రైతులు కాదన్నా.. కైవసమే
రాజధాని భూములు బలవంతంగా లాక్కోవడానికి సర్కారు కొత్త బిల్లు
►నేడు మంత్రిమండలిలో చర్చించి ఆమోదం
►వీజీటీఎం రద్దు - ఆ పరిధికి మించి సీఆర్‌డీఏ ఏర్పాటు
►సీఎం చైర్మన్‌గా గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు
►మున్సిపల్ శాఖ అధికారి నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ
►రాజధాని నగరం, రాజధాని ప్రాంతంపై వేర్వేరుగా నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఏటా మూడు నాలుగు పంటలు పండే బంగారు భూములు కోల్పోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేమని రైతులు నిత్యం నినదిస్తున్నా... వాటినేమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. భూ సమీకరణపై ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలు వెల్లడించకుండానే రాజధానికి సంబంధించి భూములను కైవసం చేసుకోవడానికి ప్రభుత్వం పూర్వరంగం సిద్ధం చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ-కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ)ను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయబోతోంది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుఅధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశం సీఆర్‌డీఏకి ఆమోదముద్ర వేయనుంది.
భూ సమీకరణపై ప్రభుత్వమే నేరుగా కాకుండా ఈ అథారిటీ ద్వారా వ్యవహారం నడిపించే ఎత్తుగడలో భాగంగానే దీనికి రూపకల్పన జరిగినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో రాజధాని కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం ఇంతవరకు నియమ నిబంధనలేవీ ప్రకటించలేదు. అలా ప్రకటించకపోగా భూ సమీకరణకు అంగీకరించని పక్షంలో బలవంతంగా భూములను సేకరిస్తామంటూ స్వయంగా సీఎం హెచ్చరించిన సందర్భాలూ ఉన్నాయి. భూములు కోల్పోయిన వారికి తగిన విధంగా పరిహారం వచ్చేలా చూస్తామని మంత్రులు ప్రకటనలు చేయడమే తప్ప ఏ మేరకు పరిహారం ఉంటుందన్న విషయం స్పష్టం చేయలేదు.
దీనిపై అయోమయం కొనసాగుతుండగానే భూములను అప్పగించడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటనలు చేస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతాంగాన్ని మరింత గందరగోళంలో పడేశారు. మాయమాటలతో, మభ్యపెట్టే ప్రకటనలతో రైతులను నయానా భయానా ఒప్పించే కార్యక్రమాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం రాజధాని ఏర్పాటుపై అడుగులు ముందుకేస్తోంది. ఎవరెవరి భూములు సేకరిస్తారు? ఎంతమేరకు సేకరిస్తారు? వాటికి పరిహారంగా ఏం చెల్లించబోతున్నారు? రాజధాని పరిధి ఏంటి? వాటిల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు? రైతులందరినీ ఏం చేస్తారు? వంటి అంశాలపై స్పష్టత ఇవ్వకుండా, ఎలాంటి ప్రత్యామ్నాయాలుగానీ సమగ్రమైన విధానం గానీ ప్రకటించకుండానే.. ఫక్తు వ్యాపార ధోరణిలో భూ సమీకరణను మరింత సానుకూలం చేసుకోవడానికి సీఆర్‌డీఏ ద్వారా ప్రభుత్వం రంగంలోకి దిగనుంది.
ఆ మేరకు సీఆర్‌డీఏపై ముసాయిదా బిల్లును రూపొందించింది. దీనికి మంగళవారం మంత్రిమండలి ఆమోద ముద్ర పడిన వెంటనే సీఆర్‌డీఏను కార్యరూపంలోకి తెస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. ప్రధానంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి అధ్యక్షతన గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే రాజధాని ప్రణాళిక, విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడానికి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి చైర్మన్‌గా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించనున్నారు. రాజధాని నిర్మాణంతో పాటు, ల్యాండ్ పూలింగ్ తదితర అంశాలన్నింటినీ ఎగ్జిక్యూటివ్ కమిటీయే పర్యవేక్షిస్తుంది.
సీఆర్‌డీఏ ఏర్పాటు కాగానే ప్రస్తుతం ఉన్న విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం) రద్దు కానుందని, కొత్తగా ఏర్పాటయ్యే సీఆర్‌డీఏ వీజీటీఎం పరిధిని మించి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అథారిటీ ఏర్పాటు కాగానే ఆ పరిధిలోని స్థానిక సంస్థల అధికారాలన్నీ కూడా రద్దు అవుతాయని, ఆయా స్థానిక సంస్థల పరిధిలో ఏ నిర్ణయాన్ని అయినా అథారిటీయే తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అథారిటీ ఏర్పాటు కాగానే రాజధాని నగర పరిధిని, సరిహద్దులను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ అవుతుందని, అలాగే విడిగా రాజధాని ప్రాంత పరిధి, సరిహద్దులను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ అవుతుందని అధికారులు తెలిపారు.
ఈ బిల్లులో ల్యాండ్ పూలింగ్ విధానం గురించి కూడా ఉంటుందని, అయితే పూర్తి వివరాలు, విధి విధానాలు అనంతరం రూపొందించే నిబంధనల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం కింద రైతుల ఇచ్చిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు సంవత్సరాల సమయం పడుతుందని ఉన్నతాధికారి తెలిపా రు. రైతులు ఎక్కడైతే భూములు ఇచ్చారో అక్కడే వారికి అభివృద్ధి చేసిన స్థలం ఇవ్వరని, మరో ప్రాంతంలో ఇస్తారని అధికార వర్గాలు తెలి పాయి. రాజధాని మధ్యలో రైతులు భూములను ఇస్తే అక్కడే అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వరని, మరో ప్రాంతంలో ఇస్తారని వివరించాయి.