కాంగ్రెస్‌ మార్క్‌ మార్పు ఇదేనా!: కేటీఆర్‌ | BRS Leader KTR Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మార్క్‌ మార్పు ఇదేనా!: కేటీఆర్‌

Published Thu, May 23 2024 4:55 AM | Last Updated on Thu, May 23 2024 4:55 AM

సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్, పక్కన ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ ఫైర్‌ 

ఒకవైపు కరెంట్‌ కోతలు.. మరోవైపు కాలుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు 

సీఎం రేవంత్‌రెడ్డి ఓ మెజీషియన్‌.. పచ్చిఅబద్ధాలకోరు 

మొదటి రోజే మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పండి 

హనుమకొండ, నర్సంపేట, వరంగల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘రాష్ట్రంలో ఓ వైపు కరెంట్‌ కోతలు, మరోవైపు కాలుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు..మోటార్లు, ఆస్పత్రుల్లో గంటల తరబడి కరెంటు కోతలు, ఎండుతున్న చెరువులు.. ఇదేనా కాంగ్రెస్‌ మార్కు మార్పు? ఒక్కసారి ఆలోచించి వారికి ఇప్పటికైనా తగిన బుద్ధి చెప్పాలి..’అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘6 నెలల క్రితం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేసీఆర్‌తో సహా అందరం ప్రతి నియోజకవర్గంలో పర్యటించాం. మోసపోతే గోసపడుతామని చెప్పాం. కానీ కాంగ్రెస్‌ వాగ్దానాలు నమ్మి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. 

కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపితే నమ్మి ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నారు. డిసెంబర్‌ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. కేసీఆర్‌ లక్ష మాఫీ చేసిన వారికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మొదటి రోజే మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఏం శిక్ష వేస్తారో వేయాలి..’అని అన్నారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఓ మెజీషియన్‌.. పచ్చి అబద్ధాలకోరు. తెలంగాణ ప్రజలను ఇంకా నమ్మించాలని చూస్తున్నాడు..’అని ధ్వజమెత్తారు. వరంగల్‌–నల్లగొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నర్సంపేట, వరంగల్, హనుమకొండలలో నిర్వహించిన సమావేశాల్లో కేటీఆర్‌ ప్రసంగించారు. 

రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు 
‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈస్ట్‌మన్‌ కలర్‌ సినిమా చూపించారు. కానీ రాష్ట్రంలో కరెంట్‌ కోతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం నాటి ఘటనే ఉదాహరణ. ఎంజీఎం లాంటి పెద్ద ఆస్పత్రిలో 5 గంటలు కరెంట్‌ పోవడం దారుణం కాదా? ఆరు నెలల క్రితం వ్యవసాయం ఎలా ఉండే? ఇప్పుడు ఎలా ఉంది? రుణమాఫీ జరిగిందా? కౌలు రైతులకు, రైతు కూలీలకు సాయం అందిందా? వంద రోజుల్లోనే చేసేస్తామన్న హామీలు ఏమయ్యాయి? రూ.2500 వచ్చినయా? ఏడాదిలో రూ.2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పి ఏదీ చేయలేదు. నాట్లు వేసే నాడు వేయాల్సిన రైతుబంధు..ఓట్లు వేసే నాడు రేవంత్‌రెడ్డికి గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశానని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలో అన్ని హామీలు ఆమలు చేస్తున్నట్లు రాహుల్‌గాం«దీ, ప్రియాంక గాం«దీలు కూడా ఇతర రాష్ట్రాల్లో అబద్ధాలు చెబుతున్నారు..’అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.  

పదేళ్ల ప్రగతి చెప్పుకోవడంలో విఫలమయ్యాం 
‘గత పదేళ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. కానీ మనం చేసిన మంచి పనులను చెప్పుకోవటంలో విఫలమయ్యాం. యూట్యూబ్‌లలో మనపై తప్పుడు ప్రచారాలు చేశారు. దీని కారణంగానే 1.8 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో మనం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు అవుతుంది. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించి కాంగ్రెస్‌కు తగ్గిన బుద్ధి చెప్పాలి..’అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఆయా సమావేశాల్లో రాకేశ్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీలు డా.బండా ప్రకా‹Ù, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మధుసూదనచారి, ఎమ్మెల్యేలు డా.సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. 

మానవత్వాన్ని చాటిన కేటీఆర్‌ 
గీసుకొండ: రోడ్డు పక్కన పడిపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, మాజీ మంత్రి కేటీఆర్‌ మానవత్వాన్ని చాటారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి నర్సంపేట వెళుతుండగా గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు సమీపంలో అంజయ్య అనే వ్యక్తి మోపెడ్‌పై వెళుతూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనపడి అపస్మారకస్థితిలో ఉన్నాడు. విషయం గమనించిన కేటీఆర్‌ కారు ఆపి అతన్ని పరిశీలించారు. వెంటనే గన్‌మెన్ల సాయంతో తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నర్సంపేటకు వెళ్లారు. 

ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 
– పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు 
– కాంగ్రెస్‌ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు 
– ‘ఎక్స్‌’లో కేటీఆర్‌ 
సాక్షి, హైదరాబాద్‌:  ఆరు నెలల కాంగ్రెస్‌ పాలనలో ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. పదేళ్లు కనిపించని కరెంట్‌ కోతలు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల ముట్టళ్లు ఇప్పుడు చూస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. ‘కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు మళ్లీ ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నాం. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నాం. 

బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు. పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాసుబుక్కులతో క్యూలు కడుతున్నారు. అయినా కాంగ్రెస్‌ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. వైఫల్యాల కాంగ్రెస్‌ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..’అని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement