ఎన్నికలు జరిగే వరకు ఇంతే..
స్పష్టం చేసిన ఐబా
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆట పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో కార్యనిర్వాహక సిబ్బంది వ్యవహరిస్తున్నారనే కారణంతో.... అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా), ఐబీఎఫ్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. వివిధ వర్గాల నుంచి పలు ఫిర్యాదులు రావడంతో ఐబీఎఫ్‌పై ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నామని ఐబా పేర్కొంది.
‘ఈ కారణంగా భారత బాక్సర్లు, కోచ్‌లకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. సమస్య పరిష్కారమయ్యే వరకు వారు ఐబా పతాకం కింద పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనవచ్చు. ప్రస్తుత సభ్యులతో ఎలాంటి అధికారిక సంబంధాలు పెట్టుకోరాదని మా ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది’ అని ఐబా ప్రకటించింది. తాజాగా ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఎన్నికయ్యే వరకు ఐబీఎఫ్‌ను గుర్తించేది లేదని ఐబా అధ్యక్షుడు చింగ్ కూ వు స్పష్టం చేశారు. ఇప్పుడు తమకు మచ్చ లేని వ్యక్తుల అవసరం ఉందని, ఐబీఎఫ్‌పై ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బాధగానే ఉన్నా తప్పలేదని ఆయన అన్నారు. తమ కుటుంబంలో భారత సమాఖ్యకు అత్యంత ప్రాముఖ్యం ఉందని, అయితే ఇప్పటిదాకా ఉన్న నాయకత్వం చేష్టల వల్ల బాక్సర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. వీరి ద్వారా బాక్సింగ్ క్రీడకు మచ్చ వచ్చేలా ఉందని, అందుకే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
మరోవైపు ప్రస్తుత ఐబీఎఫ్ ఆఫీస్ బేరర్లను గుర్తించాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ఐబాకు లేఖ రాయడం కూడా ఈ పరిణామానికి దారి తీసిందనే కథనాలు వినిపిస్తున్నాయి. 2012 డిసెంబర్ 6న తొలిసారిగా బాక్సింగ్ సమాఖ్యపై ఐబా తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. అనంతరం ఎలాంటి అధికారిక కార్యకలాపాలను, భారత అధికారులను ఐబా గుర్తించడం లేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)చేత ఐఏఓ నిషేధం తొలగిన తర్వాత ఈ పరిస్థితిని సమీక్షిస్తామని గతంలో ఐబా హామీనిచ్చింది. కానీ ప్రస్తుత బాక్సింగ్ అధికారుల తీరు గురించి వివిధ వర్గాల నుంచి ఐబాకు అనేక ఫిర్యాదులు అందాయి.
భారత బాక్సింగ్ సమాఖ్యపై వేటు
Published Wed, Mar 5 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement