
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత అభివృద్ధి వేగం ఊపందుకుంది. ఇదివరకున్న ప్రభుత్వాలు చేయలేని సాహసోపేత కార్యక్రమాలన్నీ మా ప్రభుత్వం చేసింది. ఆ కృషిని ప్రజలు గుర్తించి అధికారాన్ని కట్టబెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాం. ఇదంతా గమనించాలి. వాస్తవాలను గుర్తించాలి. జీరో అవర్‌లో అవకాశం దొరికిందని హీరోగిరి చేస్తే కుదరదు’అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలను ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించలేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల కురిసిన వర్షాలతో తన నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల్లోని పలు కాలనీల్లో వర్షపునీరు చేరి చెరువులను తలపించాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి వసతులు కల్పించాలని కోరారు. మంత్రి కేటీఆర్ కలగజేసుకుంటూ పైవిధంగా స్పందించారు. ‘పట్టణ ప్రగతి కింద రూ.138 కోట్లు విడుదల చేశాం. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తాం. ఆరేళ్లుగా మేము పనిచేయకుంటే అన్ని సీట్లు ఎలా వస్తాయి? అన్ని మున్సిపాలిటీల్లో మా పార్టీ ఎలా అధికారం కైవసం చేసుకుంటుంది? అని ప్రశ్నించారు.