సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
వనస్థలిపురం (హైదరాబాద్): బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే ప్రతిపక్ష నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. ప్రతిపక్షాల నేతలు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని.. కేసీఆర్ వయసును గౌరవించాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా నిలుస్తారని చెప్పారు.
బుధవారం హైదరాబాద్‌లోని హస్తినాపురం జీఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్లపై ఆంక్షలతో ఇబ్బందిపడుతున్న కాలనీలకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో 118 కింద ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని 4వేల మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలసి రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు.
దేశంలో నంబర్‌వన్‌గా నిలిపాం
‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’అని సామెత ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వడంతోపాటు పేద అమ్మాయిల పెళ్లికి ఆర్థిక సాయం కూడా చేస్తాందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో పూర్తిచేశామని, రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి సురక్షిత తాగునీరు ఇచ్చామని పేర్కొన్నారు.
నల్లగొండ ఫ్లోరైడ్, పాలమూరు వలసల సమస్యలు తొలగిపోయాయని పేర్కొన్నారు. గతంలో గాందీ, ఉస్మానియా, నిమ్స్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవని.. ఇప్పుడు హైదరాబాద్ నలుమూలలా 10వేల బెడ్లతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే ఆస్పత్రుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు.
వేల కుటుంబాలకు లబ్ధి: సుధీర్‌రెడ్డి
తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పట్నుంచే రిజిస్ట్రేషన్లపై ఆంక్షల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానని, దీనికోసమే బీఆర్‌ఎస్‌లో చేరానని ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్‌గుప్తా, ఎగ్గె మల్లేశం, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment