
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు మళ్లీ మంత్రి అవుతారా?.. లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరపకుండానే కేటీఆర్‌కు పట్టాభిషేకం చేసి పార్టీ బాధ్యతలు ఆయన భుజాల మీద పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండబోదనే సంకేతాల నేపథ్యంలో ‘కేటీఆర్... నెక్ట్సేంటి’అన్నది చర్చనీ యాంశమవుతోంది. దావోస్‌లో వచ్చే నెల 22 నుంచి 25 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి హోదాలో ఆహ్వానం అందుకున్న ఆయన మళ్లీ అదే హోదాలోనే ఆ సదస్సుకు హాజరవుతారా?.. లేదా? అన్నది రాజకీయ వర్గాలు, ఐటీ పరిశ్రమ వర్గాల్లోనూ హాట్‌టాపిక్‌గా మారింది. కేటీఆర్‌ను పార్టీ బలోపేతం కోసమే పూర్తిగా వినియోగించుకుంటారనే అభిప్రాయాలూ వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
మంత్రి హోదాలో...
దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం లభిస్తుంది. అయితే, ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్‌ను అనువైన కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్)ను దిగ్విజయంగా నిర్వహించడంతో డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రెండే.. కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఈ సదస్సుకు ఆహ్వానించారు. పలు పెద్ద గ్లోబల్ కంపెనీల సీఈవోలకు ఇచ్చే విందుకు ఆహ్వానించడంతో పాటు వారితో ప్రత్యేక సమావేశాలకు సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా గత నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాలని భావించారు. అయితే, ఇప్పుడు కేటీఆర్‌ను మంత్రిని చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశం కావడంతో దావోస్ సదస్సు అంశం ప్రాధాన్యత సంతరించు కుంటోంది.
ఈ విషయమై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. గతంలో నిర్ణయించిన విధంగా పలువురు సీఈవోలు, అనేక గ్లోబల్ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో రాష్ట్ర ప్రభుత్వం విందు కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ఉందని, కేటీఆర్‌తో చర్చలు జరిపేందుకు వారంతా ఆ విందుకు హాజరుకానున్నారని చెప్పారు. దీంతో పాటు ప్రపంచ ఆర్థిక సదస్సుకు సమాంతరంగా తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గాను మంత్రి హోదాలో ఉన్నప్పుడే కేటీఆర్ చాలా మంది పారిశ్రామికవేత్తలకు సమయం కూడా ఇచ్చారని వెల్లడించారు. ఇప్పుడు ఈ షెడ్యూల్‌పై ఆసక్తి నెలకొందని, కేటీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ కేటీఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోకపోతే ఆ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎవరుంటున్నారన్న దానిపై కూడా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోందని కూడా ఆయన వెల్లడించడం గమనార్హం.
పాలనలో తనదైన ముద్ర...
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రిగా కేటీఆర్ సమర్థవంతంగా పనిచేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఏ అంశంపై అయినా ఆంగ్లం, తెలుగులో అనర్గళంగా ప్రసంగించే ఆయన ట్విట్టర్‌లో లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. దేశ, విదేశాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొని రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన టీ–హబ్ ఐటీ ఇంక్యుబేటర్ రాష్ట్రంలో వందల సంఖ్యలో స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు ఊతమిచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. అంతకు ముందు ఆయన కొంత కాలం పంచాయతీరాజ్ మంత్రిగా సైతం పని చేసి ఆ శాఖపై కూడా తనదైన ముద్రవేశారు.
భవిష్యత్ ప్రణాళికలు కూడా..
హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణలో పారిశ్రామికా భివృద్ధిపై కేటీఆర్ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా నగరానికి తూర్పు దిక్కున ఉన్న ఉప్పల్ ప్రాంతంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే కోణంలో ప్లాన్ చేశారు. మెట్రో రైలుకు సంబంధించి కూడా పలు కొత్త మార్గాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అందుకు తగిన ప్రణాళికను ఆయన సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను కాదని వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి అనుకున్నంత సజావుగా ఉండదని గచ్చిబౌలికి చెందిన ఒక డెవలపర్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో కేటీఆర్‌ను ఐటీ బాధ్యతల నుంచి తప్పిస్తే ఆ రంగం అభివృద్ధిలో బ్రేకులు పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీలో పెద్ద బాధ్యత
టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు అన్ని ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తెలంగాణను గులాబీవనం చేయాలనే ప్రణాళిక తోనే కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ నియ మించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌ను గెలుపు బాటలో నడిపించే బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెల వాలనే లక్ష్యంతో ఆయన ఇప్పటికే ప్రణాళికలు రూపొందిం చుకున్నారు. కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి అన్ని స్థాయిల్లో సమా వేశాలు ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ కేడర్‌ను ఉత్తేజి తుల్ని చేయాలనేది ఆయన భావనగా కనిపిస్తోంది. దీనికి తోడు ఫెడరల్ ఫ్రంట్‌కు బలం చేకూర్చే ప్రయత్నాలు చేయ గల సమర్థత కేటీఆర్‌కు ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటకలకు చెందిన యువ నాయకులు అఖిలేశ్ యాదవ్, కుమారస్వామితో కేటీఆర్‌కు ఉన్న సాన్నిహిత్యం, ఆయనకు స్వతహాగా ఉన్న వాగ్ధాటి లాంటివి ఫ్రంట్‌కు ఊతమిస్తాయనే చర్చ జరుగుతోంది. దీంతో కేటీఆర్ విషయంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసు కుంటారు.. పూర్తిగా పార్టీకే పరిమితం చేస్తారా.. కేబినెట్‌లో కి తీసుకుంటారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.