
సంచార వైద్యశాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. చిత్రంలో వినోద్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ తదితరులు
కరీంనగర్ రూరల్: కరోనాపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆపత్కాలంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వంపై బురద చల్లడం కేవలం పైశాచికానందం తప్ప సాధించేదేమీ ఉండదన్నారు. బుధవారం కరీంనగర్ శివారు నగునూరులో ప్రతిమ సంచార వైద్యశాలను మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ.. విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘తెలంగాణలో కరోనా టెస్టులు, చేయడం లేదు.. డేటా దాస్తున్నారు.. కేసీఆర్ సర్కార్ వైఫల్యం చెందింది’అని విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయని, అదే నిజమైతే మరణాలు సంఖ్య ఎలా దాచగలమని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో కరోనాతో 98 శాతం రోగులు కోలుకుంటున్నారని, దేశవ్యాప్తంగా 3 శాతం మరణాల రేటుంటే.. తెలంగాణలో 2 శాతం మాత్రమే ఉందని, ఇది ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ కట్టడి చర్యలు కాదా అని ప్రశ్నించారు. ప్రపంచంలో కరోనా బారిన పడని దేశం అంటూ లేదన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు లాక్‌డౌన్ విధించి ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ వైరస్ వల్ల ఎంతమంది చనిపోతారో తెలియదు గానీ, ఆర్థిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. అందరికి జీవితం.. జీవనోపాధి ముఖ్యమని, కరోనాతో సహజీవనం చేస్తూనే ఉపాధి, అభివృద్ధి సాధించాలని మంత్రి కోరారు. ప్రతిపక్షాలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కరోనాతో రాజకీయాలు చేయడం ఇది సరైన సమయం కాదని, ఇంకా నాలుగేళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడక్కడా లోపాలు లేవని తాను అనడం లేదని, వాటిని సరిదిద్దేందుకు సూచనలు ఇవ్వాలని విపక్షాలను కోరారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కరోనాకు ఏదో చేయాలని అనుకునే కంటే, అందరూ బాధ్యతగా మెలగాలని కేటీఆర్ కోరారు.
ఆరోగ్య రంగంలో మంచి అవకాశాలు
ఆరోగ్య రంగంలో మన దేశానికి మంచి అవకాశాలు రాబోతున్నాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫార్మారంగంపై మన రాష్ట్రం నుంచి పనిచేస్తున్న నాలుగు కంపెనీలు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. 78 శాతం వైద్య పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, కానీ అందులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
22 వైద్య కళాశాలలు..15 వేలకు పైగా పడకలు: ఈటల
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం కరోనా టెస్టులు చేస్తున్నామని స్పష్టం చేశారు. కరోనాపై మొదట స్పందించి, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరీంనగర్‌లో కంటైన్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి రెండు, మూడు రోజుల్లో ప్రైవేట్ బోధనాస్పత్రుల్లో కరోనా రోగులకు వైద్యసేవలపై తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైద్య కళాశాలల్లో కరోనా చికిత్సకు మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. 22 వైద్య కళాశాలల్లో కలిపి 15 వేలకుపైగా పడకలు అందుబాటులో ఉన్నాయని ఈటల వెల్లడించారు.
సోషల్ మీడియాలో అందరూ డాక్టర్లే..
ఒక కార్యక్రమంలో ఉపసభాపతి పద్మారావుకు తాను మాస్క్ ఇచ్చానని మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ పద్మారావు మాస్క్ ధరించకుండా జేబులో పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఏం కాదన్నా.. హైదరాబాద్ వాళ్లం గట్టిగా ఉంటామని చెప్పుకొచ్చారని, చివరకు ఆయనకే కరోనా సోకిందన్నారు. జాగ్రత్త పాటించడం మన కోసమే కాదు.. మన కుటుంబ సభ్యులకు రక్షణ కోసమని పేర్కొన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరూ వైద్యుల్లా సలహాలు ఇస్తున్నారని చలోక్తులు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment