సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2014కు ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. తె లంగాణలో ఇప్పుడు కరెంటు కో తలు, చీకట్లు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, విద్యుత్ కోతల సమస్యలను ప్రస్తావిస్తూ ‘ఎక్స్’లో కేటీఆర్‌కు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో కరెంట్ కోతలే లేవంటూ ప్రకటిస్తున్న డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ట్యాగ్ చేస్తూ నెటిజన్ల ట్వీట్లను కేటీఆర్ శనివారం రీట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ‘విద్యుత్ కోతలే లేకుండా పవర్ సెక్టార్‌లో బీఆర్‌ఎస్ సృష్టించిన మౌలిక సదుపాయాలను కూడా వాడుకోలేని అసమర్థ స్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. 2014కు ముందు తరచూ విద్యుత్ కోతలు, పవర్ హాలిడేస్ మనకు ఉండేవి. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత కేసీఆర్ సర్కార్‌ది. 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేయటం కారణంగా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయే పరిస్థితి వచ్చింది.
కానీ ఈ పనికిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పదేళ్ల క్రితం నాటి పాత రోజులను తిరిగి తీసుకొచ్చింది’అని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ కోతలు లేకుండా కేసీఆర్ చేసిందేమిటని కొంతమంది అడుగుతున్నారని...వాళ్లకోసం కొన్ని వివరాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ‘1,110గా ఉన్న తలసరి వినియోగం 2,110 యూనిట్లకు చేరిక. సౌర విద్యుత్ సామర్థ్యం 71 మెగావాట్ల నుంచి 5,000+ మెగావాట్లకు పెంపు.
తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్ల చేరిక. ట్రాన్స్‌మిషన్ సామర్థ్యం 13,900 మెగావాట్ల నుంచి 37,000 మెగావాట్ల వరకు పెంపు. కేసీఆర్ గారి పాలనలో పవర్ హాలిడేస్ అనే మాటే లేదు’అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు కాంగ్రెస్ సర్కార్‌ను తిడుతూ పెట్టిన కామెంట్లను కేటీఆర్ రీపోస్ట్ చేశారు.
అమరుల స్తూపానికి ఇనుప కంచె..కేటీఆర్ ఎద్దేవా
గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద ఇనుప కంచెతో బ్యారికేడ్ ఏర్పాటు చేయడంపై కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘మార్పు వచ్చింది’అనే శీర్షికతో ‘ఇందిరమ్మ పాలనలోని ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు తెచ్చేలా అమరుల స్థూపానికి కూడా ఇనుప కంచెలు తెచ్చింది’అంటూ కంచె ఏర్పాటు చేసిన ఫొటోను ట్యాగ్ చేశారు.
ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధంలేకుండా ఫలితాలు: కేటీఆర్
ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా ఫలితాల్లో ఎగ్జాక్ట్ పోల్స్ వస్తాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అమరజ్యోతి వద్ద నివా ళులు అర్పించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. జీవితంలో ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని, అమరులకు నివాళులు అర్పించని వ్యక్తి తెలంగాణకు సీఎంగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోరాటాలను, అమరుల త్యాగాన్ని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులను చంపినది, బలిదానాలకు కారణమైనదే కాంగ్రెస్ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment