ఈసారి ఎవరిది పీఠం? ‘మహా’కూటముల్లో బీఎంసీ ఎన్ని‘కలవరం’ | After Assembly Polls, BMC Elections concerns in Mahakutami | Sakshi
Sakshi News home page

ఈసారి ఎవరిది పీఠం? ‘మహా’కూటముల్లో బీఎంసీ ఎన్ని‘కలవరం’

Published Fri, Nov 29 2024 11:11 AM | Last Updated on Fri, Nov 29 2024 11:24 AM

After Assembly Polls, BMC Elections concerns in Mahakutami

అనివార్య కారణాలతో రెండున్నరేళ్లుగా బీఎంసీ కార్యనిర్వాహక వర్గం ఎన్నికలు వాయిదా 

అడ్డంకులన్నీ తొలగడంతో వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు 

‘అసెంబ్లీ’ఫలితాల జోష్‌తో బీఎంసీపైనా పట్టుసాధించేందుకు మహాయుతి కసరత్తు

ఈ ఎన్నికల్లోనైనా పరువు నిలుపుకోవాలన్న ప్రయత్నాల్లో ఎంవీయే  

 

దాదర్‌: త్వరలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికలు ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే (యూబిటీ)– శివసేనకు, కాంగ్రెస్‌కు పెద్ద సవాలుగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్‌ ఆఘాడీ (ఎంవీఏ) ఘోర పరాజయం చెందడంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 288 స్ధానాలకు ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 23వ తేదీన ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో దేవేంద్ర ఫడ్నవీస్‌ (బీజేపీ), ఏక్‌నాథ్‌ శిందే (శివసేన), అజిత్‌ పవార్‌ (ఎన్సీపీ) నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. మహా వికాస్‌ ఆఘాడి కూటమి అతి తక్కువ స్ధానాలతో ఘోర పరాజయం పాలైంది. దీంతో ఎంవీఏలో కలవరం మొదలైంది. 

2022లోనే ముగిసిన గడువు... 
బీఎంసీ కార్యనిర్వాహక వర్గం గడువు 2022, మార్చితో ముగిసింది. ఈమేరకు 2022, ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగాలి. కానీ ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో రెండున్నరేళ్ల కిందట ఉద్ధవ్‌ ఠాక్రే నేతత్వంలోని ఏవీఏ ప్రభుత్వం కుప్పకూలడం, ఆ తరువాత మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఈ ఏడాది మేలో లోక్‌సభ ఎన్నికలు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు.. ఇలా వరుసగా ఏదో ఒక అడ్డంకులు ఎదురు కావడంతో బీఎంసీ ఎన్నికలు తరుచూ వాయిదా పడుతూ వస్తున్నాయి. రెండున్నరేళ్ల నుంచి ఎన్నికలు జరగకపోవడంతో బీఎంసీలో కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయ ర్‌ ఇలా ప్రజాప్రతినిధులెవరు లేరు. దీంతో గత్యంతరం లేక అడ్మిన్‌ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పర్వం పూర్తికావడంతో జనవరి లేదా ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

దీంతో ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్ని ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘార పరాజయాన్ని చవిచూసిన ఎంవీఏ కూటమిలో శివసేన(యూబీటీ)కి చెందిన కొందరు మాజీ కార్పొరేటర్లు శివసేన(శిందే) వర్గంలో చేరేందుకు సిద్ధమైతున్నట్లు తెలిసింది. అదేవిధంగా మైనార్టీ వర్గాలు మినహా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు కొందరు బీజేపీ లేదా శిందే వర్గంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎంవీయే, కాంగ్రెస్, శివసేన(యూబీటీ), మరోవైపు గత 25 ఏళ్లుగా బీఎంసీలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న ఉద్ధవ్‌ సేనను గద్దె దించేందుకు బీజేపీ, శివసేన(శిందే)లు ఈసారి తీవ్రంగా శ్రమించాల్సిఉంటుంది.  

మళ్లీ ఫిరాయింపులు? 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంవీఏను ముఖ్యంగా ఉద్ధవ్‌ సేనను గట్టి దెబ్బ తీశాయి. శివసేనతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఏక్‌నాథ్‌ శిందేతోపాటు 40 మంది మాజీ కార్పొరేటర్లు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత మరికొంత మంది శిందే వర్గంలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ లోక్‌సభ ఎనికల్లో మహాయుతికి ఆశించినంత మేర ఫలితాలు రాకపోవడం, ఏంవీఏకు ఊహించిన దానికంటే ఎక్కువ లోక్‌సభ స్ధానాలు సాధించడంతో జంపింగులు పూర్తిగా నిలిచిపోయా యి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏంవీఏ ఘోరంగా చతికిలపడటం, మహాయుతి విజయ ఢంకా మోగించడంతో మళ్లీ ఫిరాయింపులు మొదలేయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

ఎమ్మెన్నెస్‌.. అవకాశమే లేదు! 
2017లో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో శివసేన–84, బీజేపీ–82, కాంగ్రెస్‌–31, ఎన్సీపీ–9, ఎమ్మెన్నెస్‌–7, సమాజ్‌వాది పార్టీ–1, ఇండిపెండెంట్లు–14 మంది కార్పొరేటర్లు గెలిచారు. వీరందరి సహకారంతో బీఎంసీ ఐదేళ్లపాటు సజావుగా కార్యకలాపాలు సాగించింది. కానీ ఇప్పుడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. రెండున్నరేళ్ల కిందట ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న విభేదాల వల్ల బీఎంసీలో కూటమిగా ఉన్న శివసేన, బీజేపీ రెండుగా చీలిపోయాయి. దీంతో బీఎంసీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని బీజేపీ స్పష్టంచేసింది. ఆ తరువాత ఎమ్మెన్నెస్‌కు చెందిన ఏడుగురు కార్పొరేటర్లను తమ పార్టీలోకి లాక్కొవడంలో శివసేన సఫలీకృతమైంది. దీంతో ఎమ్మెన్నెస్‌కు ఒక్క కార్పొరేటర్‌ కూడా లేకుండా పోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెన్నెస్‌ ఒక్క సీటును కూడా సాధించలేదు. దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో జరి గే బీఎంసీ ఎన్నికల్లోనూ ఎమ్మెన్నెస్‌ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని, మహాయుతి, శివసేన(యూబీటీ)ల మధ్యే ప్రధానపోటీ జరగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

కాంగ్రెస్‌ అంతంతమాత్రమే... 
కేంద్రంలో అధికారం లేదు. రాష్ట్రంలో రెండున్నరేళ్లకే అధికారాన్ని కోల్పోవల్సి వచ్చింది. ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలైంది. దీంతో అనేక మంది నాయకులు, మాజీ కార్పొరేటర్లు బీజేపీ, శివసేన(శిందే)ల్లో చేరే ప్రమాదం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి బీఎంసీ ఎన్నికలకు సీట్ల పంపకంలో కాంగ్రెస్‌కు చాలా తక్కువ స్ధానాలు లభించే అవకాశాలున్నాయి. దీంతో కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగానే మారనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement