
మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై జరిగిన సమీక్షలో అధికారులతో మాట్లాడుతున్న ఐటీ మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పటిష్టమైన డిజిటల్ నెట్‌వర్క్ అవసరాన్ని ప్రస్తుత కరోనా సంక్షోభం ఎత్తిచూపిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్రంలోని ఇంటింటికీ ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించేందుకు చేపట్టిన టీ–ఫైబర్ ప్రాజెక్టును వచ్చే 10 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన టీ–ఫైబర్ నెట్‌వర్క్‌ను మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వేగవంతం చేసేందుకు అవసరమైతే ‘రైట్ టు వే’చట్టాన్ని వినియోగించేందుకున్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై మంగళవారం ఆయన ఇక్కడ సమీక్ష నిర్వహించారు.
కరోనాపై యుద్ధంలో డిజిటల్ మౌలిక వసతులు ప్రభుత్వానికి ఉపయుక్తంగా మారాయన్నారు. ఆన్‌లైన్ విద్య, వైద్యం, ఈ–కామర్స్ సేవలకు ఏర్పడిన డిమాండ్ నేపథ్యంలో పటిష్టమైన డిజిటల్ నెట్‌వర్క్ కలిగి ఉండటం అత్యవసరమని చెప్పారు. లక్షల మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని వినియోగించుకుని ఇళ్ల నుంచే పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఐటీ, అనుబంధ రంగాల్లో ఈ ట్రెండ్ భవిష్యత్తులో సైతం కొనసాగే అవకాశముందన్నారు. ఈ అవసరాలను తీర్చడానికి ఎలాంటి లోపాలు లేని పటిష్టమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అవసరమని, టీ–ఫైబర్ ప్రాజెక్టుతో ఇది సాధ్యం కానుందని వెల్లడించారు.
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం (ఏ2ఏ), ప్రభుత్వం నుంచి పౌరులకు (ఏ2ఈ) అందించే సేవల్లో గణనీయమైన మార్పులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలను ప్రపంచంతో అనుసంధానం చేసేలా ఈ ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్ విద్య/వైద్యం/వ్యవసాయ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉందన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లోని ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తుందని, దీం తో డిజిటల్ కంటెంట్ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
రైతు వేదికల అనుసంధానం
కొత్తగా నిర్మించనున్న రైతు వేదికలన్నింటిని టీ–ఫైబర్‌తో అనుసంధానం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. గ్రామాల్లోని రైతు వేదికల నుంచి రైతులు నేరుగా ముఖ్యమంత్రి, మంత్రి, వ్యవసాయ అధికారులతో మాట్లాడే అవకాశం కల్పించేందుకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, దిగుబడుల పెంపకం వంటి విషయాల్లో గణనీయమైన లబ్ధి పొందేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న డిజిటల్ నెట్‌వర్క్, స్టేట్ డేటా సెంటర్లను టీ–ఫైబర్ పరిధిలోకి తేవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment