కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న జాజాల సురేందర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 9 మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఈ జాబితాలో చేరారు. బుధవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావును కలిసిన సురేందర్.. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సురేందర్ ప్రకటనతో టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పట్లోళ్ల సబితారెడ్డి, బానోతు హరిప్రియా నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, డి.సుధీర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా సురేందర్ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి తగ్గింది. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేసే ప్రక్రియ అధికారికంగా పూర్తి కానుంది. కాంగ్రెస్ శాససన సభాపక్షం విలీనమైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవసరం ఉండదు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ లోపే కాంగ్రెస్ శాసనసభ పక్షం విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్‌లో ఒంటెత్తు పోకడలు: జాజాల
కాంగ్రెస్ నాయకత్వం ప్రజలకు దూరమైందని... అంతా ఒంటెత్తు పోకడలతో ఉన్నారని జాజాల సురేందర్ విమర్శించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నానని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశారు. ‘2001 లో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలోకి వచ్చాను. ఆయనతో కలిసి అనేక పోరాటాల్లో పాల్గొన్న. ఇప్పుడు కూడా ఆయనతోనే కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్న. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం మళ్లీ ఇప్పుడు కేసీఆర్‌తో కలిసి నడుస్తా. నా నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ కామా రెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు.
వీటిని కొనసాగేలా చూడడంలో నా పాత్ర ఉండాలని కోరుకుంటున్న. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వా న్ని కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం నా బాధ్య త. టీఆర్‌ఎస్‌తో గతం నుంచి నాకు అనుబంధం ఉంది. నా నియోజకవర్గ ప్రజలు, నా అభిమానులు, కార్యకర్తలు అంతా టీఆర్‌ఎస్‌తో కలిసి నడవాలని.. కేసీఆర్‌తో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలని కోరారు. అందరినీ సంప్రదించిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న. కాంగ్రెస్ నాయక త్వం ప్రజలకు దూరమైంది. అంతా ఒంటెద్దు పోకడలతో ఉన్నారు. కాంగ్రెస్‌కి రాజీనామా చేస్తున్న. అవసరమైతే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తా’ అని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment