మరింత సమర్థంగా ‘ప్రత్యక్ష నగదు బదిలీ’ | State level committee headed by CM with several ministers | Sakshi
Sakshi News home page

మరింత సమర్థంగా ‘ప్రత్యక్ష నగదు బదిలీ’

Published Sat, May 13 2023 4:54 AM | Last Updated on Sat, May 13 2023 4:54 AM

State level committee headed by CM with several ministers - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. పథకాల అమలులో పారదర్శకతకు, నిష్పాక్షికతకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి పథకాన్ని ప్రతి లబ్ధిదారుకి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తోంది. దీని ద్వారా అవినీతి, ఆశ్రితపక్షపాతానికి తావు లేకుండా పథకం ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రత్యక్ష నగదు బదిలీని మరింత సమర్ధంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది.

ముఖ్యమంత్రి అధ్యక్షతన పలువురు మంత్రులు సభ్యులుగా రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అధ్యక్షతన పలు శాఖల అధికారులు సభ్యులుగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

‘ప్రత్యక్ష నగదు బదిలీకి అత్యంత సానుకూల ప్రభావం ఉన్న నేపథ్యంలో పథకాల వర్క్‌ఫ్లోను నిరంతరం క్రమబద్ధీకరించడంతో పాటు కొత్తగా వస్తున్న సాంకేతికతలను స్వీకరించడం, వివిధ విభాగాలను సమన్వయం చేయడం, లీకేజీలను తగ్గించడం బదిలీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవరత్నాల్లోని పలు పధకాలను ప్రత్యక్ష నగుదు బదిలీ ద్వారా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది.

వివిధ పథకాల లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా ఆర్ధిక సాయం అందుతోంది. సమర్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఎటువంటి లీకేజీ లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ అమలవుతోంది అనడానికి లబ్ధిదారులే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నారు. అలాగే ఈ విధానం సామాజిక శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతోంది. లబ్ధిదారులతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. ఇలాంటి ప్రత్యక్ష నగదు బదిలీని మరింత సమర్ధంగా అమలు చేయడం కోసమే సమన్వయ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది’ అని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.


రాష్ట్రస్థాయి ప్రత్యక్ష నగదు బదిలీ కమిటీ
ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, ఐటీ, పరిశ్రమలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, కార్మిక, ఉపాధి, శిక్షణ, మహిళా, శిశు అభి­వృద్ధి శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధా­న కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీకి ముఖ్యమంత్రి ఏ మంత్రినైనా లేదా నిపుణులనైనా ఆహ్వానించవచ్చు.

రాష్ట్రస్థాయి కమిటీ లక్ష్యాలు
రాష్ట్రస్థాయి కమిటీ ప్రత్యక్ష నగదు బదిలీకి విస్తృత దృష్టితో దిశను నిర్ధారిస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ విస్తృత విధానాలు, లక్ష్యాలు, వ్యూహాలను రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. మరింత సమర్ధత, పారదర్శకత, జవాబుదారీ పెంపొందించే లక్ష్యాలను నిర్ధారిస్తుంది.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్థిక శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళికా శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి సభ్య కన్వీనర్‌గా ఉంటారు.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ లక్ష్యాలు
ఎగ్జిక్యూటివ్‌ కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాల అమలుకు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement