కూడిన కౌన్సిల్ వాదనలు వినిపించింది.
► సన్నాహక పనులకు హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో అడ్డంకిగా మారిందని సుప్రీంకోర్టుకు నివేదించింది.
► పాత చట్టాన్ని తొలగించామని, కానీ కొత్త చట్టంపై హైకోర్టు స్టేటస్‌కో ఇచ్చిందని వాదించింది.
► ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టనుందని నివేదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది.
► హైకోర్టు జరిపే విచారణలో వాదనలు వినిపించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
► అలాగే వీలైనంత త్వరగా ఈ కేసు విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది.
► వీలైనంత త్వరగా అంటే ఆరు నెలలు కూడా పట్టే అవకాశం ఉంటుంది కదా అని ధర్మాసనాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది రాకేష్ ద్వివేది ప్రశ్నించారు.
► మొదట్లో ఈ రెండు చట్టాలపై కేవలం నాలుగు పిటిషన్లు మాత్రమే ఉన్నాయని, తర్వాత రోజుకో పిటిషన్ వేస్తున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
► దీనివల్ల విచారణలో తీవ్ర జాప్యం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని నివేదించారు.
► రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తే ఇది హైకోర్టు త్వరగా పరిష్కరించాల్సిన అంశం అని సుప్రీం ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
హైకోర్టు త్వరగా పరిష్కరించాలి
Published Thu, Aug 27 2020 4:26 AM | Last Updated on Thu, Aug 27 2020 7:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment