మేనిఫెస్టో ప్రకటించాక సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మలివిడత ప్రచారానికి జన నీరాజనం
మండుటెండల్లోనూ తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు సభలకు పోటెత్తిన జనసంద్రం
సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రను తలపిస్తూ జన ప్రభంజనం
58 నెలల్లో చేసిన మంచిని వివరించిన వైఎస్సార్‌సీపీ అధినేత
చంద్రబాబు మోసాలపై నిప్పులు
సీఎం ప్రసంగాలకు భారీ జనస్పందన..
మళ్లీ గెలిపించడానికి మేమంతా సిద్ధం అంటూ ప్రజల జయజయధ్వానాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఎన్నికల మలి విడత ప్రచారానికి జనం పోటెత్తారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రను తలపిస్తూ వెల్లువలా తరలివచ్చారు. ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా వెంకటగిరి, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలకు మండుటెండల్లోనూ ప్రజలు ప్రభంజనంలా కదిలివచ్చారు. తీవ్ర ఎండను, ఉక్కపోతను ఖాతరు చేయకుండా సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగాన్ని ఆసాంతం ఆసక్తితో విన్నారు. గత 58 నెలల్లో చేసిన మంచిని సీఎం వివరించారు.
ఈ పథకాలు మళ్లీ కొనసాగాలన్నా.. మరింత మేలు జరగాలన్నా.. పేదింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన కావాలన్నా.. మన పిల్లల బడులు బాగుపడాలన్నా.. ఆస్పత్రులు, వ్యవసాయం మరింత మెరుగుపడాలన్నా మన ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కడానికి మీరంతా సిద్ధమేనా అని సీఎం జగన్ అడగ్గా మేమంతా సిద్ధమేనంటూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రజలు నినదించారు.
లక్షలాది మంది పిడికిళ్లు ఒక్కసారిగా పైకి లేపడంతో తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు దద్దరిల్లిపోయాయి. వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలూ పూర్తి స్థాయిలో ఆమోదించారనడానికి మూడు సభల్లో ఉవ్వెత్తున ఎగిసిన జనకెరటాలే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రచారాలకు జనస్పందన కనిపించడం లేదు. మొన్న సిద్ధం సభలు.. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేడు మలి విడత ప్రచారంలో తొలి రోజు నిర్వహించిన సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్‌సీపీదే అధికారమని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు.
తరలివచ్చిన తాడిపత్రి..
ఎన్నికల మలి విడత ప్రచారానికి అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు గ్రామాలకు గ్రామాలు తరలివచ్చారు. హెలీప్యాడ్ నుంచి సభ జరిగే వైఎస్సార్ సర్కిల్‌కు చేరుకునే వరకూ సీఎం జగన్ కాన్వాయ్ వెంట వేలాది మంది పరుగులు తీశారు.
సభా ప్రాంగణానికి ఉదయం 11.55 గంటలకు చేరుకునే సరికి ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అప్పటికే 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయలేదు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంటా తెచ్చిన విప్లవాత్మక మార్పులను సీఎం జగన్ వివరించారు.
2014–19 మధ్య బీజేపీ, జనసేనతో కూటమి కట్టి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు అదే కూటమి కట్టి అడ్డగోలు హామీలు ఇస్తూ వస్తున్న చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తలపెట్టడమేనని చాటిచెబుతూ సీఎం చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
వెల్లువెత్తిన వెంకటగిరి..
తిరుపతి జిల్లా వెంకటగిరిలో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న వేలాది మంది ప్రజలు వెల్లువలా పోటెత్తారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రత, విపరీతమైన ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నా వెనుకడుగేయలేదు. సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకునే సరికి మధ్యాహ్నం 2.25 గంటలైంది. దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా జనం నిల్చున్న ప్రాంతం నుంచి కదల్లేదు.
సీఎం జగన్‌ను చూడగానే హర్షధ్వానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని.. మన తలరాతలు మారుస్తాయని.. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది.. ఎవరితో ఆ మంచి కొనసాగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దీంతో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదిస్తూ వేలాది మంది ఒక్కసారిగా జయజయధ్వానాలు చేశారు.
కదిలివచ్చిన కందుకూరు
నెల్లూరు జిల్లా కందుకూరులో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ఉంటుందని తెలుసుకున్న ఆ నియోజకవర్గ ప్రజలు ఉదయం 10 గంటల నుంచే భారీ ఎత్తున కదిలివచ్చారు. దాంతో మధ్యాహ్నం 12 గంటలకే కందుకూరు జనసంద్రంగా మారింది. కందుకూరులో హెలీప్యాడ్ నుంచి సభ జరిగే కేఎంసీ సర్కిల్ వరకూ సీఎం జగన్ కాన్వాయ్ వెంట జనం పరుగులు తీశారు. ఆయనను దగ్గరి నుంచి చూసేందుకు పోటీపడ్డారు. సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకునే సరికి సాయంత్రం 4 గంటలైంది. అప్పటికి 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అంతటి ఎండలోనూ గంటలకొద్దీ నిలబడ్డ జనం సీఎం జగన్‌ను చూడగానే ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
సీఎం జగన్ ప్రసంగాన్ని జనం శ్రద్ధగా విన్నారు. ‘సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చంద్రబాబులా బడాయి మాటలు నేను చెప్పడం లేదు. 58 నెలల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు ఉంచి మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతున్నాడు’ అని సీఎం జగన్ చేసిన విజ్ఞప్తికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ‘మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. దీనికి ప్రజలు సైతం శ్రుతి కలపడం విశేషం.
మండుటెండల్లోనూ, తీవ్రమైన ఉక్కపోతల్లోనూ మూడు సభలకు పోటాపోటీగా జనం కదిలిరావడం.. ఒకదానికి మించి ఒకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో రాబోయేది ఫ్యాన్ సునామీయేనని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. ప్రచారం సాగే కొద్దీ వైఎస్సార్‌సీపీ ప్రభంజనం అంతకంతకూ పెరగడం ఖాయమని.. ఇది చూసి పోలింగ్‌కు ముందే కూటమి నేతలు, శ్రేణులు కాడి పారేయడం తథ్యమని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment