osmania university professor
-
జెనెటిక్ వైద్యులు, శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: జెనెటిక్ వైద్యులు, శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి (92) కన్నుమూశారు. దేశంలో జెనెటిక్స్ను ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి ప్రారంభించారు. ఉస్మానియా వర్సిటీకి సుదీర్ఘ కాలం ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి సేవలు అందించారు. జెనెటిక్స్ ప్రపంచంలో దాదాపు 5 వేల రకాల రోగాలు, జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయనేది నిపుణుల మాట. ప్రస్తుత కాలంలో దంత సమస్యలు కూడా ఈ అనువంశిక రోగాల జాబితాలో చేరిపోయాయి. వీటికి సంబంధించి చికిత్సలను అందించాలన్నా, రాకుండా నిరోధించాలన్నా జన్యుశాస్త్ర నిపుణుల పాత్ర చాలా కీలకం కానుంది. -
గబ్బిలాలతో కరోనా.. అబద్ధమే!
సాక్షి, హైదరాబాద్: గబ్బిలాలతో కరోనా మనుషులకు సోకిందనడం అబద్ధమేనని, అలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని బ్యాట్ బయాలజిస్ట్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) బ్యాట్ స్పెషలిస్ట్ గ్రూప్ సభ్యుడు డాక్టర్ చెల్మల శ్రీనివాసులు పేర్కొన్నారు. గబ్బిలాల్లో ఉన్న వైరస్‌కు కరోనాకు సంబంధం లేదని తెలిపారు. కరోనా పులుసు పంది నుంచి (ప్యాంగోలిన్) నుంచి మనుషులకు సోకిన ట్లు పరిశోధనల్లో తేలిందని, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌వో) ప్రకటించిందన్నారు. అయినా గబ్బిలాలతో ఈ వైరస్ సోకుతుందని అపోహలు ప్రజల్లో పెరిగిపోయాయని, అందుకు అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ స్టడీస్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాసులు గత 25 ఏళ్లుగా సౌత్ ఏషియాలో గబ్బిలాలపై ఆయన పరిశోధన చేస్తున్నారు. కొత్త వైరస్ అనగానే గబ్బిలాలపై ఎందుకు అనుమానం వస్తుందన్న దానిపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. గబ్బిలాల్లో 40 శాతం వరకు.. కరోనా జాతికి చెందిన 100 రకాల వైరస్‌ల్లో 80 శాతం వైరస్లు అటవీ జంతువులు, పక్షుల్లోనే ఉంటాయి. వీటిలో 40 శాతం వైరస్లు ఒక్క గబ్బిలాల్లోనే ఉంటాయి. మిగిలిన 20 శాతం వైరస్లు పెంపుడు జంతువులు, పక్షుల్లో ఉండగా, అందులో ఒక్కోసారి ఒక్కో వైరస్ మనుషులకు సోకుతుంది. ఎక్కువ శాతం వాటిని తినడంతోనే వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏ కొత్త వైరస్‌తో వ్యాధి ప్రబలినా ముందుగా అనుమానం వచ్చేది గబ్బిలంపైనే. ఇతర జంతువులు, పక్షుల కంటే దానిపైనే ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత 20 ఏళ్లలో వైరస్ల కారణంగా ఏ వ్యాధి ప్రబలినా ముందుగా గబ్బిలాలపై చేసిన పరిశోధనలే బయటకొచ్చాయి. కొంత మేర ఆ వ్యాధులకు కారణమైన వైరస్లు గబ్బిలాల్లో ఉండటం, ఆ పరిశోధనలు ముందుగా బయటకు రావడంతో ప్రజల్లో గబ్బిలాలపై అనుమానాలు పెరిగిపోయాయి. అన్ని వ్యాధుల్లోనూ గబ్బిలాల్లో ఉన్న వైరస్‌కు, మనిషికి సోకిన వైరస్‌కు వంద శాతం మ్యాచ్ కాకపోవడంతో తర్వాత లోతైన పరిశోధనల్లో ఇతర జంతువుల వల్ల ఆ వైరస్లు మనిషికి సోకినట్లు తేలింది. సార్స్ సమయం నుంచి మెుదలుకొని.. 2000 సంవత్సరంలో ప్రబలిన సార్స్.. కరోనా–1 వైరస్ కూడా గబ్బిలాల నుంచే వచ్చిందని చైనాలో శాస్త్రవేత్తలు ప్రాథమికంగా ప్రకటించారు. అయితే సార్స్ సంబంధ వైరస్ గబ్బిలాల్లో ఉన్నా 100 శాతం మ్యాచ్ కాలేదు. దీంతో లోతుగా పరిశోధన చేస్తే పునుగు పిల్లి నుంచి కరోనా–1 వైరస్ మనుషులకు సోకిందని తేల్చింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. తర్వాత 2013–14లో మిడిల్ ఈస్టర్న్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) సోకినప్పుడు.. అదీ గబ్బిలాల వల్లే వచ్చిందని యూరోప్ దేశాలు పేర్కొన్నాయి. అప్పుడూ వైరస్ వంద శాతం మ్యాచ్ కాకపోవడంతో మళ్లీ పరిశోధన చేస్తే ఒంటె నుంచి సోకిందని తేలింది. ఎబోలా వచ్చినప్పుడు కూడా మెుదట గబ్బిలాలనే అనుమానించారు. తర్వాత గొరిల్లా నుంచి సోకినట్లు వెల్లడైంది. ఇప్పుడు చైనాలోని వూహాన్లో ప్రబలిన కరోనాకు కూడా మెుదట్లో చేపలు అని, తర్వాత పాములని, అనంతరం గబ్బిలాల కారణంగా సోకిందని చెబుతూ వచ్చారు. అయితే వూహాన్లో మనుషులకు సోకిన వైరస్‌కు గబ్బిలం నుంచి వచ్చిన వైరస్‌కు 90 శాతమే మ్యాచ్ అయింది. మిగతా 10 శాతం ఎందుకు మ్యాచ్ కాలేదని పరిశోధన చేస్తే కరోనా సోకింది గబ్బిలాల వల్ల కాదని తేలింది. పులుసు పంది (ప్యాంగోలిన్) నుంచి మనుషులకు సోకిందని వెల్లడైంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. అనవసర భయాలతో చంపొద్దు.. గబ్బిలాలతో కరోనా వచ్చిందన్నది అబద్ధమే. సోషల్ మీడియా కారణంగా వాటిపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఎబోలా సోకినప్పుడు వందల సంఖ్యలో గబ్బిలాలనే చంపేశారు. ఇప్పుడు అలాంటివి చేయెుద్దు. పర్యావరణ పరిరక్షణకు, మానవ ఉనికికి గబ్బిలాలు ఎంతో ముఖ్యం. వీటిలో ప్రధానంగా ఫల బక్షి గబ్బిలాలు, కీటక బక్షి గబ్బిలాలు ఉంటాయి. ఫల బక్షి గబ్బిలాలు అరుదైన వృక్ష జాతుల ఫలాలను తిని వాటి విత్తనాలను ఇతర ప్రాంతాల్లో విసర్జించడం ద్వారా వృక్షాల విస్తరణకు తోడ్పడతాయి. కీటక బక్షి గబ్బిలాలు.. రాత్రి వేళల్లో పంట పొలాలను పాడు చేసే కీటకాలను తింటూ రైతులకు ఎంతో మేలు చేస్తాయి. ఇక మన రాష్ట్రంలో 17 రకాల గబ్బిలాలు ఉండగా, అందులో 5 రకాల గబ్బిలాలు హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. పట్టణాల్లో ఈ గబ్బిలాల కారణంగా దోమల బెడద తగ్గుతోంది. పట్టణాల్లో ఉంటున్న గబ్బిలాలు తమ ఆహారంగా దోమలనే 30 శాతం తింటున్నట్లు తేలింది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడమే ప్రధానం. జూనోటిక్ వ్యాధుల వ్యాప్తిని తగ్గించడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. నిర్ధిష్ట మానవ కార్యకలాపాలను, అడవి జంతువులను తినడాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని నియంత్రించడం ద్వారా ఇలాంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. -
ఎక్కడో బద్దలైతే ఇక్కడ కంపిస్తుంది!
సాక్షి, హైదరాబాద్: వేల మైళ్ల దూరంలో అగ్నిపర్వతం బద్దలైతే మన దగ్గర భూమి కంపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూప్రకంపనలకు అదే కారణమన్న విషయాన్ని కొట్టిపారేయలేమని వారు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. ఆ ప్రభావం కారణంగా కంపనాలు చోటుచేసుకోవచ్చని ఉస్మానియా విశ్వవిద్యాలయ జియోఫిజిక్స్ విభాగం విశ్రాంత అధిపతి ప్రొఫెసర్ జి.రాందాస్ అభిప్రాయపడుతున్నారు. ‘కచ్చితంగా అదే కారణం అని చెప్పలేకున్నా.. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భూఅంతర్భాగంలో విపరీతమైన శక్తి ఉత్పన్నమై భూ పొరల్లో చలనం ఏర్పడుతుంది. దీంతో భూ ఫలకాలు కదిలి పరస్పరం ఢీకొని ప్రకంపనలు జరిగే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్భవించిన ప్రకంపనలకు అది కారణం కాదని కూడా చెప్పలేం’అని పేర్కొన్నారు. క్వారీ పేలుళ్ల వల్ల మాత్రం ఈ ప్రకంపనలు ఏర్పడలేదని పేర్కొన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రమాదమేమీ కాదు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలు భూకంప ప్రభావిత ప్రాంత పరిధిలో ఉన్నాయి. కానీ, ప్రమాదకర జోన్లో మాత్రం లేవు. ప్రస్తుతం భూమి కంపించిన ప్రధాన ప్రాంతమైన సూర్యాపేట పరిసరాలు సహా తెలంగాణ పరిధి భూకంప ప్రభావం అంతగా లేని రెండో జోన్ పరిధిలో ఉండగా, ఏపీ ప్రాంతం రెండో జోన్లో, విజయవాడ పరిసరాలు లాంటి కొన్ని ప్రాంతాలు మూడో జోన్ పరిధిలో ఉన్నాయి. కానీ, ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదు కావటం కొంత ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఇంత తీవ్రతతో భూమి కంపించలేదు. జోన్ పరిధి మారనుందా.. ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రమాదం కాని జోన్ పరిధిలో ఉన్నాయి. కానీ తాజా ప్రకంపనలు కొంత శక్తిమంతమైనవే. అంత తీవ్రతతో మళ్లీ కొన్నిసార్లు ప్రకంపనలు వస్తే మాత్రం కచ్చితంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని గుర్తించాల్సి ఉంటుంది. ప్రమాదం తరచూ సంభవించదు. కానీ ఉన్నట్టుండి భారీ ప్రకంపనలు చోటు చేసుకుంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అలా అని భయాందోళనలు చెందాల్సిన పనిలేదు. మళ్లీ ఆ స్థాయి ప్రకంపనలు తక్కువ సమయంలో పలుసార్లు ఏర్పడితేనే ఆందోళన చెందాలి. అమరావతి వైపు వస్తే భారీ నష్టమే.. ఆదివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా వెల్లటూరు కేంద్రంగా ఏర్పడ్డ భూ ప్రకంపనలు తెలంగాణ వైపు ప్రభావం చూపాయి. కానీ, ప్రకంపనల దిశ అమరావతి వైపు ఉండి ఉంటే అక్కడ కచ్చితంగా నష్టం జరిగి ఉండేది. ఇక్కడ నమోదైన 4.7 ప్రభావం అమరావతి పరిసరాల్లో ఏర్పడితే భవనాలు కూలి ఉండేవి. తెలంగాణ వైపు గట్టి నేల ఉండటంతో పాటు, సముద్ర మట్టానికి 300 నుంచి 600 మీటర్ల ఎత్తుతో భూమి ఉపరితలం ఎగుడు దిగుడుగా ఏర్పడి ఉంది. భూమి పొరల్లో కలిగిన మార్పులే దీనికి కారణం. అవి భూకంప తరంగాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ప్రకృతిసిద్ధ ఏర్పాటు అమరావతివైపు లేదు. ఫలితంగా ప్రకంపనల ప్రభావం తగ్గదు. సాధారణంగా రిక్టర్‌స్కేల్‌పై 4 నమోదైతే భారీ నిర్మాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఢిల్లీ ప్రమాదకర 4వ జోన్ పరిధిలో ఉన్నా, అక్కడి నేల గట్టిది. ఫలితంగా ఢిల్లీ కంటే విజయవాడ పరిసరాలే ప్రమాదకరంగా మారతాయి. అప్పుడే హెచ్చరించారు ఎన్జీఆర్ఐ విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త చడ్డా గతంలోనే విజయవాడ పరిసరాలపై భూకంప ప్రభావం ఉండే అవకాశం ఉండొచ్చని హెచ్చరించారు. గరిష్టంగా రిక్టర్‌స్కేల్‌పై 6.5 వరకు నమోదయ్యే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. కానీ అది ఎప్పుడోతప్ప నమోదయ్యే అవకాశం లేదన్నారు. నదీ సంగమాల ప్రభావం కూడా ప్రకంపనాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుందని, మూసీ–కృష్ణా సంగమం ఉండే సూర్యాపేట జిల్లా పరిధిలో భూగర్భంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కృష్ణాతీరం కూడా దీనికి మినహాయింపు కాదు. మేం వజ్రాలకు సంబంధించి ఈ ప్రాంతంలో పరిశోధన జరిపినప్పుడు, భూమి పొరల్లో భారీ పగుళ్లున్న విషయాన్ని గుర్తించాం. భూగర్భంలోని కోర్ ప్రాంతంలో విపరీతమైన శక్తి ఉత్పన్నమైనప్పుడు అది ఈ పగుళ్ల నుంచే వెలుపలికి వస్తుంది. అది ప్రకంపనలకు అవకాశం ఇస్తుంది. విజయవాడ చుట్టు ఇలాంటి భారీ పగుళ్లు దాదాపు 22 వరకు ఉన్నట్టు గతంలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి హైదరాబాద్‌తో పోలిస్తే విజయవాడవైపు ఎక్కువగా ఉన్నాయి. మితిమీరిన బోరు తవ్వకాలు మంచిది కాదు ప్రస్తుతం హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ల కోసం 1,200 నుంచి 2 వేల అడుగుల వరకు బోర్లు వేస్తున్నారు. అలాగే నీటి ప్రవాహానికి ఉన్న సహజసిద్ధ మార్గాలను మూసేస్తున్నారు. ఈ రెండు చర్యలు భూమి పొరల్లో మార్పులకు కారణమవుతాయి. అవి కూడా భూకంపాలకు అవకాశం కలిగించొచ్చు. ఈ తీరును నిరోధించే చర్యలు కచ్చితంగా తీసుకోవాలి. లేకుంటే ఎప్పటికైనా ప్రమాదాలు తప్పవు. -
ప్రొఫెసర్ కాశిం విడుదల కోసం లేఖ
సాక్షి, హైదరాబాద్: పోలీసులు అరెస్టు చేసిన విప్లవ రచయితల సంఘం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశిం విడుదలకు ఆదేశించాలని కోరుతూ వందమంది కవులు, రచయితలు, ప్రజాస్వామిక వాదులు, జర్నలిస్టులు బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సమాజంలో భిన్నభావాలు కలిగి ఉండటం ప్రజాస్వామ్యానికి చిహ్నమని, ప్రస్తుతం దేశం లో, రాష్ట్రంలో పాలకుల భావాలను వ్యతిరేకిస్తేనే నేరంగా పరిగణిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ నెల 18న ప్రొఫెసర్ కాశిం ఇంటి మీద పోలీసులు దాడిచేసి నిర్బంధంలోకి తీసుకున్న సంగతి మీకు తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి దశ నుంచి పోరాటాల్లో పాల్గొన్నారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, పత్రిక సంపాదకుడిగా, ప్రొఫెసర్‌గా ఎదిగారు. విరసం కార్యదర్శిగా వారం రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ప్రశ్నిస్తున్న ఆలోచనాపరులపై కేసులు బనాయించా రు. ఈ క్రమం తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగడం అభ్యంతరకరంగా ఉంది ’అని వారు ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న కాశిం పరారీలో ఉన్నట్లు చెబుతున్న పోలీసులు 2016 కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడాన్ని రాజకీయ కుట్రగా తాము భావిస్తున్నామన్నారు. వర్ధమాన కవు లు, రచయితలపైన, సృజనకారులపైన భవిష్యత్తులో ఎలాంటి నిర్బంధం కొనసాగించకుండా చర్యలు తీసుకోవాల ని సీజేను కోరారు. సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర్లు, ఏబీకేప్రసాద్, కె.శ్రీనివాస్, ఎస్.వీర య్య, దిలీప్‌రెడ్డి.. కవులు, రచయితలు, చెరుకు సుధాకర్, కె.శివారెడ్డి, దేవిప్రియ, నిఖిలేశ్వర్, ఓల్గా, ప్రొ.జయధీర్ తిరుమల్ రావు, ప్రొ. జి.హరగోపాల్, ప్రొ.కాత్యాయని విద్మహే, అంపశయ్య నవీన్, చుక్క రామయ్య, కుప్పిలి పద్మ, మెర్సీ మెర్గరేట్, సత్యవతి కొండవీటి, వేనెపల్లి పాండురంగారావు, అక్కినేని కుటుంబరావు తదితరులు సంతకం చేశారు. -
సీజే ముందుకు ప్రొఫెసర్ కాశీం
