ఈసీల్లేవు..వీసీల్లేరు! | OU Professor Battu Satyanarayana Speaks Over Universities Development | Sakshi
Sakshi News home page

ఈసీల్లేవు..వీసీల్లేరు!

Published Mon, Nov 4 2019 4:54 AM | Last Updated on Mon, Nov 4 2019 4:54 AM

OU Professor Battu Satyanarayana Speaks Over Universities Development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు (ఈసీ), వీసీలు లేకపోవడంతో యూనివర్సిటీల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. నియామకాలపై దృష్టి పెట్టేవారు లేరు. నిధుల సద్వినియోగానికి చర్యలు చేపట్టే వారు లేరు. ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడుతోంది. యూనివర్సిటీల్లో ఏ పని చేయాలన్నా, విధానపర నిర్ణయం తీసుకోవాలన్నా నిపుణులు, అధ్యాపకులు, ప్రముఖులు మొత్తంగా 13 మందితో కూడిన పూర్తి స్థాయి ఈసీలు ఉండాల్సిందే. కానీ అవి లేకపోవడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండాపోతోంది. ఈసీలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉండే ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు, వైస్‌ చాన్స్‌లర్‌ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గత ఐదేళ్లుగా పక్కన పడేసింది. ఒక్క జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) తప్ప మిగతా యూనివర్సిటీలకు ఈసీలను నియమించాలన్న విషయాన్నే పట్టించుకోవడం లేదు.

కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప.. 
యూనివర్సిటీలకు ఈసీలను నియమించే విషయంలో ఎవరో ఒకరు అడిగితే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. కాకతీయ యూనివర్సిటీకి గత నెల 13వ తేదీన ఆగమేఘాలపై ఈసీని నియమించింది. ఆ యూనివర్సిటీ ఈసీ సభ్యుల నియామకం విషయంలో సుప్రీంకోర్టులో కేసు గత నెల 15వ తేదీన హియరింగ్‌ ఉండటంతో పూర్తి స్థాయి ఈసీని నియమించింది. మరోవైపు వైస్‌ చాన్స్‌లర్ల నియామకం కోసం సెర్చ్‌ కమిటీలను ఏర్పాటుచేసినా, అవి ఇంతవరకు సమావేశమైందీ లేదు. వీసీ పదవి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిందీ లేదు.

2010లోనే ఈసీల రద్దు.. 
రాష్ట్రంలోని యూనివర్సిటీల ఈసీలు 2010లోనే రద్దు అయ్యాయి. 2010 ఏప్రిల్‌ 9వ తేదీన కాకతీయ యూనివర్సిటీ పాలక మండలిని ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో పాటు ఉస్మానియా, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ ఓపెన్, తెలుగు యూనివర్సిటీల పాలక మండళ్లను రద్దు చేసింది. ఆ తరువాత 2011 నవంబర్‌ 15వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీతోపాటు మిగతా యూనివర్సిటీలకు ఈసీలను నియమించింది. అందులో కాకతీయ యూనివర్సిటీకి ఈసీని నియమించలేదు. ఆ పదవీ కాలం కూడా 2014తోనే పూర్తయిపోయింది. అప్పటి నుంచి వాటికి పూర్తి స్థాయి ఈసీలే లేకుండాపోయాయి.

పూర్తి స్థాయి ఈసీలు ఉంటే... 
ప్రతి యూనివర్సిటీ ఈసీకి ఆ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ) చైర్మన్‌గా ఉంటారు. అలాగే విద్యాశాఖ, ఆర్థిక శాఖ, కళాశాల విద్యా కమిషనర్‌ (టెక్నికల్‌ యూనివర్సిటీ అయితే సాంకేతిక విద్యా కమిషనర్‌) ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఇక యూనివర్సిటీ కాలేజీల నుంచి ఒక ప్రిన్సిపాల్, ఇద్దరు అధ్యాపకులు, డిగ్రీ కాలేజీల నుంచి ఒక ప్రిన్సిపాల్, ఒక అధ్యాపకుడు, సమాజంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు/నిపుణులు నలుగురు కలుపుకొని మొత్తంగా 13 మంది సభ్యులు ఈసీలో ఉంటారు. ఆ యూనివర్సిటీ రెక్టార్‌ ఉంటే అతను కూడా ఈసీలో సభ్యులుగా ఉంటారు. ఇలాంటి కమిటీ తీసుకునే నిర్ణయమే విధానంగా మారుతుంది. యూనివర్సిటీకి సంబంధించి ఏ పని చేయాలన్నా ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే. దానినే వైస్‌ చాన్స్‌లర్‌ అమలు చేస్తారు. అంతేకాదు అడ్మినిస్ట్రేషన్, అకడమిక్, ప్రమోషన్స్, ఉద్యోగాల భర్తీ, సైంటిఫిక్‌ పరికరాలు, ల్యాబ్‌ వస్తువుల కొనుగోలు, యూజీసీ నిధుల వినియోగం ఇలా అన్నింటికి ఈసీ ఆమోదం ఉండాల్సిందే.

►కాకతీయ వర్సిటీలో పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ లేకుండానే ఏడేళ్ల క్రితం చేపట్టిన నియామకాలను ఈసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉండే ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు, వీసీ అప్రూవ్‌ చేశారు. ఈసీ లేకుండా ఎలా అప్రూవ్‌ చేస్తారంటూ ఒకరు కోర్టును ఆశ్రయించడంతో ఆ సెలెక్షన్స్‌ను కోర్టు కొట్టివేసింది.
►2015, 2016 సంవత్సరాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, యూజీసీ నుంచి వచ్చిన ప్రాజెక్టు నిధులను పూర్తి స్థాయి ఈసీ సద్వినియోగపరచుకోకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి.
►2016లో జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వీసీ నియామకం కోసం ఏర్పాటుచేసిన సెర్చ్‌ కమిటీలో వర్సిటీ నామినీని నియమించారు. పూర్తి స్థాయి ఈసీ లేకుండా, దాని అప్రూవల్‌ లేకుండా వర్సిటీ నామినీని ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఎలా నామినేట్‌ చేస్తారని ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పూర్తిస్థాయి ఈసీని నియమించాల్సి వచ్చింది.
►ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వైస్‌ చాన్స్‌లర్లు (వీసీ) లేరు. 2016లో నియమితులైన వీసీల పదవీ కాలం జూన్, జూలై నెలల్లోనే ముగిసిపోయింది. ఇన్‌చార్జి వీసీలుగా ఉన్న ఐఏఎస్‌ అధికారులు వర్సిటీలను పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది.

అకడమిక్‌ మార్పుల కోసమైనా ఈసీలు ఉండాల్సిందే 
ఈసీలో ఎక్స్‌అఫీషియో మెంబర్స్‌గా ఉండే వారు తీసుకునే నిర్ణయాలు వ్యాలిడ్‌ కావు. కోర్టులో అవి నిలబడవు. అకడమిక్‌ అంశాలు చూసేందుకు నిపుణులు అవసరం. మార్పులు చేయాలన్నా వారు ఉండాల్సిందే. విభాగాలు చేసే అకడమిక్‌ మార్పులను ఈసీ పరిశీలించి విధానపర నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. అకడమిక్‌ కేలండర్‌ సరిగ్గా అమలు కావడం లేదు. జూలై నెలలో ప్రారంభం కావాల్సిన అకడమిక్‌ ఇయర్‌ సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. పీజీ పరీక్షలు నిర్వహించిన నెల రోజుల్లో ఫలితాలు ఇవ్వాలి. ఆరు నెలల వరకు కూడా కొన్ని పరీక్షల ఫలితాలు రావడం లేదు.
– ప్రొఫెసర్‌ భట్టు సత్యనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement