అజిత్ దోవల్, హరిభాయ్ చౌదరి, మనీశ్ కుమార్ సిన్హా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐలో అంతఃకలహం కేసు సోమవారం మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర గనులు, బొగ్గు శాఖల సహాయ మంత్రి హరిభాయ్ ప్రతిభాయ్ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర, తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డిలపై సీబీఐలో డీఐజీగా ఉన్న మనీశ్ కుమార్ సిన్హా అనే ఐపీఎస్ అధికారి సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు.
మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషి కేసులో నిందితుడిగా ఉన్న సానా సతీశ్‌ను కేసు నుంచి బయటపడేసేందుకు హరిభాయ్ చౌదరి జూన్ తొలిపక్షంలో కోట్లాది రూపాయల లంచం తీసుకున్నారనీ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు అనుకూలంగా విచారణను ప్రభావితం చేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ దర్యాప్తులో జోక్యం చేసుకున్నారనీ, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని సతీశ్ సానా కలిశారని మనీశ్ సిన్హా ఆరోపించారు. రాకేశ్ అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలను సిన్హా విచారిస్తుండగా, ఇటీవల సీబీఐలో కీలక మార్పులు చేపట్టిన సమయంలో ఆయనను నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు.ఆ బదిలీని కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లోనే ఆయన పై విషయాలన్నీ పొందుపరిచారు.
అజిత్ దోవల్ అడ్డుకున్నారు..
రాకేశ్ అస్థానాపై విచారణలో ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ కలుగజేసుకుని సోదాలు జరపకుండా, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని మనీశ్ సిన్హా పిటిషన్‌లో ఆరోపించారు. మొయిన్ ఖురేషి, సానా సతీశ్‌ల కేసులో ఇప్పటికే దుబాయ్ నుంచి వచ్చి అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ ప్రసాద్‌లతో అజిత్ దోవల్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని సిన్హా పిటిషన్‌లో పేర్కొన్నారు. అస్థానాకు సన్నిహితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్ కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్టవ్వడం తెలిసిందే. అస్థానాపై కేసును మరో సీబీఐ అధికారి ఏకే బస్సీ విచారించారు. ‘ఆధారాలుగా వాట్సాప్ చాట్‌లను సేకరించడం కోసం అస్థానా, దేవేంద్రల ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మను బస్సీ కోరారు.
కానీ అలోక్ వర్మ అనుమతి ఇవ్వలేదు. అజిత్ దోవల్ తనకు ఆ అనుమతి ఇవ్వడం లేదనీ, సెల్‌ఫోన్లు తీసుకోవద్దంటున్నారని అలోక్ వర్మ చెప్పారు’ అని సిన్హా పిటిషన్‌లో పేర్కొన్నారు. అస్థానా పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన విషయాన్ని దోవల్‌కు అలోక్ వర్మ చెప్పగా, అదే రోజు ఆ విషయాన్ని దోవల్ అస్థానాకు చేరవేశారని సిన్హా ఆరోపించారు. ఈ కేసు నుంచి బయటపడేయాల్సిందిగా దోవల్‌ను అస్థానా కోరారన్నారు. ‘అరెస్టు చేసి తీసుకొచ్చినప్పుడు తన తండ్రి రా (పరిశోధన, విశ్లేషణ విభాగం)లో గతంలో పనిచేశారనీ, ఎన్‌ఎస్‌ఏ దోవల్ ఆయనకు బాగా తెలుసని మనోజ్ ప్రసాద్ చెప్పాడు. ప్రస్తుతం రాలో పనిచేస్తున్న సామంత్ గోయల్ అనే ఉన్నతాధికారి కూడా తన సోదరుడికి బాగా తెలుసన్నాడు.
సీబీఐ అధికారుల ఉద్యోగాలు పీకేయించి అంతం చేస్తానని కూడా మనోజ్ బెదిరించాడు. సోమేశ్, సామంత్‌లు ఇటీవలే ఒక వ్యక్తిగత విషయంలో దోవల్‌కు బాగా సాయం చేశారని కూడా చెప్పాడు’ అని పిటిషన్‌లో సిన్హా పేర్కొన్నారు. మనోజ్ ప్రసాద్‌తో సంబంధాలు నెరిపిన అధికారులపై విచారణకు కూడా దోవల్ అనుమతించలేదని ఆరోపించారు. అలాగే సామంత్‌తో ఓ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడాడనీ, సీబీఐ నుంచి బయటపడేయాలని కోరగా ‘ప్రధాన మంత్రి కార్యాలయంతో మాట్లాడి అంతా సెట్ చేశాం. ఏం భయం లేదు’ అని హామీనిచ్చారనీ, ఆ రాత్రే సీబీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని సిన్హా ఆరోపించారు.
కేసుల నుంచి రక్షణకు సురేశ్ హామీ..
సతీశ్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామంటూ న్యాయశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర హామీనిచ్చారని సిన్హా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రేఖా రాణి సతీశ్‌కు, సురేశ్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారు’ అని పిటిషన్‌లో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలనీ, తానెప్పుడూ లండన్ వెళ్లలేదనీ, రేఖా రాణి ఎవరో తనకు తెలీదని సురేశ్ చంద్ర చెప్పారు. ఖండించిన హరిభాయ్ చౌదరి: తనపై వచ్చిన ఆరోపణలను హరిభాయ్ చౌదరి ఖండించారు. సతీశ్ సానా ఎవరో తనకు అస్సలు తెలీదనీ, అతణ్ని ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఏ విచారణను ఎదుర్కొనేందుౖకైనా సిద్ధమనీ, లంచం తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు. మనీశ్ తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
చౌదరిని సతీశ్ కలిశాడు
అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై సీవీసీ కేవీ చౌదరి విచారణ జరపడం తెలిసిందే. అయితే సీవీసీని ఆయన బంధువు గోరంట్ల రమేశ్ ద్వారా సానా సతీశ్ ఢిల్లీలో కలిశాడని కూడా సిన్హా పిటిషన్‌లో పేర్కొన్నారు. మెయిన్ ఖురేషీ కేసు విషయమై చౌదరితో సతీశ్ మాట్లాడాడనీ, అనంతరం అస్థానాకు చౌదరి ఫోన్ చేసి కేసు విషయమై వాకబు చేయగా.. సతీశ్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలేవీ లేవని అస్థానా చెప్పారని సిన్హా తెలిపారు. ఈ విషయాలను విచారణలో సతీశే బయటపెట్టారన్నారు. ‘ఇందులో అక్రమమేమీ లేదు. కానీ విషయాన్ని పూర్తిగా తెలియజెప్పడం కోసం పిటిషన్‌లో ఈ విషయాలను కూడా పొందుపరిచా’ అని సిన్హా చెప్పారు. అలాగే హరిభాయ్ చౌదరికి లంచం విషయమై సతీశ్ తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డితో కూడా ఫోన్‌లో మాట్లాడారన్నారు. సిన్హా ఆరోపణలపై సీవీసీని స్పందన కోరగా, కోర్టులో ఈ కేసు ఉన్నందున మీడియాతో దీనిపై మాట్లాడటం సరికాదంటూ వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment