executive committee
-
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయామ్స్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: ‘ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ’ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్ కుమార్ (మాతృభూమి) ఎన్నికయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఐఎన్ఎస్ బిల్డింగ్‌లో 85వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో 2024–25 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్ కుమార్‌ను ఎన్నుకోగా.. వివేక్ గుప్తా డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, కరణ్ రాజేంద్ర దర్దా (లోక్మత్) ఉపాధ్యక్షుడిగా, తన్మయ్ మహేశ్వరీ (అమర్ ఉజాలా) కోశాధికారిగా, మేరీపాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ తెలిపింది. కేఆర్పీ రెడ్డి (సాక్షి), వివేక్ గొయెంకా (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్), అతిదేవ్ సర్కార్ (టెలిగ్రాఫ్), మహేంద్ర మోహన్ గుప్తా (దైనిక్ జాగరణ్), ఐ.వెంకట్ (ఈనాడు), జయంత్ మమెన్ మాథ్యూ (మలయాళ మనోరమ)లు ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. -
మరింత సమర్థంగా ‘ప్రత్యక్ష నగదు బదిలీ’
సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. పథకాల అమలులో పారదర్శకతకు, నిష్పాక్షికతకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి పథకాన్ని ప్రతి లబ్ధిదారుకి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తోంది. దీని ద్వారా అవినీతి, ఆశ్రితపక్షపాతానికి తావు లేకుండా పథకం ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రత్యక్ష నగదు బదిలీని మరింత సమర్ధంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన పలువురు మంత్రులు సభ్యులుగా రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన పలు శాఖల అధికారులు సభ్యులుగా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రత్యక్ష నగదు బదిలీకి అత్యంత సానుకూల ప్రభావం ఉన్న నేపథ్యంలో పథకాల వర్క్‌ఫ్లోను నిరంతరం క్రమబద్ధీకరించడంతో పాటు కొత్తగా వస్తున్న సాంకేతికతలను స్వీకరించడం, వివిధ విభాగాలను సమన్వయం చేయడం, లీకేజీలను తగ్గించడం బదిలీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవరత్నాల్లోని పలు పధకాలను ప్రత్యక్ష నగుదు బదిలీ ద్వారా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. వివిధ పథకాల లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా ఆర్ధిక సాయం అందుతోంది. సమర్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఎటువంటి లీకేజీ లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ అమలవుతోంది అనడానికి లబ్ధిదారులే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నారు. అలాగే ఈ విధానం సామాజిక శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతోంది. లబ్ధిదారులతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. ఇలాంటి ప్రత్యక్ష నగదు బదిలీని మరింత సమర్ధంగా అమలు చేయడం కోసమే సమన్వయ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది’ అని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్రస్థాయి ప్రత్యక్ష నగదు బదిలీ కమిటీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, ఐటీ, పరిశ్రమలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, కార్మిక, ఉపాధి, శిక్షణ, మహిళా, శిశు అభివృద్ధి శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీకి ముఖ్యమంత్రి ఏ మంత్రినైనా లేదా నిపుణులనైనా ఆహ్వానించవచ్చు. రాష్ట్రస్థాయి కమిటీ లక్ష్యాలు రాష్ట్రస్థాయి కమిటీ ప్రత్యక్ష నగదు బదిలీకి విస్తృత దృష్టితో దిశను నిర్ధారిస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ విస్తృత విధానాలు, లక్ష్యాలు, వ్యూహాలను రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. మరింత సమర్ధత, పారదర్శకత, జవాబుదారీ పెంపొందించే లక్ష్యాలను నిర్ధారిస్తుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్థిక శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళికా శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ లక్ష్యాలు ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాల అమలుకు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. -
ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో తెలుగు కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. బ్రశీ క్రీక్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా అర్జున్ అనంతుల, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా పరమేష్ రెడ్డి నంగీ , కార్యదర్శిగా శివ దుర్భాకుల, కోశాధికారిగా మధుకర్ రెడ్డి గంగాడి నియమితులు అయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా శైలజ కోమటి ( కల్చరల్), జగన్ మల్కారెడ్డి( ఫైనాన్స్ & స్పాన్సర్షిప్) ,భరత్ పిస్సాయ్(మెంబర్షిప్), గోపాల కృష్ణ అయితాబత్తుల(ఫుడ్ & లాజిస్టిక్స్), చిన్నప్ప కుందూరు(స్పోర్ట్స్), బోర్డు అఫ్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ బత్తుల నియమితులయ్యారు. బోర్డు అఫ్ డైరెక్టరులుగా కొనసాగుతున్న రామ్ హనుమంతు , మురళీధర్ వేలూరికి నూతన సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
సంజయ్... జిల్లా నేతలకు ‘జై’
సాక్షి, హైదరాబాద్ : ‘బండి’కూర్పులో కొంచెం మార్పు, కొంచెం నేర్పు కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటులో అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన ముద్ర వేశారు. జిల్లాల నేతలకు సం‘జై’కొట్టారు. హైదరాబాద్‌లో ఉంటున్నవారికే ఇప్పటిదాకా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలకు చెక్ పెట్టారు. ఈసారి ఆయా జిల్లాల నేతలకు రాష్ట్ర కమిటీలో ఎక్కువ పదవులు కేటాయించారు. రాష్ట్రకమిటీలో మొత్తంగా 23 మందికి చోటు కల్పించగా అందులో 17 మంది జిల్లాల నేతలే కావడం గమనార్హం. సంజయ్ స్వయంగా కరీంనగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అధికార ప్రతినిధుల్లో నల్లగొండ నుంచి పి.రజనీకుమారికి స్థానం కల్పించారు. కమిటీలో మాజీ ఎమ్మెల్యేలకు కూడా పెద్దపీట వేశారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి కూడా కమలదళంలో చోటు లభించింది. 8 మంది ఉపాధ్యక్షుల్లో ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, సెక్రటరీల్లో ఒక మాజీ ఎమ్మెల్యేకు స్థానం కల్పించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన విజయరామారావు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శోభారాణికి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్‌కుమార్‌లకు మరోసారి అవకాశం కల్పించారు. బీజేపీ జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతికి ప్రధాన కార్యదర్శిగా అవకాశం వచ్చింది. రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన వారిలో శ్రీనివాస్ గౌడ్, కుంజా సత్యవతి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కాగా ప్రకాష్‌రెడ్డి, రఘునందన్ రావు, మాధవి ఇప్పటివరకు అధికార ప్రతినిధులుగా పనిచేశారు. మరో కార్యదర్శి బొమ్మ జయశ్రీ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కూతురు. ఇక గత కమిటీలో పనిచేసిన కార్యదర్శులలో మళ్లీ ఎవరికీ చాన్స్ దక్కలేదు. పార్టీ కోశాధికారిగా గత కమిటీలో ఉన్న శాంతికుమార్నే మళ్లీ నియమించారు. నార్త్ ఇండియన్ భవర్లాల్ వర్మను జాయింట్ ట్రెజరర్‌గా నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిని మార్పు చేశారు. ఆరుగురు మహిళలకు చోటు... బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు. ఉపాధ్యక్షులుగా ఒకరికి, ప్రధాన కార్యదర్శిగా మరొకరికి, కార్యదర్శుల్లో నలుగురికి స్థానం దక్కింది. సామాజికవర్గాల వారీగా చూస్తే రాష్ట్ర కమిటీలో అగ్రకులాలవారికే ఎక్కువ చోటు దక్కింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆరుగురు, వెలమ ముగ్గురు, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. బీసీల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అధ్యక్షునితో కలుపపుకొని నలుగురు ఉన్నారు. -
23 మందితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గత మార్చిలో నియమితులైన బండి సంజయ్‌కుమార్ ఎట్టకేలకు తన టీంను ప్రకటించారు. రాజకీయ కదనరంగంలోకి 23 మంది కమలదళాన్ని దించారు. అధ్యక్షుడిగా నియమితులైన ఐదు నెలలకు 23 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కమిటీలో 8 మందికి ఉపాధ్యక్షులుగా, నలుగురికి ప్రధాన కార్యదర్శులుగా, 8 మందికి కార్యదర్శులుగా, ఇద్దరికి కోశాధికారులుగా, ఒకరికి కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. గత కమిటీలో ఉన్న కొంతమంది నేతలకు తాజా కమిటీలో పదోన్నతి కల్పించగా, మరికొంతమంది కొత్తవారిని కార్యవర్గంలోకి తీసుకున్నారు. అధికార ప్రతినిధులుగా పనిచేసిన పలువురికి పార్టీ కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. పలు మోర్చాలకు గతంలో ఉన్న అధ్యక్షులను కూడా మార్చారు. ఇప్పటివరకు ఆకుల విజయ మహిళామోర్చా అధ్యక్షురాలిగా ఉండగా, ఇప్పుడు ఆ బాధ్యతను కె.గీతామూర్తికి అప్పగించారు. పార్టీ రాష్ట్ర కమిటీకి ముగ్గురు అధికార ప్రతినిధులను నియమించారు. ప్రత్యామ్నాయశక్తిగా తీర్చిదిద్దేందుకే : సంజయ్ రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయశక్తిగా తీర్చిదిద్దేందుకు, పటిష్ట పరిచేందుకు పార్టీని విస్తరించినట్లు బండి సంజయ్ తెలిపారు. కొత్తగా నియమితులైన రాష్ట్ర పదాధికారులకు, మోర్చాల అధ్యక్షులకు అభినందనలు తెలిపారు. పార్టీలో మిగిలిన వివిధ కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించినవారు.. ఉపాధ్యక్షులు : డాక్టర్ జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్రావు, యెండల లక్ష్మీనారాయణ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, బి.శోభారాణి. ప్రధాన కార్యదర్శులు : జి.ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులు(ఆర్గనైజింగ్ సెక్రటరీ). కార్యదర్శులు : రఘునందన్‌రావు, డాక్టర్ ప్రకాష్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్‌గౌడ్, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, కె.మాధవి, జి.ఉమారాణి. ట్రెజరర్ : బండారి శాంతికుమార్, బవర్లాల్ వర్మ (జాయింట్ ట్రెజరర్) ఆఫీస్ సెక్రటరీ : డాక్టర్ ఉమా శంకర్ ఆయా మోర్చాల అధ్యక్షులు : యువ మోర్చా – ఎ.భానుప్రకాష్, మహిళామోర్చా– కె.గీతామూర్తి, కిసాన్‌మోర్చా – కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఎస్సీ మోర్చా – కొప్పు బాష, ఎస్టీ మోర్చా – హుస్సేన్ నాయక్, ఓబీసీ మోర్చా – ఆలే భాస్కర్, మైనారిటీ మోర్చా – అఫ్సర్ పాషా. అధికార ప్రతినిధులు : కృష్ణసాగర్‌రావు, పి.రజనికుమారి, ఎ.రాకేష్‌రెడ్డి. -
కాట్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
వాషింగ్టన్ డీసీ : రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (సీఏటీఎస్) 2020- 2021 ఏడాదికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. అధ్యక్షురాలిగా సుధారాణి కొండపు ఉపాధ్యక్షులుగా సతీష్ వడ్డీ, కార్యదర్శి గా దుర్గాప్రసాద్ గంగిశెట్టి, కోశాధికారిగా పార్థసారథి బైరెడ్డి, సాంస్కృతిక కార్యదర్శిగా హరీష్ కుమార్ కొండమడుగు, కమ్యూనిటీ సర్వీస్ కార్యదర్శిగా రామచంద్రరావు ఆరుబండి ఎన్నికయ్యారు. ధర్మకర్తలుగా ప్రవీణ్ కాటంగురి, గోపాల్ నున్న, వెంకట్ కొండపోలు నియమితులయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న కాట్స్ మాజీ అధ్యక్షుడు రవి బొజ్జ నూతన అధ్యక్షురాలికి పదవీ బాధ్యతలు అప్పగించారు. సహాయ కార్యదర్శి శ్రీనివాస్ వూట్ల నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. సలహాదారులు భువనేష్ బూజాల, మధు కోల, భాస్కర్ బొమ్మారెడ్డి, అనిల్ నీరుకొండతో పాటు కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా, చిత్తరంజన్ నల్లు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అనుభవజ్ఞుల సలహాలతో, కొత్తగా కార్యవర్గంలో చేరినవారి ఆలోచనలను రంగరిస్తూ పనిచేస్తామని సుధారాణి అన్నారు. తెలుగు భాష, సాహితీ రంగాలకు పెద్దపీట వేస్తూ, అంతరించిపోతున్న జానపదాలు, నాటకాలను పునరుజ్జీవం చేసే కార్యక్రమాలను చేస్తామని పేర్కొన్నారు. డీసీ మెట్రో ప్రాంతానికి చెందిన తెలుగు వారందరికీ మరింత చేరువయ్యే క్రీడా,సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను, ప్రతీ నెలా చేపట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని సుధారాణి వెల్లడించారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న సేవా కార్యక్రమాలను తమ పరిధిలో మరింత విస్తృత పరిచేలా కాట్స్ కార్యవర్గం నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె చెప్పారు. -
ఈసీల్లేవు..వీసీల్లేరు!
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిక్యూటివ్ కమిటీలు (ఈసీ), వీసీలు లేకపోవడంతో యూనివర్సిటీల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. నియామకాలపై దృష్టి పెట్టేవారు లేరు. నిధుల సద్వినియోగానికి చర్యలు చేపట్టే వారు లేరు. ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడుతోంది. యూనివర్సిటీల్లో ఏ పని చేయాలన్నా, విధానపర నిర్ణయం తీసుకోవాలన్నా నిపుణులు, అధ్యాపకులు, ప్రముఖులు మొత్తంగా 13 మందితో కూడిన పూర్తి స్థాయి ఈసీలు ఉండాల్సిందే. కానీ అవి లేకపోవడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండాపోతోంది. ఈసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ముగ్గురు ఐఏఎస్ అధికారులు, వైస్ చాన్స్‌లర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గత ఐదేళ్లుగా పక్కన పడేసింది. ఒక్క జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) తప్ప మిగతా యూనివర్సిటీలకు ఈసీలను నియమించాలన్న విషయాన్నే పట్టించుకోవడం లేదు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప.. యూనివర్సిటీలకు ఈసీలను నియమించే విషయంలో ఎవరో ఒకరు అడిగితే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. కాకతీయ యూనివర్సిటీకి గత నెల 13వ తేదీన ఆగమేఘాలపై ఈసీని నియమించింది. ఆ యూనివర్సిటీ ఈసీ సభ్యుల నియామకం విషయంలో సుప్రీంకోర్టులో కేసు గత నెల 15వ తేదీన హియరింగ్ ఉండటంతో పూర్తి స్థాయి ఈసీని నియమించింది. మరోవైపు వైస్ చాన్స్లర్ల నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటుచేసినా, అవి ఇంతవరకు సమావేశమైందీ లేదు. వీసీ పదవి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిందీ లేదు. 2010లోనే ఈసీల రద్దు.. రాష్ట్రంలోని యూనివర్సిటీల ఈసీలు 2010లోనే రద్దు అయ్యాయి. 2010 ఏప్రిల్ 9వ తేదీన కాకతీయ యూనివర్సిటీ పాలక మండలిని ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో పాటు ఉస్మానియా, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ ఓపెన్, తెలుగు యూనివర్సిటీల పాలక మండళ్లను రద్దు చేసింది. ఆ తరువాత 2011 నవంబర్ 15వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీతోపాటు మిగతా యూనివర్సిటీలకు ఈసీలను నియమించింది. అందులో కాకతీయ యూనివర్సిటీకి ఈసీని నియమించలేదు. ఆ పదవీ కాలం కూడా 2014తోనే పూర్తయిపోయింది. అప్పటి నుంచి వాటికి పూర్తి స్థాయి ఈసీలే లేకుండాపోయాయి. పూర్తి స్థాయి ఈసీలు ఉంటే... ప్రతి యూనివర్సిటీ ఈసీకి ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ) చైర్మన్‌గా ఉంటారు. అలాగే విద్యాశాఖ, ఆర్థిక శాఖ, కళాశాల విద్యా కమిషనర్ (టెక్నికల్ యూనివర్సిటీ అయితే సాంకేతిక విద్యా కమిషనర్) ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఇక యూనివర్సిటీ కాలేజీల నుంచి ఒక ప్రిన్సిపాల్, ఇద్దరు అధ్యాపకులు, డిగ్రీ కాలేజీల నుంచి ఒక ప్రిన్సిపాల్, ఒక అధ్యాపకుడు, సమాజంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు/నిపుణులు నలుగురు కలుపుకొని మొత్తంగా 13 మంది సభ్యులు ఈసీలో ఉంటారు. ఆ యూనివర్సిటీ రెక్టార్ ఉంటే అతను కూడా ఈసీలో సభ్యులుగా ఉంటారు. ఇలాంటి కమిటీ తీసుకునే నిర్ణయమే విధానంగా మారుతుంది. యూనివర్సిటీకి సంబంధించి ఏ పని చేయాలన్నా ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే. దానినే వైస్ చాన్స్‌లర్ అమలు చేస్తారు. అంతేకాదు అడ్మినిస్ట్రేషన్, అకడమిక్, ప్రమోషన్స్, ఉద్యోగాల భర్తీ, సైంటిఫిక్ పరికరాలు, ల్యాబ్ వస్తువుల కొనుగోలు, యూజీసీ నిధుల వినియోగం ఇలా అన్నింటికి ఈసీ ఆమోదం ఉండాల్సిందే. ►కాకతీయ వర్సిటీలో పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ లేకుండానే ఏడేళ్ల క్రితం చేపట్టిన నియామకాలను ఈసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండే ముగ్గురు ఐఏఎస్ అధికారులు, వీసీ అప్రూవ్ చేశారు. ఈసీ లేకుండా ఎలా అప్రూవ్ చేస్తారంటూ ఒకరు కోర్టును ఆశ్రయించడంతో ఆ సెలెక్షన్స్‌ను కోర్టు కొట్టివేసింది. ►2015, 2016 సంవత్సరాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూజీసీ నుంచి వచ్చిన ప్రాజెక్టు నిధులను పూర్తి స్థాయి ఈసీ సద్వినియోగపరచుకోకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. ►2016లో జేఎన్ఏఎఫ్ఏయూ వీసీ నియామకం కోసం ఏర్పాటుచేసిన సెర్చ్ కమిటీలో వర్సిటీ నామినీని నియమించారు. పూర్తి స్థాయి ఈసీ లేకుండా, దాని అప్రూవల్ లేకుండా వర్సిటీ నామినీని ఎక్స్ అఫీషియో సభ్యులు ఎలా నామినేట్ చేస్తారని ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పూర్తిస్థాయి ఈసీని నియమించాల్సి వచ్చింది. ►ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వైస్ చాన్స్లర్లు (వీసీ) లేరు. 2016లో నియమితులైన వీసీల పదవీ కాలం జూన్, జూలై నెలల్లోనే ముగిసిపోయింది. ఇన్చార్జి వీసీలుగా ఉన్న ఐఏఎస్ అధికారులు వర్సిటీలను పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. అకడమిక్ మార్పుల కోసమైనా ఈసీలు ఉండాల్సిందే ఈసీలో ఎక్స్అఫీషియో మెంబర్స్‌గా ఉండే వారు తీసుకునే నిర్ణయాలు వ్యాలిడ్ కావు. కోర్టులో అవి నిలబడవు. అకడమిక్ అంశాలు చూసేందుకు నిపుణులు అవసరం. మార్పులు చేయాలన్నా వారు ఉండాల్సిందే. విభాగాలు చేసే అకడమిక్ మార్పులను ఈసీ పరిశీలించి విధానపర నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. అకడమిక్ కేలండర్ సరిగ్గా అమలు కావడం లేదు. జూలై నెలలో ప్రారంభం కావాల్సిన అకడమిక్ ఇయర్ సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. పీజీ పరీక్షలు నిర్వహించిన నెల రోజుల్లో ఫలితాలు ఇవ్వాలి. ఆరు నెలల వరకు కూడా కొన్ని పరీక్షల ఫలితాలు రావడం లేదు. – ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ -
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శైలేష్ గుప్తా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా మిడ్–డే వార్తాసంస్థకు చెందిన శైలేశ్ గుప్తా ఎన్నికయ్యారు. 2019–20 సంవత్సరానికిగాను అధ్యక్షుడిగా శైలేశ్ గుప్తా సేవలు అందించనున్నారు. బుధవారం బెంగళూరులో జరిగిన ఐఎన్ఎస్ 80వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. డెప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎల్.ఆదిమూలన్, వైస్ ప్రెసిడెంట్‌గా డీడీ పుర్కాయస్థ, గౌరవ కోశాధికారిగా నరేశ్ మోహన్, సెక్రటరీ జనరల్‌గా మేరీపాల్ ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సాక్షి (విశాఖపట్నం) తరఫున కె.రాజప్రసాద్ రెడ్డి(కేఆర్పీ రెడ్డి)సహా 41 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలోని కొందరు సభ్యులు: ఎస్.బాలసుబ్రమణ్యం ఆదిత్యన్ (డైలీ తంతి), గిరీశ్ అగర్వాల్ (దైనిక్ భాస్కర్, భోపాల్), సమహిత్ బల్ (ప్రగతివాది), గౌరవ్ చోప్రా (ఫిల్మీ దునియా), విజయ్ జవహర్లాల్ దర్దా (లోక్మత్, నాగ్‌పూర్), వివేక్ గోయంకా (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ముంబై), మహేంద్ర మోహన్ గుప్తా (దైనిక్ జాగరణ్), ప్రదీప్ గుప్తా (డాటాక్విస్ట్), సంజయ్ గుప్తా (దైనిక్ జాగరణ్, వారణాసి), మోహిత్ జైన్ (ఎకనమిక్ టైమ్స్), ఎంవీ శ్రేయామ్స్ కుమార్ (మాతృభూమి ఆరోగ్య మాసిక), విలాస్ ఎ. మరాఠి (దైనిక్ హిందుస్తాన్, అమరావతి), హర్ష మాథ్యూ (వనిత), అనంత్ నాథ్ (గృహశోభిక, మరాఠి), ప్రతాప్ జి.పవార్ (సకల్), ఆర్ఎంఆర్ రమేశ్ (దినకరణ్), కె. రాజ ప్రసాద్ రెడ్డి (సాక్షి, విశాఖపట్నం), అతిదేవ్ సర్కార్ (ది టెలిగ్రాఫ్), శరద్ సక్సేనా (హిందుస్తాన్ టైమ్స్, పట్నా), రాకేశ్ శర్మ (ఆజ్ సమాజ్), ప్రవీణ్ సోమేశ్వర్ (ది హిందుస్తాన్ టైమ్స్), కిరణ్‌ఠాకూర్ (తరుణ్ భారత్, బెల్గాం), బిజూ వర్గీస్ (మంగళం వీక్లీ), వివేక్ వర్మ (ది ట్రిబ్యూన్), ఐ.వెంకట్ (సితార), తిలక్ కుమార్ (దెక్కన్ హెరాల్డ్, ప్రజావాణి), అఖిల ఉరంకార్ (బిజినెస్ స్టాండర్డ్), జయంత్ మమెన్ మాథ్యూ (మళయాళ మనోరమ). -
లోక్‌సభలో బీజేపీ నేతగా మోదీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ నేతగా ప్రధాని మోదీ, ఉపనేతగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నియమితులయ్యారు. బుధవారం ఇక్కడ సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకుంది. రాజ్యసభలో అధికార పార్టీ నేతగా బీజేపీకి చెందిన దళిత నేత, కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్, ఉపనేతగా పీయూష్ గోయెల్ నియమితులయ్యారు. చీఫ్ విప్‌గా సంజయ్ జైస్వాల్‌తోపాటు ప్రథమంగా ముగ్గురు మహిళా ఎంపీలను, వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 15 మంది లోక్‌సభ సభ్యులను విప్‌లుగా నియమించింది. రాజ్యసభ నుంచి కూడా ఆరుగురిని విప్‌లుగా ప్రకటించింది. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా లోక్‌సభ సభ్యులు గడ్కరీ, రవి శంకర్, అర్జున్ ముండా, నరేంద్ర తోమర్, జువల్ ఓరమ్, స్మృతీ ఇరానీ హాజరయ్యారు. అలాగే, రాజ్యసభ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా జేపీ నడ్డా, ఓ ప్రకాశ్ మాథుర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవడేకర్ పాల్గొన్నారు. ఎంపీలు కానందున మొదటిసారిగా ఈ కమిటీలో సభ్యులు కాని అగ్ర నేతలు, ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సమావేశానికి రాలేదు. బీజేపీ పార్లమెంటరీ కార్యాలయం ఇన్చార్జిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ, కార్యదర్శిగా తెలుగు వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. 16న పార్టీ బీజేపీ మొదటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. మోదీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా తెలుగు వ్యక్తి సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా తెలుగు వ్యక్తి అయిన కామర్సు బాలసుబ్రహ్మణ్యంను మరోసారి కొనసాగిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బాలసుబ్రహ్మణ్యంను బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టిన నేపథ్యంలో ఆయన్ను కార్యదర్శిగా కొనసాగించింది. 2007 నుంచి 2010 వరకు బీజేపీ జాతీయ మీడియా సహ కార్యదర్శిగా బాలసుబ్రహ్మణ్యం బాధ్యతలు నిర్వహించారు. నితిన్ గడ్కరీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లీగల్ సెల్ జాతీయ సహ కార్యదర్శిగా కూడా పని చేశారు. -
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక
-
గ్రూప్-1 అధికారులను జేసీలుగా నియమించాలి
ప్రభుత్వానికి తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం విజ్ఞప్తి హైదరాబాద్: నూతనంగా ఏర్పడుతున్న జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లుగా గ్రూప్-1 ద్వారా ఎంపికైన అధికారులను నియమించాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గ్రూప్-1 సర్వీస్‌లో ఎనిమిదేళ్లు పూర్తిచేసిన అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్)ను ఏర్పాటు చేసి ఆ అధికారులనే జాయింట్ కలెక్టర్, శాఖాధిపతులుగా నియమిస్తే పరిపాలనలో సమతుల్యత ఏర్పడుతుందని వారు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్లుగా రెవెన్యూ అధికారులను నియమిస్తే అది యాయవిరుద్ధమే కాకుండా వివిధ శాఖల్లో ప్రతిభావంతులైన అధికారులకు అన్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్, అధికారులు శశికిరణాచారి, అలోక్‌కుమార్, సర్వేశ్వర్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, పద్మజ, అనితాగ్రేస్, రఘుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ రాజధాని పాలనపై స్పష్టత
-
రైతులు కాదన్నా.. కైవసమే
రాజధాని భూములు బలవంతంగా లాక్కోవడానికి సర్కారు కొత్త బిల్లు ►నేడు మంత్రిమండలిలో చర్చించి ఆమోదం ►వీజీటీఎం రద్దు - ఆ పరిధికి మించి సీఆర్డీఏ ఏర్పాటు ►సీఎం చైర్మన్‌గా గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు ►మున్సిపల్ శాఖ అధికారి నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ►రాజధాని నగరం, రాజధాని ప్రాంతంపై వేర్వేరుగా నోటిఫికేషన్లు సాక్షి, హైదరాబాద్: ఏటా మూడు నాలుగు పంటలు పండే బంగారు భూములు కోల్పోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేమని రైతులు నిత్యం నినదిస్తున్నా... వాటినేమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. భూ సమీకరణపై ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలు వెల్లడించకుండానే రాజధానికి సంబంధించి భూములను కైవసం చేసుకోవడానికి ప్రభుత్వం పూర్వరంగం సిద్ధం చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ-కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ)ను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయబోతోంది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుఅధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశం సీఆర్డీఏకి ఆమోదముద్ర వేయనుంది. భూ సమీకరణపై ప్రభుత్వమే నేరుగా కాకుండా ఈ అథారిటీ ద్వారా వ్యవహారం నడిపించే ఎత్తుగడలో భాగంగానే దీనికి రూపకల్పన జరిగినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో రాజధాని కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం ఇంతవరకు నియమ నిబంధనలేవీ ప్రకటించలేదు. అలా ప్రకటించకపోగా భూ సమీకరణకు అంగీకరించని పక్షంలో బలవంతంగా భూములను సేకరిస్తామంటూ స్వయంగా సీఎం హెచ్చరించిన సందర్భాలూ ఉన్నాయి. భూములు కోల్పోయిన వారికి తగిన విధంగా పరిహారం వచ్చేలా చూస్తామని మంత్రులు ప్రకటనలు చేయడమే తప్ప ఏ మేరకు పరిహారం ఉంటుందన్న విషయం స్పష్టం చేయలేదు. దీనిపై అయోమయం కొనసాగుతుండగానే భూములను అప్పగించడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటనలు చేస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతాంగాన్ని మరింత గందరగోళంలో పడేశారు. మాయమాటలతో, మభ్యపెట్టే ప్రకటనలతో రైతులను నయానా భయానా ఒప్పించే కార్యక్రమాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం రాజధాని ఏర్పాటుపై అడుగులు ముందుకేస్తోంది. ఎవరెవరి భూములు సేకరిస్తారు? ఎంతమేరకు సేకరిస్తారు? వాటికి పరిహారంగా ఏం చెల్లించబోతున్నారు? రాజధాని పరిధి ఏంటి? వాటిల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు? రైతులందరినీ ఏం చేస్తారు? వంటి అంశాలపై స్పష్టత ఇవ్వకుండా, ఎలాంటి ప్రత్యామ్నాయాలుగానీ సమగ్రమైన విధానం గానీ ప్రకటించకుండానే.. ఫక్తు వ్యాపార ధోరణిలో భూ సమీకరణను మరింత సానుకూలం చేసుకోవడానికి సీఆర్డీఏ ద్వారా ప్రభుత్వం రంగంలోకి దిగనుంది. ఆ మేరకు సీఆర్డీఏపై ముసాయిదా బిల్లును రూపొందించింది. దీనికి మంగళవారం మంత్రిమండలి ఆమోద ముద్ర పడిన వెంటనే సీఆర్డీఏను కార్యరూపంలోకి తెస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. ప్రధానంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి అధ్యక్షతన గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే రాజధాని ప్రణాళిక, విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడానికి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి చైర్మన్‌గా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించనున్నారు. రాజధాని నిర్మాణంతో పాటు, ల్యాండ్ పూలింగ్ తదితర అంశాలన్నింటినీ ఎగ్జిక్యూటివ్ కమిటీయే పర్యవేక్షిస్తుంది. సీఆర్డీఏ ఏర్పాటు కాగానే ప్రస్తుతం ఉన్న విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం) రద్దు కానుందని, కొత్తగా ఏర్పాటయ్యే సీఆర్డీఏ వీజీటీఎం పరిధిని మించి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అథారిటీ ఏర్పాటు కాగానే ఆ పరిధిలోని స్థానిక సంస్థల అధికారాలన్నీ కూడా రద్దు అవుతాయని, ఆయా స్థానిక సంస్థల పరిధిలో ఏ నిర్ణయాన్ని అయినా అథారిటీయే తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అథారిటీ ఏర్పాటు కాగానే రాజధాని నగర పరిధిని, సరిహద్దులను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ అవుతుందని, అలాగే విడిగా రాజధాని ప్రాంత పరిధి, సరిహద్దులను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ అవుతుందని అధికారులు తెలిపారు. ఈ బిల్లులో ల్యాండ్ పూలింగ్ విధానం గురించి కూడా ఉంటుందని, అయితే పూర్తి వివరాలు, విధి విధానాలు అనంతరం రూపొందించే నిబంధనల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం కింద రైతుల ఇచ్చిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు సంవత్సరాల సమయం పడుతుందని ఉన్నతాధికారి తెలిపా రు. రైతులు ఎక్కడైతే భూములు ఇచ్చారో అక్కడే వారికి అభివృద్ధి చేసిన స్థలం ఇవ్వరని, మరో ప్రాంతంలో ఇస్తారని అధికార వర్గాలు తెలి పాయి. రాజధాని మధ్యలో రైతులు భూములను ఇస్తే అక్కడే అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వరని, మరో ప్రాంతంలో ఇస్తారని వివరించాయి. -
భారత బాక్సింగ్ సమాఖ్యపై వేటు
ఎన్నికలు జరిగే వరకు ఇంతే.. స్పష్టం చేసిన ఐబా న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆట పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో కార్యనిర్వాహక సిబ్బంది వ్యవహరిస్తున్నారనే కారణంతో.... అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా), ఐబీఎఫ్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. వివిధ వర్గాల నుంచి పలు ఫిర్యాదులు రావడంతో ఐబీఎఫ్‌పై ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నామని ఐబా పేర్కొంది. ‘ఈ కారణంగా భారత బాక్సర్లు, కోచ్‌లకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. సమస్య పరిష్కారమయ్యే వరకు వారు ఐబా పతాకం కింద పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనవచ్చు. ప్రస్తుత సభ్యులతో ఎలాంటి అధికారిక సంబంధాలు పెట్టుకోరాదని మా ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది’ అని ఐబా ప్రకటించింది. తాజాగా ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఎన్నికయ్యే వరకు ఐబీఎఫ్ను గుర్తించేది లేదని ఐబా అధ్యక్షుడు చింగ్ కూ వు స్పష్టం చేశారు. ఇప్పుడు తమకు మచ్చ లేని వ్యక్తుల అవసరం ఉందని, ఐబీఎఫ్‌పై ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బాధగానే ఉన్నా తప్పలేదని ఆయన అన్నారు. తమ కుటుంబంలో భారత సమాఖ్యకు అత్యంత ప్రాముఖ్యం ఉందని, అయితే ఇప్పటిదాకా ఉన్న నాయకత్వం చేష్టల వల్ల బాక్సర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. వీరి ద్వారా బాక్సింగ్ క్రీడకు మచ్చ వచ్చేలా ఉందని, అందుకే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. మరోవైపు ప్రస్తుత ఐబీఎఫ్ ఆఫీస్ బేరర్లను గుర్తించాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ఐబాకు లేఖ రాయడం కూడా ఈ పరిణామానికి దారి తీసిందనే కథనాలు వినిపిస్తున్నాయి. 2012 డిసెంబర్ 6న తొలిసారిగా బాక్సింగ్ సమాఖ్యపై ఐబా తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. అనంతరం ఎలాంటి అధికారిక కార్యకలాపాలను, భారత అధికారులను ఐబా గుర్తించడం లేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)చేత ఐఏఓ నిషేధం తొలగిన తర్వాత ఈ పరిస్థితిని సమీక్షిస్తామని గతంలో ఐబా హామీనిచ్చింది. కానీ ప్రస్తుత బాక్సింగ్ అధికారుల తీరు గురించి వివిధ వర్గాల నుంచి ఐబాకు అనేక ఫిర్యాదులు అందాయి. -
శ్రీధర్ లేఖపైనే చర్చ
సాక్షి, హైదరాబాద్: చాలా రోజుల తర్వాత జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశం ఆదివారం అర్ధాంతరంగా ముగిసింది. దీనిని ఈ నెల 21కి వాయిదా వేశారు. హెచ్‌సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. బీసీసీఐ పదవిలో ఉన్న తాను ఇక్కడి బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నానంటూ శ్రీధర్ పంపిన లేఖపైనే సమావేశంలో వాదోపవాదాలు జరిగినట్లు సమాచారం. ముగ్గురు ఉపాధ్యక్షులు శివలాల్ యాదవ్, వెంకటపతి రాజు, ఇ. వెంకట్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు. రాజీనామాపై చర్చ... గత ఆరు నెలల కాలంలో ఒక్క సారి కూడా సమావేశం కాని హెచ్‌సీఏ ఈసీ ఆదివారం రోజు సమావేశమైంది. అధ్యక్షుడు జి. వినోద్ దీనిని నిర్వహించారు. బీసీసీఐ వ్యవహారాల్లో బిజీగా ఉన్నందున తాను సమావేశానికి రాలేకపోతున్నానని, సంయుక్త కార్యదర్శి ద్వారా అన్ని కార్యకలాపాలు నిర్వహించాలని కోరుతూ శ్రీధర్ తనకు లేఖ రాశారని చెబుతూ ఈ సందర్భంగా వినోద్ దానిని చదివి వినిపించారు. అయితే ఈసీ సభ్యులు దీనిపైనే తమ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. శ్రీధర్ రాసిన లేఖ తమకు చూపించాలని, అప్పుడే ఇతర అంశాలపై చర్చిస్తామని వారు కోరినట్లు తెలిసింది. అయితే దీనికి వినోద్ అంగీకరించలేదు. దాంతో సమావేశంలో వాదోపవాదాలు జరిగాయి. శ్రీధర్ అసలు సెలవు కోరుతున్నారా...లేక పూర్తిగా రాజీనామా చేస్తారా తమకు స్పష్టం కావాలని ఈసీ సభ్యులు అడిగారు. అందుకే ఆయన స్వయంగా పంపిన లేఖను చూపించాలని ఒక ఈసీ సభ్యుడు కోరారు. శ్రీధర్ రాజీనామా చేస్తే మరో కార్యదర్శిని ఎంపిక చేసుకుంటామని, అప్పుడే హెచ్‌సీఏ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించగమని మరో ఈసీ సభ్యుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరి వరకు వినోద్ దానిని చూపించలేదు. దాంతో ఈ నెల 21 వరకు గడువిస్తున్నామని, శ్రీధర్ అంశంపై స్పష్టత వచ్చాకే మళ్లీ సమావేశమంటూ ఈసీ సభ్యులు నిష్ర్కమించారు.