‘ఉపాధి’ ఈసీ బలవన్మరణం | Engineering Consultant suresh chandra attempted suicide | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ ఈసీ బలవన్మరణం

Published Fri, Nov 29 2013 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

Engineering Consultant suresh chandra attempted suicide

డిండి, న్యూస్‌లైన్: ఉపాధిహామీ పథకం డిండి మండల ఇంజినీరింగ్ కన్సల్‌టెంట్ (ఈసీ) మేకల సురేష్‌చంద్ర (25) బుధవారం రాత్రి కార్యాలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీ సులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడుకు చెందిన మేకల సత్యనారాయణ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఆయనకు ఒక కూతురు, ఇద్దరు కుమారులున్నారు. వారిలో సురేష్‌చంద్ర చిన్నవాడు. మూడున్నరేళ్లుగా మండలంలో ఉపాధిహామీ పథకం ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. జూలై నుంచి ఏపీఓగా ఇన్‌చార్జ్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నెల రోజులుగా కార్యాలయంలో ఉన్న స్త్రీశక్తి భవనంలో రాత్రిళ్లు షల్టర్ తీసుకుంటున్నాడు. అంతకుముందు దేవరకొండలో నివాసం ఉంటూ విధులకు హాజరయ్యేవాడు. ఇతను మృధుస్వభావి అని తెలిసింది.
 
 గత నెలలో దేవరకొండలో ఇంజినీరింగ్ విద్యార్థిని హత్యకు పాల్పడిన వ్యక్తి పక్కరూంలో ఉండేవాడు. హత్య జరగడంతో భయానికి లోనై డిండిలో ఉండేందుకు రూం కోసం వెతకగా దొరకలేదు. దీంతో నెల రోజులుగా రాత్రివేళ కార్యాలయంలోనే ఉంటున్నాడు. గురువారం ఉదయం 10గంటలకు కార్యాల యానికి వచ్చిన సిబ్బంది కంప్యూటర్ గదికి లోపలవైపు గడియవేసి ఉండడంతో ఎవరైనా ఉన్నారేమోనని పిలిచారు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఉప సర్పంచ్ లక్ష్మయ్య సమక్షంలో తలుపులను గట్టిగా తోయడంతో లోపలిగడియ ఊడి తెరుచుకున్నాయి. ఎదురుగా సీలింగ్‌ఫ్యాన్‌కు వేలాడుతున్న సురేష్‌చంద్ర మృతదేహం కనిపించింది. మృతుడికి ఈ మధ్యనే వివాహ నిశ్చితార్థం జరిగిందని, వచ్చేనెల 27న వివాహ ముహూర్తం నిర్ణయించినట్లు బంధువులు తెలిపారు. కాగా, సురేష్‌చంద్ర రెండు పేజీల సూసైడ్ నోట్ ఇంగ్లిష్‌లో రాసి పెట్టాడు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
 వీలుంటే నా కళ్లను దానం చేయండి
 ‘‘నన్ను రక్షించకండి, చనిపోనివ్వండి. వీలుంటే నా కళ్లను దానం చేయండి. నా కోసం ఎవరూ ఏడ్వవద్దు. నాకు వివాహ నిశ్చయం జరిగింది. ఆ అమ్మాయి నన్ను క్షమించాలి’ అని సూసైడ్ నోట్‌లో కోరాడు. అమ్మ, నాన్న, అన్న, వదిన, అక్క, బావ, స్నేహితులు, తోటి సహ ఉద్యోగులను పేరుపేరున గుర్తు చేసుకుని సారీ తెలిపాడు. ‘‘మూడున్నర సంవత్సరాలుగా ఉద్యోగరీత్యా ప్రతి ఒక్కరూ మంచిగా సహకరించారు. జిల్లా కలెక్టర్ చాలా మంచివాడు. పేద ప్రజలకు ఆయన చేస్తున్న సహాయ పనులను అభినందిస్తున్నా. కానీ ఆయన మున్ముందు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నాను. నా చివరిరోజు సంతోషంగా గడిపాను’ అని నోట్‌లో రాసి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement