పారిశుధ్యకార్మికులతో సహపంక్తి భోజనం చేశాక.. మరో పంక్తిలో కూర్చున్న వారికి స్వయంగా వడ్డిస్తున్న పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఏమ్మా.. నీ పేరేంటి?.. ‘‘పిల్లలెంత మంది?.. ఏం చదువుతున్నారు?’’ ‘‘మీకేమైనా సమస్యలున్నాయా..?’’
ఇలా పేరుపేరునా మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుల యోగక్షేమాలను ఆరా తీశారు. సంజీవయ్య పార్కు ఎదుట ఉన్న జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగంలోని డీఆర్‌ఎఫ్ శిక్షణ కేంద్రంలో బుధవారం ఆయన జీహెచ్‌ఎంసీ పారిశుధ్య, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి భోజనం చేశారు. లాక్‌డౌన్ సమయంలో మీరంతా డాక్టర్లు, పోలీసులకు ధీటుగా పనిచేస్తున్నారని వారిని మంత్రి అభినందించారు.
కరోనాపై యుద్ధంలో మీరే తొలి సిపాయిలని, మీరంతా కష్టపడుతున్నారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా ఇప్పుడు మిమ్మల్ని, మీ సేవల్ని గుర్తిస్తున్నారని కితాబునిచ్చారు. కొందరికి తానే వడ్డించారు. వారి కుటుంబీకుల ఆరోగ్య పరిస్థితిని, వారేం చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీ వెంటే మేమున్నామంటూ ధైర్యమిచ్చారు. ‘పనికి వెళ్లొద్దంటూ మీ ఇంట్లో వాళ్ల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయా?, కరోనా వల్ల మీకేమైనా భయంగా ఉందా?’అంటూ వారితో ముచ్చటించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ భోజనాల కార్యక్రమం నిర్వహించారు.
ప్రజల కోసం పనిచేసేవారిని ప్రభుత్వం గౌరవిస్తుంది..
కరోనా నియంత్రణలో విశిష్ట సేవలందిస్తున్న శానిటేషన్, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్ సిబ్బందికి కూడా పూర్తి జీతంతో పాటు ప్రోత్సాహకాలను సీఎం కేసీఆర్ ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసేవారిని ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ చుట్టుపక్కల వారికి వివరించాలని కోరారు.
వర్షాకాలం రానున్నందున దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎంటమాలజీ విభాగానికి సూచించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్, అదనపు కమిషనర్ (శానిటేషన్) రాహుల్‌రాజ్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment