satyanaryana
-
ఈసీల్లేవు..వీసీల్లేరు!
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిక్యూటివ్ కమిటీలు (ఈసీ), వీసీలు లేకపోవడంతో యూనివర్సిటీల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. నియామకాలపై దృష్టి పెట్టేవారు లేరు. నిధుల సద్వినియోగానికి చర్యలు చేపట్టే వారు లేరు. ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడుతోంది. యూనివర్సిటీల్లో ఏ పని చేయాలన్నా, విధానపర నిర్ణయం తీసుకోవాలన్నా నిపుణులు, అధ్యాపకులు, ప్రముఖులు మొత్తంగా 13 మందితో కూడిన పూర్తి స్థాయి ఈసీలు ఉండాల్సిందే. కానీ అవి లేకపోవడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండాపోతోంది. ఈసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ముగ్గురు ఐఏఎస్ అధికారులు, వైస్ చాన్స్‌లర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గత ఐదేళ్లుగా పక్కన పడేసింది. ఒక్క జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) తప్ప మిగతా యూనివర్సిటీలకు ఈసీలను నియమించాలన్న విషయాన్నే పట్టించుకోవడం లేదు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప.. యూనివర్సిటీలకు ఈసీలను నియమించే విషయంలో ఎవరో ఒకరు అడిగితే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. కాకతీయ యూనివర్సిటీకి గత నెల 13వ తేదీన ఆగమేఘాలపై ఈసీని నియమించింది. ఆ యూనివర్సిటీ ఈసీ సభ్యుల నియామకం విషయంలో సుప్రీంకోర్టులో కేసు గత నెల 15వ తేదీన హియరింగ్ ఉండటంతో పూర్తి స్థాయి ఈసీని నియమించింది. మరోవైపు వైస్ చాన్స్లర్ల నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటుచేసినా, అవి ఇంతవరకు సమావేశమైందీ లేదు. వీసీ పదవి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిందీ లేదు. 2010లోనే ఈసీల రద్దు.. రాష్ట్రంలోని యూనివర్సిటీల ఈసీలు 2010లోనే రద్దు అయ్యాయి. 2010 ఏప్రిల్ 9వ తేదీన కాకతీయ యూనివర్సిటీ పాలక మండలిని ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో పాటు ఉస్మానియా, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ ఓపెన్, తెలుగు యూనివర్సిటీల పాలక మండళ్లను రద్దు చేసింది. ఆ తరువాత 2011 నవంబర్ 15వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీతోపాటు మిగతా యూనివర్సిటీలకు ఈసీలను నియమించింది. అందులో కాకతీయ యూనివర్సిటీకి ఈసీని నియమించలేదు. ఆ పదవీ కాలం కూడా 2014తోనే పూర్తయిపోయింది. అప్పటి నుంచి వాటికి పూర్తి స్థాయి ఈసీలే లేకుండాపోయాయి. పూర్తి స్థాయి ఈసీలు ఉంటే... ప్రతి యూనివర్సిటీ ఈసీకి ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ) చైర్మన్‌గా ఉంటారు. అలాగే విద్యాశాఖ, ఆర్థిక శాఖ, కళాశాల విద్యా కమిషనర్ (టెక్నికల్ యూనివర్సిటీ అయితే సాంకేతిక విద్యా కమిషనర్) ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఇక యూనివర్సిటీ కాలేజీల నుంచి ఒక ప్రిన్సిపాల్, ఇద్దరు అధ్యాపకులు, డిగ్రీ కాలేజీల నుంచి ఒక ప్రిన్సిపాల్, ఒక అధ్యాపకుడు, సమాజంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు/నిపుణులు నలుగురు కలుపుకొని మొత్తంగా 13 మంది సభ్యులు ఈసీలో ఉంటారు. ఆ యూనివర్సిటీ రెక్టార్ ఉంటే అతను కూడా ఈసీలో సభ్యులుగా ఉంటారు. ఇలాంటి కమిటీ తీసుకునే నిర్ణయమే విధానంగా మారుతుంది. యూనివర్సిటీకి సంబంధించి ఏ పని చేయాలన్నా ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే. దానినే వైస్ చాన్స్‌లర్ అమలు చేస్తారు. అంతేకాదు అడ్మినిస్ట్రేషన్, అకడమిక్, ప్రమోషన్స్, ఉద్యోగాల భర్తీ, సైంటిఫిక్ పరికరాలు, ల్యాబ్ వస్తువుల కొనుగోలు, యూజీసీ నిధుల వినియోగం ఇలా అన్నింటికి ఈసీ ఆమోదం ఉండాల్సిందే. ►కాకతీయ వర్సిటీలో పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ లేకుండానే ఏడేళ్ల క్రితం చేపట్టిన నియామకాలను ఈసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండే ముగ్గురు ఐఏఎస్ అధికారులు, వీసీ అప్రూవ్ చేశారు. ఈసీ లేకుండా ఎలా అప్రూవ్ చేస్తారంటూ ఒకరు కోర్టును ఆశ్రయించడంతో ఆ సెలెక్షన్స్‌ను కోర్టు కొట్టివేసింది. ►2015, 2016 సంవత్సరాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూజీసీ నుంచి వచ్చిన ప్రాజెక్టు నిధులను పూర్తి స్థాయి ఈసీ సద్వినియోగపరచుకోకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. ►2016లో జేఎన్ఏఎఫ్ఏయూ వీసీ నియామకం కోసం ఏర్పాటుచేసిన సెర్చ్ కమిటీలో వర్సిటీ నామినీని నియమించారు. పూర్తి స్థాయి ఈసీ లేకుండా, దాని అప్రూవల్ లేకుండా వర్సిటీ నామినీని ఎక్స్ అఫీషియో సభ్యులు ఎలా నామినేట్ చేస్తారని ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పూర్తిస్థాయి ఈసీని నియమించాల్సి వచ్చింది. ►ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వైస్ చాన్స్లర్లు (వీసీ) లేరు. 2016లో నియమితులైన వీసీల పదవీ కాలం జూన్, జూలై నెలల్లోనే ముగిసిపోయింది. ఇన్చార్జి వీసీలుగా ఉన్న ఐఏఎస్ అధికారులు వర్సిటీలను పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. అకడమిక్ మార్పుల కోసమైనా ఈసీలు ఉండాల్సిందే ఈసీలో ఎక్స్అఫీషియో మెంబర్స్‌గా ఉండే వారు తీసుకునే నిర్ణయాలు వ్యాలిడ్ కావు. కోర్టులో అవి నిలబడవు. అకడమిక్ అంశాలు చూసేందుకు నిపుణులు అవసరం. మార్పులు చేయాలన్నా వారు ఉండాల్సిందే. విభాగాలు చేసే అకడమిక్ మార్పులను ఈసీ పరిశీలించి విధానపర నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. అకడమిక్ కేలండర్ సరిగ్గా అమలు కావడం లేదు. జూలై నెలలో ప్రారంభం కావాల్సిన అకడమిక్ ఇయర్ సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. పీజీ పరీక్షలు నిర్వహించిన నెల రోజుల్లో ఫలితాలు ఇవ్వాలి. ఆరు నెలల వరకు కూడా కొన్ని పరీక్షల ఫలితాలు రావడం లేదు. – ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ -
అర్హులైన ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు
కాచిగూడ : ఏపీఎన్జీఓస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అడహక్ కమిటీ సమావేశం అడహాక్ కమిటీ చైర్మన్ ఎం.సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గచ్చిబౌలిలో కేటాయించిన స్థలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అర్హులైన ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు అందేలా కృషి చేస్తామని ఎం.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీఎన్జీఓస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి అడహక్ కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకుంటామన్నారు. సొసైటీలో సభ్యులుగా ఉన్న అర్హులైన తెలంగాణ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించేలా నాలుగేళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడహక్ కమిటీ ప్రతినిధులు పి.బలరామ్, జి.మల్లారెడ్డి, ఎస్.ప్రభాకర్‌రెడ్డి, ఎ.శ్రీనివాస్, జి.రాజేశ్వర్‌రావు, అబ్దుల్ సాధిక్, కేశియానాయక్, జి.పద్మారెడ్డి, ఎం.శ్రీనివాస్‌రావు, బీఈ చక్రవర్తి, పి.శ్రీధర్‌రెడ్డి, ఎస్.సంధ్యారాణి, రషీదా బేగం, రమాదేవి, టి.విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మాకం రాజీనామా ఓకే
సాక్షి, కడప : జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్ రాజీనామాను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఆమోదించారు. సీడబ్ల్యుసీ తెలంగాణాపై నిర్ణయం ప్రకటించడంతో అందుకు నిరసనగా మాకం రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను పీసీసీ పెండింగ్‌లో ఉంచింది. ఇటీవల బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురవడంతో మూడు రోజుల క్రితం ఆయనను పరామర్శించేందుకు మాకం వెళ్లారు. తన రాజీనామాను ఆమోదించాలని బొత్సను కోరారు. రాజీనామాను ఆమోదించనని, కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాకంకు బొత్స సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యవాదాన్ని పూర్తిగా భుజానెత్తుకున్నారని, ఇలాంటి క్రమంలో ఆయన సొంత జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షునిగా పార్టీని బలోపేతం చేయడం తన వల్ల కాదని మాకం స్పష్టంచేశారు. కాంగ్రెస్‌పార్టీ సమైక్యవాదాన్ని ప్రకటించాలని, లేకుంటే తన రాజీనామాను ఆమోదించాలని బొత్సకు తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన శనివారం మాకం అశోక్‌కుమార్ రాజీనామాను బొత్స ఆమోదించారు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్యానికి కట్టుబడి రాజీనామాలు ప్రకటించారు. అయితే వీరెవరి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. మాకం రాజీనామాను ఆమోదించడం చర్చనీయాంశమైంది. -
‘ఉపాధి’ ఈసీ బలవన్మరణం
డిండి, న్యూస్‌లైన్: ఉపాధిహామీ పథకం డిండి మండల ఇంజినీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ) మేకల సురేష్‌చంద్ర (25) బుధవారం రాత్రి కార్యాలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీ సులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడుకు చెందిన మేకల సత్యనారాయణ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఆయనకు ఒక కూతురు, ఇద్దరు కుమారులున్నారు. వారిలో సురేష్‌చంద్ర చిన్నవాడు. మూడున్నరేళ్లుగా మండలంలో ఉపాధిహామీ పథకం ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. జూలై నుంచి ఏపీఓగా ఇన్చార్జ్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నెల రోజులుగా కార్యాలయంలో ఉన్న స్త్రీశక్తి భవనంలో రాత్రిళ్లు షల్టర్ తీసుకుంటున్నాడు. అంతకుముందు దేవరకొండలో నివాసం ఉంటూ విధులకు హాజరయ్యేవాడు. ఇతను మృధుస్వభావి అని తెలిసింది. గత నెలలో దేవరకొండలో ఇంజినీరింగ్ విద్యార్థిని హత్యకు పాల్పడిన వ్యక్తి పక్కరూంలో ఉండేవాడు. హత్య జరగడంతో భయానికి లోనై డిండిలో ఉండేందుకు రూం కోసం వెతకగా దొరకలేదు. దీంతో నెల రోజులుగా రాత్రివేళ కార్యాలయంలోనే ఉంటున్నాడు. గురువారం ఉదయం 10గంటలకు కార్యాల యానికి వచ్చిన సిబ్బంది కంప్యూటర్ గదికి లోపలవైపు గడియవేసి ఉండడంతో ఎవరైనా ఉన్నారేమోనని పిలిచారు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఉప సర్పంచ్ లక్ష్మయ్య సమక్షంలో తలుపులను గట్టిగా తోయడంతో లోపలిగడియ ఊడి తెరుచుకున్నాయి. ఎదురుగా సీలింగ్‌ఫ్యాన్‌కు వేలాడుతున్న సురేష్‌చంద్ర మృతదేహం కనిపించింది. మృతుడికి ఈ మధ్యనే వివాహ నిశ్చితార్థం జరిగిందని, వచ్చేనెల 27న వివాహ ముహూర్తం నిర్ణయించినట్లు బంధువులు తెలిపారు. కాగా, సురేష్‌చంద్ర రెండు పేజీల సూసైడ్ నోట్ ఇంగ్లిష్‌లో రాసి పెట్టాడు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీలుంటే నా కళ్లను దానం చేయండి ‘‘నన్ను రక్షించకండి, చనిపోనివ్వండి. వీలుంటే నా కళ్లను దానం చేయండి. నా కోసం ఎవరూ ఏడ్వవద్దు. నాకు వివాహ నిశ్చయం జరిగింది. ఆ అమ్మాయి నన్ను క్షమించాలి’ అని సూసైడ్ నోట్లో కోరాడు. అమ్మ, నాన్న, అన్న, వదిన, అక్క, బావ, స్నేహితులు, తోటి సహ ఉద్యోగులను పేరుపేరున గుర్తు చేసుకుని సారీ తెలిపాడు. ‘‘మూడున్నర సంవత్సరాలుగా ఉద్యోగరీత్యా ప్రతి ఒక్కరూ మంచిగా సహకరించారు. జిల్లా కలెక్టర్ చాలా మంచివాడు. పేద ప్రజలకు ఆయన చేస్తున్న సహాయ పనులను అభినందిస్తున్నా. కానీ ఆయన మున్ముందు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నాను. నా చివరిరోజు సంతోషంగా గడిపాను’ అని నోట్లో రాసి ఉంది. -
వీయూపీల వద్ద విస్తరణ పనులు ఆపాలి
గోదావరిఖని, న్యూస్‌లైన్ : రామగుండంలోని రాజీవ్ రహదారి పై నిర్మించనున్న వెహికల్ అండర్ పాస్(వీయూపీ)ల వద్ద నా లుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులను ఆపాలని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ రాజులు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం ఆ యన స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో కలిసి గో దావరిఖని నుంచి రామగుండం వెళ్లే రోడ్డులో వీయూపీలు నిర్మించనున్న బస్టాండ్, ఇల్లందు గెస్ట్ హౌజ్ గేట్ ప్రాంతం, ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు, ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ ప్రాంతాలను పరిశీ లించారు. వీయూపీలు నిర్మించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాజులు రోడ్డు పనులు పరిశీలించారు. వీయూపీలు నిర్మించకపోతే ర ద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు రోడ్డు దాటే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే రాజులుకు వివరించా రు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చోట 7.5 మీటర్ల సర్వీస్ రోడ్డు నిర్మించాలన్నారు. దీంతో చీఫ్ ఇంజినీర్ రోడ్డు కాంట్రాక్టు సంస్థకు చెందిన ఇంజినీర్‌ను పిలిపించి వీయూపీలు నిర్మించే చోట రోడ్డు విస్తరణ పనులు ఆపాలని ఆదేశించారు. వీయూపీలు నిర్మించేదాకా ఉద్యమం జ్యోతినగర్ : రాజీవ్ రహదారి ఫోర్ వేలో వీయూపీలు నిర్మించేదాకా ఉద్యమాలు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఎన్టీపీసీ ఆటోనగర్ రాజీవ్ రహదారిపై విలేకరులతో మాట్లాడారు. వీయూపీలు నిర్మించాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్ రోడ్డు పనులను పరిశీలించారని తెలిపారు. ఆయనకు ఇక్కడి పరిస్థితులను వివరించి, వీయూపీలను నిర్మించాలని చెప్పామన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు ప్రకాశ్, శ్రీనివాస్, ఓదెలు తదితరులున్నారు.