సాక్షి, హైదరాబాద్: అర్థవంతమైన సంస్కరణలు అభివృద్ధిలో భాగమేనని, కొత్త మున్సిపల్ చట్టాన్ని చాలా పదును, పటుత్వంతో శక్తివంతంగా రూపొందించారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పేర్కొన్నారు. పురపాలనలో సామాన్యుల పాలిట శాపంగా మారిన అవినీతి చీడ ఈ చట్టంతో తొలగిపోతుందని, రాజకీయ జోక్యం కూడా తగ్గిపోతుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మొండితనం, సంకల్పం తెలిసినవారు పూర్తిగా చట్టాన్ని అవగాహన చేసిన తర్వాతే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. శుక్రవారం శాసనసభ నిరవధిక వాయిదా అనంతరం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శాసనసభ్యులమైన తాము శాసనాలు చేయడం మర్చిపోయి రోడ్లు, డ్రైనేజీలంటూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఈ కొత్త చట్టంతో అలాంటి పరిస్థితి మారిపోతుందని.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యం, బాధ్యతలు ఈ చట్టంతో పెరిగాయని వివరించారు. కొత్త చట్టం పౌరుల చేతుల్లోనే స్వీయ నిర్ణయాధికారాన్ని పెట్టిందని, తద్వారా ప్రజలపై కూడా బాధ్యతలు మోపినట్టవుతుందన్నారు. ప్రజలపై బాధ్యతలు పెట్టడంతో పాటు విధులను విస్మరించినా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పదవీచ్యుతులయ్యేలా చట్టాన్ని రూపొందించారని చెప్పారు.
నలుగురు గెలిస్తేనే ఆగట్లేరు..
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలలో చిప్‌లు పెట్టామన్నారు. మరి బ్యాలెట్ పోరు ద్వారా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మా విజయం గురించి ఏమంటారు? రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ స్థానాలు ఒకే పార్టీ గెలుచుకోవడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా సాధ్యమైందా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. నలుగురు ఎంపీలు గెలిస్తేనే బీజేపీ నేతలు ఆగట్లేరని, ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ బలమేంటో మున్సిపల్ ఎన్నికల్లో తేలుతుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఎవరు దొరుకుతారా అని, ఎవరిని పార్టీలోకి తీసుకోవాలా అని బీజేపీ ఎదురుచూస్తోందని విమర్శించారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదన్న కేటీఆర్.. ఆ పార్టీకి చెందిన ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన ఖర్మ తనకు లేదన్నారు. గవర్నర్ మారతారంటూ వస్తున్న వార్తలు ఊహాజనితమేనని, అలాంటిదేదైనా జరిగినప్పుడు వ్యాఖ్యానించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఏపీ రాజకీయాలపై ప్రశ్నించగా.. ఆంధ్రప్రదేశ్‌లో, కర్ణాటకలో ఏవో జరుగుతున్నాయి.. వాళ్ల గొడవ మనకెందుకని దాటవేశారు.
35 లక్షల సభ్యత్వాలు పూర్తి..
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం బ్రహ్మాండంగా నడుస్తోందని కేటీఆర్ తెలిపారు. ఈనెల 17 వరకు 35 లక్షల సభ్యత్వాలు అయ్యాయని వివరించారు. ఇంకా చాలా చోట్ల సభ్యత్వాలు పూర్తయినా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోలేదని, ఇప్పటివరకు సభ్యత్వాల ద్వారా రూ.7 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. గతం కన్నా ఎక్కువ సభ్యత్వాలు అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
జర్నలిస్టుల బాధ్యత నాది..
రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు. ‘‘ఇళ్ల స్థలాల కోసం సీఎంను కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు కలిశారు. వారం రోజుల్లో ప్రక్రియ ప్రారంభించాలని ఆయన సీఎంవో అధికారులకు చెప్పినట్టు నాకు సమాచారం ఉంది. ఎమ్మెల్యేలతో పాటే జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు వస్తాయి. ఈ విషయంలో ఐ అండ్ పీఆర్ కమిషనర్, ప్రెస్ అకాడమీ చైర్మన్‌లతో మాట్లాడతా. త్వరలోనే జర్నలిస్టు ప్రతినిధులతోనూ సమావేశమవుతా’’ అని కేటీఆర్ తెలిపారు.
గుండెకాయలాంటి హైదరాబాద్‌ను కాపాడుకోవాలి
రాజధాని శివార్లలోని 7 మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చడం చాలా మంచి నిర్ణయమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముంబై చుట్టూ ఏడు కార్పొరేషన్లు ఉంటాయని, అలాగే హైదరాబాద్ శివార్లలోని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చారని చెప్పారు. గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను సవ్యంగా కాపాడుకోవాలంటే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ల ద్వారా సిబ్బంది పెరిగి ప్రజలకు సేవలు విస్తృతంగా అందుతాయని వివరించారు. ఆయా కార్పొరేషన్ల పరిధిలో పన్నులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ చెప్పినట్టు వెల్లడించారు. కొత్త మున్సిపల్ చట్టంలోని స్ఫూర్తి జీహెచ్‌ఎంసీకి కూడా వర్తిస్తుందని స్పష్టంచేశారు.
అందరూ కట్టుకుంటున్నారు..
‘‘ఐదారు రాష్ట్రాలు కొత్త సచివాలయాలు, అసెంబ్లీలు కట్టుకుంటున్నాయి. గాంధీనగర్‌లో మొత్తం మార్చేశారు. మనం మార్చుకుంటే తప్పేముంది? ఈ భవనాలు ఇంకో 100 ఏళ్ల పాటు ఉపయోగపడతాయి కదా’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఆగిపోయిందని కేంద్రం చెప్పలేదని, భూసేకరణ భారంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 50శాతం ఇవ్వాలని చెప్పినట్టు తనకు సమాచారం ఉందని వెల్లడించారు. ప్రతిపక్షాలకు ఏ అంశంపై మాట్లాడాలో అర్థం కాక ఇలాంటి వాటిపై స్పందిస్తున్నాయని, ప్రజలకు సంబంధించిన అంశాలను గుర్తించడంలో ప్రతిపక్షాలు విఫలమ్యాయని విమర్శించారు. ప్రతిపక్షంలో నాయకత్వ సంక్షోభం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం చేయాల్సింది చేసింది..
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదేనని, ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జులు చూసుకుంటారని కేటీఆర్ తెలిపారు. పెంచిన పింఛన్లు కూడా పంపిణీ చేస్తున్నామని, 75 గజాల భూమికి ఆస్తి పన్ను తగ్గించామని, భగీరథ ద్వారా దాదాపు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు నీళ్లు అందించడం.. ఇలా ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేశామని స్పష్టంచేశారు. ఇక స్థానిక నేతలు సమన్వయం చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ ఎన్నికల్లో అగ్రభాగం తామే గెలుచుకుంటామని, రెండో స్థానంలో ఎవరుంటారో కాంగ్రెస్, బీజేపీలే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడనేది కోర్టు నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని, త్వరలోనే జరుగుతాయని తాను అనుకుంటున్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment