దుబాయ్ లో ‘దుబాయ్ స్మార్ట్ సిటీ’ నమూనాను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో ఆ సంస్థ సీఈఓ
* మంత్రి కేటీఆర్ ఆహ్వానానికి ‘దుబాయ్ స్మార్ట్ సిటీ’ సానుకూల స్పందన
* వారం రోజుల్లో హైదరాబాద్‌ను సందర్శించనున్న సంస్థ సీఈఓ ముల్లా
* తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి చూపిన దుబాయ్ పారిశ్రామికవేత్తలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆహ్వానానికి ‘దుబాయ్ స్మార్ట్ సిటీ’ సీఈఓ సానుకూలంగా స్పందించారు. సంస్థ సీఈవో అబ్దుల్ లతీఫ్ అల్-ముల్లా నేతృత్వంలోని బృందం హైదరాబాద్ నగర పర్యటనకు రానుంది. వారం రోజుల్లో హైదరాబాద్‌ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలని అల్-ముల్లా నిర్ణయించారు.
దుబాయ్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్‌ఐఐసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జయేష్ రంజన్‌తో కలసి ఆదివారం అక్కడి ‘దుబాయ్ స్మార్ట్ట్ సిటీ’ కార్యాలయంలో ఆ సంస్థ సీఈవో ముల్లా, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ బాజు జార్జ్‌తో సమావేశమయ్యారు.
సమాచార సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్టులో అంతర్భాగంగా హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే విషయంలో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఐటీఐఆర్ హైదరాబాద్ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిన దుబాయ్ స్మార్ట్ సిటీ సీఈవో ముల్లా.. రాష్ట్ర ప్రభుత్వంతో తదుపరి చర్చల నిమిత్తం వారం రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని నిర్ణయించారు.
దుబాయ్ స్మార్ట్ సిటీ గురించి క్లుప్తంగా..
ఐటీ కార్యాలయాలు, నివాస, వ్యాపార సముదాయాల సమ్మిళిత అభివృద్ధికి మారుపేరుగా దుబాయ్‌లోని స్మార్ట్ సిటీని అభివర్ణించవచ్చు. అత్యుత్తమ ప్రమాణాల మధ్య పనిచేయడానికి, జీవనం కొనసాగించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అక్కడి స్మార్ట్ సిటీ నమూనాను అనుకరించి ఐరోపాలోని మాల్టా ద్వీపంలో స్మార్ట్ సిటీని నిర్మించారు. ఇక భారత్ విషయానికి వస్తే.. కోచీలో 250 ఎకరాల విస్తీర్ణంలో స్మార్ట్ సిటీని నిర్మించేందుకు కేరళ ప్రభుత్వం ‘దుబాయ్ స్మార్ట్ సిటీ’తో 2007లో ఒప్పందం చేసుకుంది. వచ్చే 8 ఏళ్లలో ఇక్కడ దుబాయ్ స్మార్ట్ సిటీ రూ.8 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
తెలంగాణపై దుబాయ్ పారిశ్రామికవేత్తల ఆసక్తి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు. టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, గనులు, బయోటెక్నాలజీ, సాధారణ ఇంజనీరింగ్ ఆధారిత రంగాలపై ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఫిక్కీ, ఐబీపీసీ, దుబాయ్, ఇండియన్ కాన్సులేట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో దుబాయ్‌లోని క్రౌన్‌ప్లాజా హోటల్‌లో ఆదివారం నిర్వహించిన ‘ఇన్వెస్టర్స్ మీట్’లో మంత్రి కె.తారకరామారావు పాల్గొని రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించగా..అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది.
ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్‌ఐఐసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జయేష్ రంజన్, ఫిక్కీ బృంద నేత అరుణ్ చావ్లా, ఐబీపీసీ అధ్యక్షుడు పరాస్ షాదాద్‌పురి, గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు జువ్వాడి శ్రీనివాస రావు, శ్రీనివాస శర్మ, రాజా శ్రీనివాస రావు, విజయభాస్కర్, అంబటి రఘు తదితరులు పాల్గొన్నారు.