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ చింతకింద కాశీంను ఆదివారం ఉదయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ముందు హాజరుపరిచారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ శనివారం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గజ్వేల్‌కు తరలించిన విషయం తెలిసిందే. దీనిపై పౌరహక్కల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టిన సీజే ఆదివారం ఉదయం తమ ఎదుట హాజరుపర్చాలని తెలంగాణ పోలీసులను ఆదేశించారు. సీజే ఆదేశాల మేరకు పోలీసులు కాశీంను సీజే ఇంటిముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కాశీంను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆయన్ని వెంటనే విడుదల చేయాలంటూ సీజే ఇంటిముందు విద్యార్థులతో పాటు, ప్రజాసంఘాలు ధర్నాకు దిగారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసు అధికారులు భారీగా బలగాలను మోహరించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. (ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్టు) -
ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్టు
సాక్షి, సిద్దిపేట: ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ ఆర్ట్స్ కాలేజీ తెలుగు డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ కాశింను శనివారం ఉదయం హైదరాబాద్‌లోని యూనివర్సిటీ క్యాంపస్ క్వార్టర్స్‌లో అరెస్టు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్ రెవల్యూషనరీ డాక్టర్ చింతకింది కాశిం అలియాస్ కార్తీక్‌కు కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టు స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ నేతలతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై 2016లో సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయినట్లు వివరించారు. ఈ కేసు పరిశోధనలో భాగంగా గజ్వేల్ కోర్టు నుంచి సెర్చ్ వారంట్ తీసుకున్నారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో స్పెషల్ టీం శనివారం ఉదయం 7 గంటల నుంచి 10–05 గంటల వరకు కాశీం నివాసం ఉంటున్న ఉస్మానియా క్యాంపస్ హైదరాబాద్ క్వార్టర్ ఆరో బ్లాక్, 9వ ప్లాట్‌లో అతని భార్య, బంధువుల సమక్షంలో సెర్చ్ చేశారని జోయల్ డేవిస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన సీపీఐ (మావోయిస్టు) పార్టీల విప్లవ సాహిత్యం, కరపత్రాలు, సీడీలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకొని, సీజ్ చేసి, అరెస్టు చేస్తున్నట్లు అతని భార్యకు తెలిపినట్లు సీపీ పేర్కొన్నారు. అదే విధంగా సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ కమిటీ సెక్రటరీ హరిభూషణ్ అలియాస్ జగన్, ఇతర నేతలతో, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులతో సంబంధాలు కొనసాగిస్తూ, వారు ఇచ్చే డబ్బులతో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆరు కేసుల్లో కాశిం నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. కాశింను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. కాశిం అరెస్టు అన్యాయం సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ కాశిం అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్‌ను ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసిందని, అగ్రకుల అహంకారంతో ఆయన్ను అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అతనిపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని, బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఈసీల్లేవు..వీసీల్లేరు!
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిక్యూటివ్ కమిటీలు (ఈసీ), వీసీలు లేకపోవడంతో యూనివర్సిటీల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. నియామకాలపై దృష్టి పెట్టేవారు లేరు. నిధుల సద్వినియోగానికి చర్యలు చేపట్టే వారు లేరు. ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడుతోంది. యూనివర్సిటీల్లో ఏ పని చేయాలన్నా, విధానపర నిర్ణయం తీసుకోవాలన్నా నిపుణులు, అధ్యాపకులు, ప్రముఖులు మొత్తంగా 13 మందితో కూడిన పూర్తి స్థాయి ఈసీలు ఉండాల్సిందే. కానీ అవి లేకపోవడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండాపోతోంది. ఈసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ముగ్గురు ఐఏఎస్ అధికారులు, వైస్ చాన్స్‌లర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గత ఐదేళ్లుగా పక్కన పడేసింది. ఒక్క జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) తప్ప మిగతా యూనివర్సిటీలకు ఈసీలను నియమించాలన్న విషయాన్నే పట్టించుకోవడం లేదు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప.. యూనివర్సిటీలకు ఈసీలను నియమించే విషయంలో ఎవరో ఒకరు అడిగితే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. కాకతీయ యూనివర్సిటీకి గత నెల 13వ తేదీన ఆగమేఘాలపై ఈసీని నియమించింది. ఆ యూనివర్సిటీ ఈసీ సభ్యుల నియామకం విషయంలో సుప్రీంకోర్టులో కేసు గత నెల 15వ తేదీన హియరింగ్ ఉండటంతో పూర్తి స్థాయి ఈసీని నియమించింది. మరోవైపు వైస్ చాన్స్లర్ల నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటుచేసినా, అవి ఇంతవరకు సమావేశమైందీ లేదు. వీసీ పదవి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిందీ లేదు. 2010లోనే ఈసీల రద్దు.. రాష్ట్రంలోని యూనివర్సిటీల ఈసీలు 2010లోనే రద్దు అయ్యాయి. 2010 ఏప్రిల్ 9వ తేదీన కాకతీయ యూనివర్సిటీ పాలక మండలిని ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో పాటు ఉస్మానియా, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ ఓపెన్, తెలుగు యూనివర్సిటీల పాలక మండళ్లను రద్దు చేసింది. ఆ తరువాత 2011 నవంబర్ 15వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీతోపాటు మిగతా యూనివర్సిటీలకు ఈసీలను నియమించింది. అందులో కాకతీయ యూనివర్సిటీకి ఈసీని నియమించలేదు. ఆ పదవీ కాలం కూడా 2014తోనే పూర్తయిపోయింది. అప్పటి నుంచి వాటికి పూర్తి స్థాయి ఈసీలే లేకుండాపోయాయి. పూర్తి స్థాయి ఈసీలు ఉంటే... ప్రతి యూనివర్సిటీ ఈసీకి ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ) చైర్మన్‌గా ఉంటారు. అలాగే విద్యాశాఖ, ఆర్థిక శాఖ, కళాశాల విద్యా కమిషనర్ (టెక్నికల్ యూనివర్సిటీ అయితే సాంకేతిక విద్యా కమిషనర్) ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఇక యూనివర్సిటీ కాలేజీల నుంచి ఒక ప్రిన్సిపాల్, ఇద్దరు అధ్యాపకులు, డిగ్రీ కాలేజీల నుంచి ఒక ప్రిన్సిపాల్, ఒక అధ్యాపకుడు, సమాజంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు/నిపుణులు నలుగురు కలుపుకొని మొత్తంగా 13 మంది సభ్యులు ఈసీలో ఉంటారు. ఆ యూనివర్సిటీ రెక్టార్ ఉంటే అతను కూడా ఈసీలో సభ్యులుగా ఉంటారు. ఇలాంటి కమిటీ తీసుకునే నిర్ణయమే విధానంగా మారుతుంది. యూనివర్సిటీకి సంబంధించి ఏ పని చేయాలన్నా ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే. దానినే వైస్ చాన్స్‌లర్ అమలు చేస్తారు. అంతేకాదు అడ్మినిస్ట్రేషన్, అకడమిక్, ప్రమోషన్స్, ఉద్యోగాల భర్తీ, సైంటిఫిక్ పరికరాలు, ల్యాబ్ వస్తువుల కొనుగోలు, యూజీసీ నిధుల వినియోగం ఇలా అన్నింటికి ఈసీ ఆమోదం ఉండాల్సిందే. ►కాకతీయ వర్సిటీలో పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ లేకుండానే ఏడేళ్ల క్రితం చేపట్టిన నియామకాలను ఈసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండే ముగ్గురు ఐఏఎస్ అధికారులు, వీసీ అప్రూవ్ చేశారు. ఈసీ లేకుండా ఎలా అప్రూవ్ చేస్తారంటూ ఒకరు కోర్టును ఆశ్రయించడంతో ఆ సెలెక్షన్స్‌ను కోర్టు కొట్టివేసింది. ►2015, 2016 సంవత్సరాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూజీసీ నుంచి వచ్చిన ప్రాజెక్టు నిధులను పూర్తి స్థాయి ఈసీ సద్వినియోగపరచుకోకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. ►2016లో జేఎన్ఏఎఫ్ఏయూ వీసీ నియామకం కోసం ఏర్పాటుచేసిన సెర్చ్ కమిటీలో వర్సిటీ నామినీని నియమించారు. పూర్తి స్థాయి ఈసీ లేకుండా, దాని అప్రూవల్ లేకుండా వర్సిటీ నామినీని ఎక్స్ అఫీషియో సభ్యులు ఎలా నామినేట్ చేస్తారని ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పూర్తిస్థాయి ఈసీని నియమించాల్సి వచ్చింది. ►ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వైస్ చాన్స్లర్లు (వీసీ) లేరు. 2016లో నియమితులైన వీసీల పదవీ కాలం జూన్, జూలై నెలల్లోనే ముగిసిపోయింది. ఇన్చార్జి వీసీలుగా ఉన్న ఐఏఎస్ అధికారులు వర్సిటీలను పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. అకడమిక్ మార్పుల కోసమైనా ఈసీలు ఉండాల్సిందే ఈసీలో ఎక్స్అఫీషియో మెంబర్స్‌గా ఉండే వారు తీసుకునే నిర్ణయాలు వ్యాలిడ్ కావు. కోర్టులో అవి నిలబడవు. అకడమిక్ అంశాలు చూసేందుకు నిపుణులు అవసరం. మార్పులు చేయాలన్నా వారు ఉండాల్సిందే. విభాగాలు చేసే అకడమిక్ మార్పులను ఈసీ పరిశీలించి విధానపర నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. అకడమిక్ కేలండర్ సరిగ్గా అమలు కావడం లేదు. జూలై నెలలో ప్రారంభం కావాల్సిన అకడమిక్ ఇయర్ సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. పీజీ పరీక్షలు నిర్వహించిన నెల రోజుల్లో ఫలితాలు ఇవ్వాలి. ఆరు నెలల వరకు కూడా కొన్ని పరీక్షల ఫలితాలు రావడం లేదు. – ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ -
మావోయిస్టులకు సపోర్ట్..! పోలీసుల అదుపులో ఓయూ ప్రొఫెసర్
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జగన్ ఇంట్లో ఎస్ఐబీ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. సోదాలో జగన్ ఇంట్లో మావోయిస్టు లేఖలు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై మహబూబ్‌నగర్‌లో ఇంతకు ముందే నమోదైన కేసులో మహబూబ్‌నగర్ పోలీసులు జగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
అటా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం..
సాక్షి, అట్లాంటా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం అట్లాంటాలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో టీసీసీఐ రాష్ట్ర సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ జగదీశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటా వీరిద్దరిని ఘనంగా సత్కారించింది. ఈ కార్యక్రమంలో అటా ప్రెసిడెంట్ కరుణాకర అసిరెడ్డి, అటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బొడ్డి రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ శివ కుమార్ రమదుగు, వీరితో పాటు గేట్స్ ప్రెసిడెంట్ నందా చాట్లా, గటా చీఫ్ శంకర్ గండ్ర, రఘు మరిపెడ్డి, గేట్స్ చైర్మన్ శ్రీధర్ నరవెల్, వెంకట్ వీరనేనిలు పాల్గొన్నారు. అంతేకాక ఈ సమావేశానికి స్థానిక కమ్యూనిటీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
ఓయూ ప్రొఫెసర్ అదృశ్యం
నాగోలు: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన కనిపించకుండా పోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హస్తినాపురం తులిజ భవాని నగర్ కాలనీ లో నివసించే వి.రవి (37) ఉస్మానియా యునివర్సటీలో ప్రోఫెసర్‌గా పని చేస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన అప్పటినుంచి తిరిగి రాలేదు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.