భూపాలపల్లిలోని ఓ డబుల్‌బెడ్‌రూం ఇంట్లో పాలు పొంగించేందుకు స్టౌ వెలిగిస్తున్న మంత్రి కేటీఆర్
భూపాలపల్లి: ‘శత్రుదేశం మీద కక్ష గట్టి దండయాత్రకు దిగినట్లుగా.. ప్రధాని నరేంద్ర మోదీ వేట కుక్కల్లాంటి కేంద్ర సంస్థలను తెలంగాణపైకి ఉసిగొల్పుతున్నారు. పీఎం మోదీ దేవుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటాడు. అదానీకి దేవుడా? లేక ఆయనకు దేవుడా? ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీకి 75 ఏళ్లలో పదిసార్లు అవకాశం ఇస్తే అభివృద్ధి జరిగిందా?..’అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో రూ.276 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు.
పదిసార్లు గెలిపిస్తే సోయి లేదా?
‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ అడుక్కుంటున్నాడు. 75 ఏళ్లలో పదిసార్లు గెలిపిస్తే సోయి లేదా.. గుడ్డి గుర్రాల పళ్లు తోమారా?.. ఇవ్వాళ మళ్లీ మొరుగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి కరెంట్, పేలిపోయిన మోటార్లు, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, పాము కాట్లు, విద్యుత్ షాక్‌తో రైతులు మృతి చెందిన సంఘటనలు ఎన్నో చూశాం.
మనిషి చచ్చిపోతే దహనం అనంతరం స్నానం చేసేందుకు కరెంటు సరఫరా కోసం బతిమిలాడే పరిస్థితి ఉండేది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో గరిష్టంగా 13,662 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 14,700 మెగావాట్ల డిమాండ్ ఉందంటే రాష్ట్రం ఏమేరకు అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు..’అని మంత్రి అన్నారు.
మాది వసుదైక కుటుంబ పాలన..
‘రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ బీజేపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే రకరకాల మాటలు మాట్లాడతారా? మీరు చేస్తే సంసారం.. మేము చేస్తే వ్యభిచారమా?.
ప్రజల మనసులను గెలవాలంటే ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పాలే తప్ప ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ కావాల్సిన పథకాలు అందిస్తూ ఒక మామలా, అన్నలా, పెద్ద కొడుకులా, తాతలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల మందీ కేసీఆర్ కుటుంబమే. మాది వసుదైక కుటుంబ పాలన..’అని చెప్పారు.
పార్టీ పేరు మాత్రమే మారింది..
‘ఎన్నికల యుద్ధానికి యువత సిద్ధం కావాలి. పార్టీ పేరు మాత్రమే మారింది. డీఎన్‌ఏ రంగు, గుర్తు కూడా అలాగే ఉంది. వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో తెలంగాణ మాదిరిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ పెట్టారు. నిన్న, మొన్న వచ్చిన కొంతమంది చిల్లరగాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్ళకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా సమాధానం ఇవ్వాలి.
ఆ పార్టీలు పిచ్చోళ్ల చేతిలో ఉంటే తెలంగాణ ఆగమైతది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? మీకు పదవులు వచ్చేవా?’అని కేటీఆర్ ప్రశ్నించారు. సభలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, ఎంపీ దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment