
కార్యకర్తల కుటుంబ సభ్యులతో సహపంక్తి భోజనం చేస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. ‘మీ కుటుంబ పెద్ద మనతో లేకపోయినా, పార్టీ మీకు అండగా నిలబడుతుందనే విశ్వాసం కల్పించేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆహ్వానించాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ జీవిత బీమా చెక్కులు అందజేశారు. బీమా కింద 1,581 మంది కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున రూ. 31.62 కోట్లు చెల్లించామన్నారు. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా టీఆర్‌ఎస్ 60 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉండటం గర్వకారణమన్నారు. కుటుంబ పెద్దగా, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ ఆపదలో ఉన్న కార్యకర్తల కుటుంబాలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని కేటీఆర్ అన్నారు.
కార్యకర్తల కుటుంబాల్లో విశ్వాసం కల్పించండి
కార్యకర్తల కుటుంబాల ఇళ్లకు వెళ్లి జీవిత బీమా చెక్కులు అందజేయడం ద్వారా వారిలో స్థైర్యం కల్పించి, వారి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ పరంగా వ్యవస్థీకృతంగా చేపట్టాలని, తద్వారా కార్యకర్తల కుటుంబాలతో పార్టీ అనుబంధం మరింత పెరుగుతుందని కేటీఆర్ అన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం తర్వాత పార్టీ కార్యకర్తల కుటుంబాలతో తెలంగాణ భవన్‌లో సహపంక్తి భోజనం చేశారు. కార్యకర్తల కుటుంబ సభ్యులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.