సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ రాష్ట్రం బంగారు గనిగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. దీంతో ఇక్కడ ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులు గణనీయంగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలసీలు, ప్రోత్సాహకాలు అమలు చేస్తోందని వెల్లడించారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్), క్రెడిట్ రిపోర్టింగ్ బహుళ జాతి సంస్థ ఈక్విఫాక్స్ శుక్రవారం మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ రెండు సంస్థల భాగస్వామ్యం ద్వారా ఉపాధి కల్పన ప్రక్రియ మెరుగ్గా, మరింత పారదర్శకంగా జరుగుతుంది. ఉద్యోగ కల్పన రంగంలో ఈ ఒప్పందం మైలురాయి వంటిది. సమర్థత కలిగిన ఉద్యోగులను సంస్థలు నియమించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది’అని వ్యాఖ్యానించారు. డీట్ వేదిక ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగార్థులు తమ నైపుణ్యానికి తగిన ఉద్యోగాలను వెతుక్కోవచ్చని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నియామక సంస్థలకు కూడా తమకు అవసరమైన మానవ వనరులను ఎంపిక చేసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ఉపాధి కల్పన రంగంలో ఈ తరహా వేదిక దేశంలోనే మొదటిదని ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. కార్యక్రమంలో ఈక్విఫాక్స్ ఇండియా ఎండీ కేఎం నానయ్య, వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ ప్రతినిధి నిపా మోదీ, వర్క్‌రూట్ సీఈఓ మణికాంత్ చల్లా పాల్గొన్నారు.
డీట్‌తో సత్వర ఉద్యోగాలు
కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా వర్క్‌రూట్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్‌ను రూపొందించింది. ఉద్యోగాల కోసం అన్వేషించే వారు, ఉద్యోగాలిచ్చే వారు డీట్ వేదికగా సంప్రదింపులు జరుపుకునేలా యాప్‌ను సిద్ధం చేశారు. ఇలా ఎంపికైన ఉద్యోగుల వివరాలను వెరిఫై చేసేందుకు ప్రస్తుతం 8 నుంచి 10 రోజుల సమయం పడుతోంది. అయితే ప్రస్తుతం ఈక్విఫాక్స్‌తో డీట్ భాగస్వామ్యం ద్వారా ఇంటర్వ్యూలో ఎంపికైన ఉద్యోగుల వివరాలను తక్షణమే తెలుసుకునే అవకాశముంటుంది. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పన వాతావరణానికి డీట్, ఈక్విఫాక్స్ భాగస్వామ్యం కొత్త రూపునిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment