సన్న వడ్లపై సర్కార్‌ సన్నాయి నొక్కులు | Sakshi
Sakshi News home page

సన్న వడ్లపై సర్కార్‌ సన్నాయి నొక్కులు

Published Wed, May 22 2024 5:51 AM

KTR Fires on Congress Party in Nalgonda

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక భేటీలో మాజీ మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

కాంగ్రెస్‌ ఐదు నెలల పాలనలో ఐదేళ్ల అపఖ్యాతి మూటగట్టుకుందని విమర్శ

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి బ్లాక్‌ మెయిలర్‌ అని ఆరోపణ

నల్లగొండ టూటౌన్‌/ మిర్యాలగూడ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్‌ అంటూ రేవంత్‌రెడ్డి సర్కార్‌ సన్నాయి నొక్కులు నొక్కుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మారని, కానీ ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల అపఖ్యాతిని మూటగట్టుకుందని విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియాల లో నిర్వహించిన వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమా వేశాల్లో కేటీఆర్‌ మాట్లాడారు.

‘‘కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2,500, వరి ధాన్యానికి రూ.500 బోనస్‌ అని అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. డిసెంబర్‌ 9 నాటికి రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. మే వచి్చనా సొమ్ము వేయలేదు. నాగార్జునసాగర్‌ ఆయకట్టు ఎండిపోతే కాంగ్రెస్‌ నాయకులు పట్టించుకోలేదు. అన్నదాతలు ఆగమవుతున్నారు. సాగర్‌ ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పజెప్పిన దద్దమ్మలు కాంగ్రెస్‌ వాళ్లు. రేవంత్‌ పాలనలో అంతా మోసమే..’’అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి కాంగ్రెస్‌ను గెలిపించారని.. ఇప్పుడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ మోసపోవద్దని పేర్కొన్నారు. మొదటిసారి మోసపోతే కాంగ్రెస్‌ మాయ అనుకుందామని.. అదే రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌ అభ్యర్థి బ్లాక్‌ మెయిలర్‌.. 
ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచి్చన గోల్డ్‌ మెడ లిస్ట్‌ కావాలో.. బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బులు గుంజే గోల్డ్‌ స్నాచర్‌ కావాలో పట్టభద్రులు తేల్చుకోవాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న బ్లాక్‌ మెయిలర్‌ అని ఆరోపించారు. దీనిపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఆలోచన చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలిస్తే.. మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.­

Advertisement
 
Advertisement
 
Advertisement