
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు మిస్టర్ ఫెయిల్యూర్ బిరుదు సరిపోతుందని శాసనమండిలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హీమీల అమలులో విఫలం అవుతున్నాడని అన్నారు. హీమీల అమలులో ఫెయిల్ అని, అవార్డుల ద్వారా ప్రచారం చేసుకోవడంలో మాత్రమే సక్సెస్ అని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లపో మగ్గిపోతున్న తెలంగాణవాసులను రాష్ట్రానికి తీసుకురావాలనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కొత్త ఎన్‌ఆర్‌ఐ పాలసీని తెస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఆ పాలసీ ఎక్కడికిపోయిందో చెప్పడంలేదన్నారు. గల్ఫ్ ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన హీమీల్లో ఏ ఒక్కటీ అమలుకాలేదని షబ్బీర్ అలీ అన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు 30వేల మంది గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీరిని ఆదుకోవాలనే స్పృహ ప్రభుత్వనికి ఎందుకు లేదని షబ్బీర్ ప్రశ్నించారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి తక్షణమే సమగ్ర విధానాన్ని తీసుకురావలని కోరారు.
గల్ఫ్ బాధితులను కలవడానికి అఖిలపక్ష ప్రతినిధులను ప్రభుత్వం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశాలు తిరుగుతున్న మంత్రి కేటీఆర్‌కు గల్ఫ్ బాధితులు కనబడటం లేదా అని ప్రశ్నించారు. వీరి కోసం వెంటనే ఎన్‌ఆర్‌ఐ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కక్కుర్తికి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. కమీషన్లను దండుకోవడంలో పేదలకు పంచుతున్న బతుకమ్మ చీరలను కూడా వదలలేదని షబ్బీర్ అలీ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌కు ఇచ్చిన హామీలను అమలుచేయాలని సూచించారు. లక్షకోట్లు ఇస్తామంటూ వట్టిగా మాటలు చెప్పడం మానుకోవాలన్నారు. లక్షకోట్లు కాదు ముందుగా ఇస్తామన్న వేయికోట్లు విడుదల చేయాలని షబ్బీర్ అలీ సూచించారు.