ప్రజలు కేసీఆర్‌ను ఆశీర్వదిస్తారు..
తెలంగాణలో మళ్లీ గులాబీ జెండాయే ఎగురుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టిన తొలి సీఎంగా రికార్డు సాధిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే భావనంలో ప్రజలు ఉన్నారు. రైతులు, పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను దేశానికి పరిచయం చేసేందుకు బయలుదేరిన కేసీఆర్‌ను ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ, బీజేపీపై బీఆర్‌ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు విరుచుకుపడ్డారు. ఏటీఎం అంటే అదానీ టూ మోదీకి డబ్బుల ప్రవాహమే అని ఆయన కొత్త భాష్యం చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని, బీజేపీకి ఈసారి కూడా వందకుపైగా సీట్లలో డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. ఈ నెల 27న బీఆర్‌ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే...
ఏటీఎం అంటే...
ఏటీఎం అంటే అదానీ నుంచి మోదీకి డబ్బుల ప్రవాహం సాగడమే. అవినీతి గురించి మోదీ ఆయన మంత్రులు మాట్లాడటం విడ్డూరం. సీబీఐ, ఈడీలను చేతిలో పెట్టుకొని కేంద్రం ఆటలాడుతోంది. కానీ ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ç2024లో మోదీకి గుజరాత్‌కు ఘర్ వాపసీ తప్పదు. 2024లో ప్రధాని పదవి ఖాళీ కాక తప్పదు. ఎవరేం అనుకున్నా తెలంగాణలో గత ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీకి ఈసారి 103 స్థానాల్లో మళ్లీ డిపాజిట్లు దక్కవు.
మోదీ అప్పట్లో రాష్ట్రం విడిచి తిరగలేదా..?
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ మోదీ 2010 నుంచి 2014 వరకు పాలన గాలికొదిలేసి గాలి తిరుగుడు తిరగలేదా? తెలంగాణలో మౌలికవసతులు కల్పించాకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. గుజరాత్‌లో నేటికీ మంచినీరు, విద్యుత్ కొరత వంటి సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో సమస్యలు లేవనడం లేదు. మా కార్యకలాపాలకు కేంద్రం తెలంగాణయే. ఢిల్లీ కేంద్రంగానే పార్టీని నడపాలనే ఖానూన్ ఏమీ లేదు. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలను శాసించవచ్చు. ప్రజల ఆశీర్వాదం, ఆదరణ మాకు లభిస్తే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?
ఆ ఆరోపణలు పాత చింతకాయ పచ్చడి...
పరివార్‌వాదీ, ఎంఐఎంతో అనుబంధం, మా కుటుంబంపై అవినీతి ఆరోపణలు పాత చింతకాయ పచ్చడి. ప్రజలకు ఇష్టం లేకుంటే మమ్మల్ని తిరస్కరిస్తారు. కర్ణాటకలో 40–50 మంది బీజేపీ నేతల కుటుబ సభ్యులకు టికెట్లు ఇవ్వడం పరివార్‌వాదీ కాదా? అక్కడ బీజేపీకి వర్తించని నిబంధనలు మాకే వర్తిస్తాయా?. కరప్షన్ క్యాప్టెన్ మోదీ.. క్యాప్షన్ బీజేపీ. అదానీ, ప్రధాని అవిభక్త కవలలు.
మోదీ అత్యంత అవినీతిపరుడు. పాలన చేతకాని అసమర్థుడు. బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 20 వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? ఎంఐఎం అనే పార్టీ భుజంపై తుప్పుబట్టిన తుపాకీ పెట్టి ఎన్నిసార్లు కాల్చినా ప్రజలకు స్పష్టత ఉంది. పేదల కోసం పనిచేసే వారిని ప్రజలు ఆదరిస్తారు. బీజేపీ చేసే మతపరమైన రాజకీయం తెలంగాణ చైతన్యం ముందు చెల్లదు.
విస్తరణ బాటలో ఉన్నాం...
60 లక్షల సైన్యంగల పార్టీ బీఆర్‌ఎస్. దేశంలోనే ఇంత పెద్ద బలగం, సైన్యం ఉన్న పార్టీ మరొకటి లేదు. జాతీయ పార్టీగా రూపాంతరం చెందినా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లోకి ఇంకా బలంగా వెళ్లలేదు. ఇప్పుడిప్పుడే మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించే ప్రయత్నంలో ఉన్నాం. టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారినా మా జెండా, ఎజెండా, మా నాయకుడు, గుర్తు మారలేదు. తెలంగాణనే మాకు మొదటి ప్రాధాన్యం. తెలంగాణ మోడల్‌ను దేశానికి చూపుతున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఇతర రాష్ట్రాల్లో ఎగురవేయడానికి బయలుదేరాం. అంతే కాని తెలంగాణను వదిలి వెళ్లలేదు.
శిఖండి రాజకీయం..
మహాభారతంలో శిఖండి రాజకీయం చేసినట్లు నేరుగా గెలవలేక కొత్త పార్టీలు, చిన్న పార్టీలను అడ్డుపెట్టుకొని బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఈ పార్టీల నాయకులు నిద్రలేచింది మొదలు కేసీఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడమే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదు. అమిత్ షా అడ్డగోలుగా మాట్లాడినా ఒక్కరూ ప్రశ్నించరు. బీజేపీపై మరకపడకుండా చూస్తూ బీఆర్‌ఎస్ ఓట్లను చీల్చడమే వారి పని. తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకొని బీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తారు.
ఎన్నికల సమాయత్తానికే సమ్మేళనాలు..
ఎన్నికల ఏడాదిలో కేడర్‌ను సిద్ధం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. ఈ సమ్మేళనాల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్నాచితకా లోటుపాట్లు ఉంటే సవరించుకుంటాం. మే నుంచి యువజన, విద్యార్థి సమ్మేళనాలు నిర్వహిస్తాం. విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసేలా జూన్ నుంచి బీఆర్‌ఎస్‌వీ ఎన్‌రోల్‌మెంట్ ప్రారంభిస్తాం. రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్ష, రాష్ట్ర ప్రభుత్వ విజయాలను విద్యార్థులు, యువతకు వివరించి మత కలహాలతో చిచ్చు పెట్టే పార్టీ కావాలా లేదా తెలంగాణను పచ్చగా చేసే పార్టీ కావాల ఆలోచించుకోవాలని చెప్తాం.
వారికి భవిష్యత్తులో అవకాశాలు..
పార్టీలో టికెట్లు ఆశించడం అసహజ విషయమేమీ కాదు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందనే స్పష్టత మా పార్టీ నేతలకు ఉంది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన వారు ఎన్నికల్లో కొట్లాడతారు. రాకున్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడే వారికి రేపు మరో అవకాశం వస్తుంది. తొమ్మిదేళ్లలో అనేక మంది విద్యార్థి, యువజన నాయకులకు ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ల చైర్మన్లుగా, కమిషన్ల సభ్యులుగా అవకాశం ఇచ్చాం. మాట ఇచ్చిన వారందరినీ అకామిడేట్ చేసుకున్నాం. ఎవరికైనా అవకాశాలు రాకుంటే భవిష్యత్తులో ఇస్తాం.
గవర్నర్ వ్యవస్థతో కేంద్రం రాజకీయం...
గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష ప్రభుత్వాల గొంతును కేంద్రం నులుముతున్న తీరును దేశం గమనిస్తోంది. గవర్నర్ వ్యవస్థతో రాజకీయం చేసి రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం.
కొందరికి ఆదరణ లేకే...
పాదయాత్రల పేరిట కొందరు ఆపసోపాలు పడినా ప్రజలు పట్టించుకోవడం లేదు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు, అస్తిత్వం కోల్పోతామనే చిల్లర ప్రయత్నాలతో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ డబ్బులు ఇచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతోపాటు కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ, ఇతర ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఏకమై పనిచేశాయి.
అదానీతో మోదీకి సంబంధం లేదని బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తారా? ప్రమాణాలు, ఇమానాల మీద తేలేదుంటే కోర్టులు ఎందుకు? ఇంకో పార్టీకి డబ్బులు పంపే ఖర్మ మాకేంటి? వాళ్లందరికీ పంచేంత డబ్బులు మా వద్ద లేవు. బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణకు ఉపద్రవాలు. ఎంత త్వరగా వదిలించుకుంటే తెలంగాణకు అంత మంచిది.
జాతీయ పార్టీ ఒకేసారి దేశమంతా పోటీ చేయాలని లేదు...
బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మారినంత మాత్రాన దేశమంతా ఒకేసారి పోటీ చేయాలన్న రూలేమీ లేదు. రెండు స్థానాల నుంచి 300 స్థానాలకు చేరుకొనేందుకు బీజేపీకి 30–40 ఏళ్లు పట్టింది. 2024లో 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలనే తొందరేమీ మాకు లేదు. పట్టుదొరికి బలంగా ఉన్న చోట, గెలిచే అవకాశం, పార్టీ విస్తరణకు అవకాశం ఉన్న చోట పోటీ చేస్తాం.
మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లలో పోటీ చేస్తామా, ఇతరులతో అవగాహన ఉంటుందా ఇప్పుడే చెప్పలేము. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ విస్తరణకు పనిచేస్తూనే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడాన్ని మొదటి కర్తవ్యంగా పనిచేస్తాం. దేశంలో రాజకీయ శూన్యత నేపథ్యంలో బీఆర్‌ఎస్ బలమైన పార్టీగా ఎదుగుతుంది.
కుమారస్వామికి మద్దతు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్ (సెక్యులర్) నేత కుమారస్వామికి మద్దతివ్వాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయాలని కుమారస్వామి కోరితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
మా ప్రత్యర్థి కాంగ్రెస్సే..
తెలంగాణలో మాకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి. క్షేత్రస్థాయిలో అంతోఇంతో కాంగ్రెస్ ఉన్నా టీపీసీసీ అధ్యక్షుడి ఒంటెద్దు పోకడలతో కేడర్, లీడర్లు నిరాసక్తతతో ఉన్నారు. 2018లో 19 సీట్లు వస్తే ఈసారి కాంగ్రెస్‌కు డబుల్ డిజిట్ వస్తుందో రాదో తెలియదు. కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదు.
మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు. భవిష్యత్తులో వారితో పనిచేసే విషయంలో ఎన్నికల నాటికి నిర్ణయం ఉంటుంది. అదానీ షేర్ల స్కాం అంశం విషయంలో పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ) ఏర్పాటు డిమాండ్ కోసం కాంగ్రెస్‌తోపాటు ఇతర విపక్షాలతో కలసి కేవలం ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం పనిచేశాం.
Comments
Please login to add a commentAdd a comment