గబ్బిలాలతో కరోనా.. అబద్ధమే! | Sakshi Special Interview With Director Of Osmania University Center For Biodiversity Chelmala Srinivasulu | Sakshi
Sakshi News home page

గబ్బిలాలతో కరోనా.. అబద్ధమే!

Published Sun, Apr 12 2020 3:41 AM | Last Updated on Sun, Apr 12 2020 10:38 AM

Sakshi Special Interview With Director Of Osmania University Center For Biodiversity Chelmala Srinivasulu

సాక్షి, హైదరాబాద్‌: గబ్బిలాలతో కరోనా మనుషులకు సోకిందనడం అబద్ధమేనని, అలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని బ్యాట్‌ బయాలజిస్ట్, ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) బ్యాట్‌ స్పెషలిస్ట్‌ గ్రూప్‌ సభ్యుడు డాక్టర్‌ చెల్మల శ్రీనివాసులు పేర్కొన్నారు. గబ్బిలాల్లో ఉన్న వైరస్‌కు కరోనాకు సంబంధం లేదని తెలిపారు. కరోనా పులుసు పంది నుంచి (ప్యాంగోలిన్‌) నుంచి మనుషులకు సోకిన ట్లు పరిశోధనల్లో తేలిందని, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌వో) ప్రకటించిందన్నారు.

అయినా గబ్బిలాలతో ఈ వైరస్‌ సోకుతుందని అపోహలు ప్రజల్లో పెరిగిపోయాయని, అందుకు అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ బయోడైవర్సిటీ అండ్‌ కన్జర్వేషన్‌ స్టడీస్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాసులు గత 25 ఏళ్లుగా సౌత్‌ ఏషియాలో గబ్బిలాలపై ఆయన పరిశోధన చేస్తున్నారు. కొత్త వైరస్‌ అనగానే గబ్బిలాలపై ఎందుకు అనుమానం వస్తుందన్న దానిపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..

గబ్బిలాల్లో 40 శాతం వరకు.. 
కరోనా జాతికి చెందిన 100 రకాల వైరస్‌ల్లో 80 శాతం వైరస్‌లు అటవీ జంతువులు, పక్షుల్లోనే ఉంటాయి. వీటిలో 40 శాతం వైరస్‌లు ఒక్క గబ్బిలాల్లోనే ఉంటాయి. మిగిలిన 20 శాతం వైరస్‌లు పెంపుడు జంతువులు, పక్షుల్లో ఉండగా, అందులో ఒక్కోసారి ఒక్కో వైరస్‌ మనుషులకు సోకుతుంది. ఎక్కువ శాతం వాటిని తినడంతోనే వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏ కొత్త వైరస్‌తో వ్యాధి ప్రబలినా ముందుగా అనుమానం వచ్చేది గబ్బిలంపైనే. ఇతర జంతువులు, పక్షుల కంటే దానిపైనే ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే గత 20 ఏళ్లలో వైరస్‌ల కారణంగా ఏ వ్యాధి ప్రబలినా ముందుగా గబ్బిలాలపై చేసిన పరిశోధనలే బయటకొచ్చాయి. కొంత మేర ఆ వ్యాధులకు కారణమైన వైరస్‌లు గబ్బిలాల్లో ఉండటం, ఆ పరిశోధనలు ముందుగా బయటకు రావడంతో ప్రజల్లో గబ్బిలాలపై అనుమానాలు పెరిగిపోయాయి. అన్ని వ్యాధుల్లోనూ గబ్బిలాల్లో ఉన్న వైరస్‌కు, మనిషికి సోకిన వైరస్‌కు వంద శాతం మ్యాచ్‌ కాకపోవడంతో తర్వాత లోతైన పరిశోధనల్లో ఇతర జంతువుల వల్ల ఆ వైరస్‌లు మనిషికి సోకినట్లు తేలింది.

సార్స్‌ సమయం నుంచి మెుదలుకొని.. 
2000 సంవత్సరంలో ప్రబలిన సార్స్‌.. కరోనా–1 వైరస్‌ కూడా గబ్బిలాల నుంచే వచ్చిందని చైనాలో శాస్త్రవేత్తలు ప్రాథమికంగా ప్రకటించారు. అయితే సార్స్‌ సంబంధ వైరస్‌ గబ్బిలాల్లో ఉన్నా 100 శాతం మ్యాచ్‌ కాలేదు. దీంతో లోతుగా పరిశోధన చేస్తే పునుగు పిల్లి నుంచి కరోనా–1 వైరస్‌ మనుషులకు సోకిందని తేల్చింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. తర్వాత 2013–14లో మిడిల్‌ ఈస్టర్న్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (మెర్స్‌) సోకినప్పుడు.. అదీ గబ్బిలాల వల్లే వచ్చిందని యూరోప్‌ దేశాలు పేర్కొన్నాయి. అప్పుడూ వైరస్‌ వంద శాతం మ్యాచ్‌ కాకపోవడంతో మళ్లీ పరిశోధన చేస్తే ఒంటె నుంచి సోకిందని తేలింది.

ఎబోలా వచ్చినప్పుడు కూడా మెుదట గబ్బిలాలనే అనుమానించారు. తర్వాత గొరిల్లా నుంచి సోకినట్లు వెల్లడైంది. ఇప్పుడు చైనాలోని వూహాన్‌లో ప్రబలిన కరోనాకు కూడా మెుదట్లో చేపలు అని, తర్వాత పాములని, అనంతరం గబ్బిలాల కారణంగా సోకిందని చెబుతూ వచ్చారు. అయితే వూహాన్‌లో మనుషులకు సోకిన వైరస్‌కు గబ్బిలం నుంచి వచ్చిన వైరస్‌కు 90 శాతమే మ్యాచ్‌ అయింది. మిగతా 10 శాతం ఎందుకు మ్యాచ్‌ కాలేదని పరిశోధన చేస్తే కరోనా సోకింది గబ్బిలాల వల్ల కాదని తేలింది. పులుసు పంది (ప్యాంగోలిన్‌) నుంచి మనుషులకు సోకిందని వెల్లడైంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది.  

అనవసర భయాలతో చంపొద్దు.. 
గబ్బిలాలతో కరోనా వచ్చిందన్నది అబద్ధమే. సోషల్‌ మీడియా కారణంగా వాటిపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఎబోలా సోకినప్పుడు వందల సంఖ్యలో గబ్బిలాలనే చంపేశారు. ఇప్పుడు అలాంటివి చేయెుద్దు. పర్యావరణ పరిరక్షణకు, మానవ ఉనికికి గబ్బిలాలు ఎంతో ముఖ్యం. వీటిలో ప్రధానంగా ఫల బక్షి గబ్బిలాలు, కీటక బక్షి గబ్బిలాలు ఉంటాయి. ఫల బక్షి గబ్బిలాలు అరుదైన వృక్ష జాతుల ఫలాలను తిని వాటి విత్తనాలను ఇతర ప్రాంతాల్లో విసర్జించడం ద్వారా వృక్షాల విస్తరణకు తోడ్పడతాయి. కీటక బక్షి గబ్బిలాలు.. రాత్రి వేళల్లో పంట పొలాలను పాడు చేసే కీటకాలను తింటూ రైతులకు ఎంతో మేలు చేస్తాయి.

ఇక మన రాష్ట్రంలో 17 రకాల గబ్బిలాలు ఉండగా, అందులో 5 రకాల గబ్బిలాలు హైదరాబాద్‌ పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. పట్టణాల్లో ఈ గబ్బిలాల కారణంగా దోమల బెడద తగ్గుతోంది. పట్టణాల్లో ఉంటున్న గబ్బిలాలు తమ ఆహారంగా దోమలనే 30 శాతం తింటున్నట్లు తేలింది. ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడమే ప్రధానం. జూనోటిక్‌ వ్యాధుల వ్యాప్తిని తగ్గించడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. నిర్ధిష్ట మానవ కార్యకలాపాలను, అడవి జంతువులను తినడాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని నియంత్రించడం ద్వారా ఇలాంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement