కేంద్రం మెడలు వంచుదాం | KTR Comments On Rahul Gandhi And Narendra Modi | Sakshi
Sakshi News home page

కేంద్రం మెడలు వంచుదాం

Published Tue, Feb 26 2019 12:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

KTR Comments On Rahul Gandhi And Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 16 సీట్లను గెలుచుకుంటుందని, కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదన్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే ముఖ్య పాత్ర అవుతుందని చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘రాహుల్‌ పాము, చంద్రబాబు ముంగీస. మొన్న ఎన్నికల్లో వీరిద్దరు ఒక్కటయ్యారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తోందని కలలు కన్నారు.

మన రైతు బంధు పథకాన్ని మోదీ కాపీ కొట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు మన పథకాలను కాపీ కొడుతున్నారు. ముసుగుకు, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు. కేసీఆర్‌ సొంతంగా పార్టీ పెట్టుకుంటే... చంద్రబాబు మామ పెట్టిన పార్టీని గుంజుకున్నారు. ముసుగులు తీసేసి రండి అని బాబు మాట్లాడారు. కేసీఆర్‌ను ఓడించి తెలుగు వాళ్ల సత్తా చాటుదాం అని అన్నారు. మొన్న బాబును తెలంగాణలో ఓడించింది తెలుగోళ్లు కాదా? సీఎం కేసీఆర్‌ చక్రవర్తిలా పాలిస్తున్నాడని ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ చెట్లు నాటిన అశోక చక్రవర్తిలా పాలిస్తున్నారు. బాబు పోతేనే జాబు వస్తుందని ఏపీ యువత నమ్ముతోంది’అని కేటీఆర్‌ అన్నారు. 

రాష్ట్రానికి రావాల్సిన నిధులొస్తాయి... 
‘ఈ దేశం మోదీ, రాహుల్‌ జాగీర్‌ కాదు. కాంగ్రెస్‌కు 100, బీజేపీకి 150 సీట్లు దాటవు. ఆ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేవు. మోదీకి అధికారమిస్తే చీపుర్లు ఇచ్చి ఊడవమనడం తప్ప ఆయన ఏం చేయలేదు. ప్రాంతీయ పార్టీలు దేశాన్ని శాసించబోతున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతలను గెలిపించి లోక్‌సభకు పంపితే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు పట్టుకొస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినట్లు మనకు పాలమూరు ప్రాజెక్టుకో, కాళేశ్వరం ప్రాజెక్టుకో జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్‌ ప్రధానిని కోరారు.

మోదీ మనకు మొండిచేయి చూపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పాలమూరు ప్రజలు టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌లోని హేమాహేమీలకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే రీతిలో తగిన బుద్ధి చెప్పారు. దేవరకద్రలో 130 గ్రామ పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ 110 గెలిచింది. కేసీఆర్‌ ఇద్దరే ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించారు. రేపు 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం. దేవరకద్ర నియోజక వర్గం కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న నాయకులకు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల్లో దేవరకద్ర సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ మెజారిటీ 50 వేలు దాటాలి’అని కేటీఆర్‌ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement