ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
మణికొండ: ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్... రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ టెక్నాలజీ రంగంలోనూ హబ్‌గా మారుతుందనే నమ్మకం తనకు ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి్ద శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామంగా నిలుస్తోందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి నగరాల్లో హైదరాబాద్ ఏడవ స్థానంలో ఉందని చెప్పారు.
అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రానికి చెందిన అడ్వాన్స్ ఆటోపార్ట్స్ సంస్థ సోమవారం నార్సింగి మున్సిపాలిటీ కోకాపేటలో ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆటోపార్ట్స్‌కు సాఫ్ట్‌వేర్‌ను అందించే అతిపెద్ద సంస్థ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌కు రావడం గర్వకారణమన్నారు.
నేటి ఆధునిక యుగంలో ఆటోమొబైల్ అంటే నాలుగు చక్రాలపై కదిలే కంప్యూటరేనని... ప్రస్తుతం తయారవుతున్న వాహనాల్లో ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు, సాఫ్ట్‌వేర్లు ఉంటున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగానికి సం బంధించిన అన్ని అవసరాలకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రతిపాదిత ‘మొబిలిటీ వ్యాలీ’ కేంద్రబిందువుగా నిలుస్తుందన్నారు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తాం...
రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు పెద్దపీట వేసి వారితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుండటం వల్లే ఇలాంటి సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర నగరాలకన్నా భిన్నంగా అనేక రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుండటంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని కేటీఆర్ అన్నారు.
ఇలాంటి సంస్థలు వస్తే వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. గత కొంతకాలంగా కరోనా వ్యాప్తి సంస్థలను కుంగదీసినా ప్రస్తుతం కంపెనీలన్నీ కుదుటపడి తిరిగి వ్యాపార విస్తరణ బాట పడుతున్నాయన్నారు. త్వరలోనే పెట్టుబడిదారులను ఆకర్షించేలా పెద్ద ఈవెంట్‌ను నిర్వహిస్తామన్నారు.
దేశంలో జీసీసీ ఏర్పాటు వ్యూహాత్మకం...
దేశంలో నైపుణ్య శక్తిని అందిపుచ్చుకుంటూ సంక్లిష్ట ప్రక్రియలు, వినూత్న కార్యక్రమాల్లో భాగమయ్యేందుకు జీసీసీ ఏర్పాటు ఓ వ్యూహాత్మక చర్య అని అడ్వాన్స్ ఆటోపార్ట్స్ సంస్థ సీఈఓ, ప్రెసిడెంట్ టామ్ గ్రీకో పేర్కొన్నారు. కోకాపేటలో ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలో మొదటి విడతగా 430 మంది ఉద్యోగులు, 150 భాగస్వామ్య వనరుల సామర్ద్యం, 65 వేల చదరపు గజాల కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు.
రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తామన్నారు. స్థానికంగా ఉత్తమ ప్రతిభను ఆకర్షించాలని తమ సంస్థ చూస్తుందని, తమ కార్యాలయంలో ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పించామని సంస్థ ఎండీ మహేందర్ దుబ్బా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment