సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశం ఈ నెల 5న పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో యథావిధిగా జరుగుతుందని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దసరా రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్‌కు చేరుకోవాలని ఆహ్వాని తుల జాబితాలోని వారికి సూచించారు. మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో దసరా రోజు జరిగే టీఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశంపై దాని ప్రభావం ఉండదని పేర్కొన్నారు.
సర్వసభ్య సమావేశానికి ఆహ్వానాలు అందినవారు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిర్దేశిత సమయానికి రావాలని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణభవన్‌లో ఈ నెల 5న జరిగే ఈ భేటీకి రాష్ట్రమంత్రులు, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా పరిషత్, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, టీఆర్‌ఎస్ 33 జిల్లాల అధ్యక్షులు హాజరుకావాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించారు. 5న మధ్యాహ్నం 2.30లోగా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ముగించేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలంగాణభవన్ వర్గాలు వెల్లడించాయి.
కొత్త జాతీయ పార్టీపై టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ
కొత్త జాతీయపార్టీ ఏర్పాటుపై ఈ నెల 5న కీలక ప్రకటన చేసేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనుండటంతో కొత్తపార్టీ రూపురేఖలు, తీరుతెన్నులపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కొత్తపార్టీ పేరు, జెండా, ఎన్నికల చిహ్నం మొదలుకుని ఎజెండా తదితరాలపై ఆసక్తి కనిపిస్తోంది.
అదే సమయంలో కొత్త జాతీయపార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కేసీఆర్ వేసే అడుగులు, ఎత్తుగడలు, పార్టీ భవిష్యత్తు తదితరాలపై పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ లాంఛనంగా ప్రకటన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న వివిధ పార్టీల నాయకులకు ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే అతిథుల జాబితాపై మంగళవారం ఉదయానికి స్పష్టత వస్తుందని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment