
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. కార్యాలయాల తరలింపుపై యథాత«థస్థితి కొనసాగించాలంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు 27 వరకు పొడిగించింది. స్టేటస్ కో ఉత్తర్వుల వల్ల ఇరుపక్షాలకు నష్టమని, అందువల్ల వాటిని ఎత్తివేయాలని.. రాజధానిని మార్చడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
రాజధానితో పనిలేకుండా కార్యాలయాలను ఎక్కడైనా ఏర్పాటుచేసుకునే అధికారం తమకుందని నివేదించింది. యథాతథస్థితి ఉత్తర్వులవల్ల సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు కూడా ఆగిపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపింది. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. అయితే, హైకోర్టు అందుకు నిరాకరిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదీ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్, సీఆర్‌డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిలు వాదనలు వినిపించారు. రాకేశ్ ద్వివేదీ, ఏజీ వాదిస్తూ.. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు. అయితే, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, వాసిరెడ్డి ప్రభునాథ్ తదితరులు దీనిని వ్యతిరేకించారు. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. బ్లూజీన్స్ యాప్‌లో సాంకేతిక సమస్యలవల్ల విచారణను 27కి వాయిదా వేయాలని ధర్మాసనం నిర్ణయించింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. 27 నుంచి కేసును రోజూ విచారించాలన్న ఎస్.నిరంజన్‌రెడ్డి అభ్యర్థనపట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.