సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.
‘‘రుణమాఫీ అంశంపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తాం. రెండు రోజుల్లో వివరాల సేకరణ ప్రారంభిస్తాం. కలెక్టర్లలకు, సీఎస్‌కు డేటా ఇస్తాం. మా ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కోసమే మేము డేటా ఇస్తున్నాం. మా హరీష్ రావు ఆఫీసుపై దాడి చేశారు. అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారు. ఎల్లుండి నుంచి డేటా సేకరణ మొదలు పెట్టి వారం రోజుల్లో పూర్తి చేస్తాం.
973 ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల్లో మా చైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారు.. వారి నుంచి వివరాలు సేకరిస్తాం. మొదట వినతిపత్రాలు ఇస్తాం.. రాజకీయం చేయకుండా ముందు రిప్రజెంటేషన్ ఇస్తాం. సాక్షి పత్రిక చాలా చక్కటి వార్త రాసింది. 50 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 22 లక్షల రైతులకే పరిమితం చేశారు. కేవలం 40 శాతం మాత్రమే రుణ మాఫీ అయ్యింది. ఇంకా సుమారు 28 లక్షల మంది రైతులకు రుణ మాఫీ జరగలేదు. క్షేత్ర స్థాయిలో రిపోర్టులు సేకరించి కలెక్టర్లకు ఇస్తాం.. ఆ తర్వాత సచివాలయంలో ఇస్తాం. హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయం ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి మీద దాడి చేసిన వాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదు.
ముఖ్యమంత్రికి సంబంధించిన మీడియా ప్రతినిధులు ఒక ఐపీఎస్ అధికారిని కొట్టినంత పని చేశారు. ఫాక్స్ కాన్ సంస్థలో లక్ష ఉద్యోగులు కల్పిస్తామని గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఫాక్స్ కాన్ సంస్థ ఒక దశ పూర్తి అయ్యింది. 25 వేల మందికి ఉద్యోగాల కల్పన రాబోతుంది. సీతారామ ప్రాజెక్టు మాదిరిగా ఫాక్స్ కాన్ రిబ్బన్ కట్ చేసి మేమే చేశామని చెబుతారు. మాకు కేంద్ర మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు.
రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి..
‘ప్రధానమంత్రి మోదీ అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితులు వద్ద బయట పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయం. నేను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోదీతో చెప్పింది? వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలి?. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి.
మహిళా కమిషన్ నోటీసులపై..
నాకు మహిళా కమిషన్ నుంచి ఈ మెయిల్ వచ్చింది. కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాను. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు వెళ్తా. చట్టాన్ని గౌరవిస్తాను. 8 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన దాడులు, బాధితుల వివరాలు అన్ని తీసుకొని వెళ్తా. ఏం చర్యలు తీసుకున్నారో అడుగుతా. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళలపై జరిగిన దాడి వివరాలు కూడా అందిస్తాను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment