నామినేషన్ దాఖలు చేసిన సోలాపూర్, మాడా లోక్‌సభ అభ్యర్థులు రామ్ సాత్ పూతే, రంజిత్ సింహ నింబాల్కర్
డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కలెక్టర్ కుమార్ ఆశీర్వాద్‌కు నామినేషన్ల సమర్పణ
మాడా లోక్‌సభ ఎన్సీపీ పవార్ అభ్యర్థి ధైర్యశీల మోహితే పాటిల్ నామినేషన్ దాఖలు
ఎన్నికల అధికారి మోనికా సింహ ఠాకూర్ ఆధ్వర్యంలో నామినేషన్
సోలాపూర్: మహాకూటమి అభ్యర్థులు రామ్ సాత్ పూతే, రంజిత్ సింహ నింబాల్కర్ మంగళవారం సోలాపూర్, మాడా లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు ముందుగా ధర్మవీర్ చత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్‌కు ఇరువురు అభ్యర్ధులు ఘన నివాళులర్పించారు. అనంతరం ఛత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్ చౌక్ నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలిరాగా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో సోలాపూర్ అభ్యర్థిగా రామ్ సాత్ పూతే మాడా అభ్యరి్థగా రంజిత్ సింహ నింబాల్కర్ సోలాపూర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల నిర్వహణాధికారి కుమార్ ఆశీర్వాద్‌కు నామినేషన్లను సమర్పించారు.
ఈ ర్యాలీలో ఎంపీ జై సిద్దేశ్వర స్వామి, ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, సచిన్ కళ్యాణ్ శెట్టి, సుభాష్ దేశముఖ్, యశ్వంత్ మానే, సమాధాన్ అవతాడే, భవన్ రావు షిండే, సంజయ్ షిండే, జై కుమార్ గోరే, షాహాజీ పాటిల్, మాజీ మంత్రి లక్ష్మణరావు డోబలే, మాజీ ఎమ్మెల్యే రాజన్ పాటిల్, ప్రశాంత్ పరిచారక్, దీపక్ బాబా సాలోంకే, కిషోర్ దేశ్ పాండే, విక్రం దేశముఖ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నరేంద్ర కాలే, జిల్లా అధ్యక్షుడు చేతన సింహ కేదార్, షాజీపవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ, శివసేనలతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల ఆఫీస్ బేరర్లు, ప్రతినిధులు, కార్యకర్తలు తమ పార్టీల జెండాలను చేతబూని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
నాయకులందరూ ప్రత్యేక ప్రచార రథంలో నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలగా వేలాది మంది కార్యకర్తలు నినాదాలు చేస్తూ వారిని అనుసరించారు. ర్యాలీ చత్రపతి శ్రీ శంభాజీ మహరాజ్ చౌక్ నుంచి ప్రారంభమై చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్, మెకానిక్ చౌక్, సరస్వతి చౌక్, చారు హుతాత్మ పూతల చౌక్‌కు చేరుకున్న అనంతరం శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి అలాగే అక్కడ ఉన్న నలుగురు అమర వీరుల విగ్రహాలకు, అహల్యా దేవి హోల్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు నాయకులంతా అంజలి ఘటించి నివాళులర్పించారు.
అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రసంగిస్తూ ...ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా మార్గదర్శనం చేయాలని సూచించారు. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి వల్ల బీజేపీ ఈ రెండు స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ధైర్య శీల మోహితే పాటిల్ కూడా...
మరోవైపు మాడా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ పవార్ పార్టీ తరపున ధైర్య శీల మోహితే పాటిల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మాడా నియోజకవర్గం ఎన్నికల అధికారి మోనికా సింహ ఠాకూర్‌కు నామినేషన్‌ను సమర్పించారు. పాటిల్ రెండు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసి ఎన్సీపీ పవార్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సింహ మోహితే పాటిల్ డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ధైర్యశీల్ మోహితే పాటిల్ సతీమణి శీతల్ దేవి, సోదరుడు జయసింహ మోహితే పాటిల్ , మాజీ ఎమ్మెల్యే నారాయణ పాటిల్, పవార్ ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు బలిరాం కాకాసాటే, సురేష్ అసాపురే, శివసేనకు చెందిన అనిల్ కోకిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment