సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీలో పద్దుల గురించి చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు ధరణికి సంబంధించి లేవనెత్తిన అంశాలపై మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుంటూ రేవంత్‌తో సహవాసంతో సభలోని కాంగ్రెస్ సభ్యులు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ అరాచకంగా, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ఆయన ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడే భాషేనా అది? ముఖ్యమంత్రి ఎవరు అయితే వారు ప్రగతి భవన్‌లో ఉంటారు. అది అధికార నివాసం. అలాంటి ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేస్తానని ఎలా మాట్లాడతాడు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సహచర్యంతో శ్రీధర్‌బాబు సైతం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
నిజానికి శ్రీధర్‌బాబు, భట్టి మంచివారే. కానీ పార్టీలో సహవాస దోషంతో ఇలా తయారయ్యారు. వాళ్ల అధ్యక్షుడు అడ్డగోలుగా మాట్లాడే అలవాటుతో వీళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ల అధ్యక్షుడు బ్లాక్‌మెయిల్ చేసి రూ. కోట్లకు కోట్లు వసూళ్లు చేస్తున్నాడు. ఇందుకోసం కొందరు విశ్రాంత తహసీల్దార్లు, ప్రైవేటు వ్యక్తులతో ఓ దఫ్తర్ (కార్యాలయం)నే తెరిచాడు. చివరకు సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. అట్లాంటి వాళ్లకు ధరణితో ఇబ్బందులు అనిపిస్తాయి... సాధారణ ప్రజలకు కాదు. ధరణి రద్దు, ప్రగతి భవన్ పేల్చివేతే మీ విధానామా? ధరణిని రద్దు చేసి లంచాల కోసం రైతులను పీడించిన కాంగ్రెస్ హయాంలోని పద్ధతినే తేవాలనుకుంటున్నారా? ఏ విషయం చెప్పండి’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ధరణిని రద్దు చేయాలంటూ భట్టి, శ్రీధర్‌బాబు చేసిన డిమాండ్‌పై మంత్రి వేముల ప్రశాంతరెడ్డి జోక్యం చేసుకుని, ‘‘మరి మీ అధ్యక్షుడు ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేస్తానంటున్నాడు. దానిపై సీఎల్పీ వైఖరి ఏమిటో కూడా చెబితే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు.
లోపాలపుట్ట ధరణి.. దాన్ని రద్దు చేయాలి: భట్టి, శ్రీధర్‌బాబు
పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఆ పార్టీ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. పద్దులపై చర్చలో భాగంగా వారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూముల పట్టాకు సంబంధించి గతంలో ఉన్న చాలా కాలమ్స్‌ను తొలగించి ధరణిని తీసుకొచ్చారని, ఇది పేదల తీవ్ర ఇబ్బందిగా మారిందని వారు పేర్కొన్నారు. పట్టా రికార్డుల్లో దశాబ్దాలుగా పేరు ఉన్నప్పటికీ ధరణిలో కాస్తు కాలమ్‌ను తొలగించడంతో చాలా మంది భూమి హక్కులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
ఆ భూములు బడా బాబుల పరమయ్యాయని భట్టి, శ్రీధర్‌బాబు ఆరోపించారు. కొంత భూభా గానికి సంబంధించి ఏదైనా సమస్య ఏర్పడితే మొత్తం సర్వే నంబర్‌నే నిషేధిత జాబితాలో ఉంచుతున్నారని విమర్శించారు. గతంలో అసైన్ చేసిన భూములను కూడా ఇప్పుడు వెనక్కు తీసుకొని వేలం ద్వారా బడాబాబులకు కేటాయిస్తున్నారని శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం పేదల భూములను ఎకరా రూ. 8 లక్షలకు తీసుకొని రూ. 1.30 కోట్లకు ఎకరం చొప్పున బడా బాబులకు కట్టబెట్టారని ఆరోపించారు.
ధరణితో ప్రజల్లో సంతోషం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి తోసిపుచ్చారు. సాధారణ ప్రజలు ధరణితో పూర్తి సంతోషంగా ఉన్నారని, అది అందుబాటులోకి వచ్చిన తర్వాత 24 లక్షల లావాదేవీలు జరిగాయని చెప్పారు. ధరణిని రద్దు చేసి మళ్లీ లంచాల బాగోతం, ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులను ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరుపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు. అయితే ధరణి బాధలు ఏమిటో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే తెలుస్తాయని, ఓ తహసీల్దార్‌ను హత్య చేసే వరకు సమస్య ఏర్పడిందంటే సమస్య తీవ్రత తెలియడం లేదా? అని భట్టి ప్రశ్నించారు.
నిరూపించకుంటే శ్రీధర్‌బాబు క్షమాపణ చెప్పాలి..
శ్రీధర్‌బాబు చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అలా ఎకరం కాదుకదా.. కనీసం ఒక్క గజం ఇచ్చినట్లు నిరూపించాలని, లేనిపక్షంలో శ్రీధర్‌బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోని శ్రీధర్‌బాబు... ధర విషయంలో తాను చెప్పింది తప్పయితే ఎంతకు ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. భూసంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే వేరే వ్యవస్థలు పుట్టుకొస్తాయని, ఇది మంచి పరిణామం కాబోదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment