
సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి రోడ్‌షోలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
వీర్నపల్లి (సిరిసిల్ల): తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి మహాకూటమి ఏర్పాటైందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణపై పెత్తనం చలాయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కరెంటు ఇవ్వాలని అడిగిన పాపానికి చంద్రబాబు బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపాడన్నారు. అదే టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే 24 గంటలపాటు ఉచిత కరెంటు ఇస్తోందని పేర్కొన్నారు. దేశంలోనే రైతుబంధు, రైతుబీమా పథకాలు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. గుంట భూమి ఉన్న రైతులకు కూడా రూ.5 లక్షల బీమా కల్పిస్తున్న ఘనత కేసీఆర్‌దే అని పేర్కొన్నారు.
మహాకూటమికి ఓట్ల ద్వారానే తగిన బుద్ధి చెప్పి కేసీఆర్‌ను మరోసారి సీఎం అయ్యేలా ఆశీర్వదించాలని కోరారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేసిన అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసి చూపించిందని చెప్పారు. మారుమూల అటవీప్రాంతమైన వీర్నపల్లిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడ మే కాకుండా తండాలకు లింకురోడ్లు, ఎల్లారెడ్డిపేట నుంచి వీర్నపల్లి వరకు డబుల్‌రోడ్డు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మండలాన్ని సాగునీటితో సస్యశ్యామలం చేయడానికి సీఎం రూ.168 కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. ఎంతోకాలంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు కేంద్రంతో కొట్లాడి పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పింఛన్ల ద్వారా వృద్ధులకు బతుకుపై భరోసా కల్పించామన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్లను రెట్టింపు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గం లోనే వీర్నపల్లి మండలం మెజార్టీలో రికార్డు సాధించాలన్నారు. తన సేవలను గుర్తించి ఓటువేసి మీ బిడ్డలాగా ఆశీర్వదించాలని కోరారు.