
ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన నియోజకవర్గ ఇన్‌చార్జీల సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావాలని, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణభవన్‌లో నియోజకవర్గాలవారీగా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీలతో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో సభ్యత్వ నమోదు, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం సరైన వ్యూహం, పక్కా ప్రణాళిక ఏర్పర్చుకోవాలని సూచించారు.
60 లక్షల సభ్యత్వాలు
పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని కేటీఆర్ పార్టీ ఇన్‌చార్జీలను కోరారు. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు దాదాపు 60 లక్షల సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేశామని, జూలై 20 కన్నా ముందే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కేటీఆర్ కోరారు. మొత్తం పార్టీ సభ్యత్వంలో 35 శాతం క్రియాశీలక సభ్యులను నమోదు చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో కలసి సమన్వయం చేసుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునేందుకు రెండు నియోజకవర్గా లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జీలను పార్టీ ప్రకటించింది. దీంతోపాటు హైదరాబాద్ పరిధిలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జీని పార్టీ ప్రకటించింది.
పార్టీ నియమించిన ఇన్‌చార్జీలు సీఎం ఆదేశాల మేరకు రాబోయే రెండు వారాలపాటు ఆయా నియోజకవర్గాల్లో ఉంటూ పార్టీ సభ్యత్వ నమోదులో స్థానిక నాయకులందరినీ భాగస్వాములను చేస్తూ పర్యవేక్షించాలన్నారు. మరో వారం రోజుల్లో ఆన్‌లైన్, మొబైల్ ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. సభ్యత్వ నమోదు సందర్భంగా తీసుకోవాల్సిన పలు చర్యలను సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. సభ్యత్వ నమోదు సందర్భంగా కార్యకర్తల పూర్తి సమాచారం సేకరించాలని కోరారు. ముఖ్యంగా కార్యకర్తలకు ప్రమాదబీమా ఉన్నందున, పూర్తి చిరునామా, మొబైల్, ఆధార్ నంబర్, నామినీ వివరాలను సేకరించాలన్నారు. వివరాలుంటే పార్టీ అందిస్తున్న బీమా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తవని తెలిపారు.
తొలి సభ్యత్వం కేటీఆర్‌దే!
ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కేటీఆర్‌తోనే ప్రారంభమైంది. సమావేశ ప్రారంభానికి ముందు కేటీఆర్ అందరి కంటే ముందుగా సభ్యత్వం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ మన్నె కవిత చేతుల మీదుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తొలి సభ్యత్వం అందజేశారు.
బీసీలకు పెద్దపీట వేయండి
పార్టీ కమిటీల ఏర్పాటులో బీసీల ప్రాధాన్యతకు సంబంధించి కేటీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు పార్టీ కమిటీల్లో కనీసం 51 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉండేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ, మండల కమిటీలను, నగరాలు, పట్టణాల్లో వార్డు, డివిజన్ కమిటీ ఏర్పాట్లను జూలై 20 నాటికి సభ్యత్వ నమోదుతో సమాంతరంగా పూర్తి అయ్యేలా స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకోవాలని ఇన్‌చార్జీలకు సూచించారు. ప్రతి కమిటీలో 15 మందికి తగ్గకుండా చూడాలని, అన్ని కమిటీల్లో నూ పార్టీ క్రియాశీలక సభ్యులకు మాత్రమే అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీ అనుబంధ సంఘాలైన రైతు, యువజన, కార్మిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళాకమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను తానే స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాన ని తెలిపారు. సభ్యత్వ నమోదు వివరాలను ఎక్కడికక్కడే డిజిటలీకరణ చేస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగుతుం దని తెలిపారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించే జిల్లా ఇన్‌చార్జీలను ప్రకటించారు.