ప్రతిభకు సాయం.. పేదలకు ఊతం | KTR Helping hand to the Student Khushwant | Sakshi
Sakshi News home page

ప్రతిభకు సాయం.. పేదలకు ఊతం

Published Sat, Jul 27 2019 2:41 AM | Last Updated on Sat, Jul 27 2019 2:41 AM

KTR Helping hand to the Student Khushwant - Sakshi

సాగర్‌కు వాహనాన్ని అందిస్తున్న కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిభ ఉన్నా పేదరికంతో వైద్యం, ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో చేరలేని విద్యార్థులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా నిలిచారు. తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు, ఏపీ ఎంసెట్‌లో 8 వర్యాంకు, నీట్‌ జాతీయ స్థాయిలో 50వ ర్యాంకు సాధించిన ఏంపటి కుష్వంత్‌కు ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు వచ్చినా పేదరికం అడ్డుగా నిలిచింది. కుష్వంత్‌ కుటుంబం మంచిర్యాల జిల్లా శ్రీరాంపురంలో ఉంటుండగా,. కొన్ని నెలల క్రితం అతని తండ్రి లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణిం చారు. తల్లి అనిత ప్రస్తుతం భూపాలపల్లిలో కుట్టు పనిచేస్తూ తన కుమారులను పోషిస్తున్నారు.తన తల్లి, తన ఉన్నత చదువులకు అవసరమైన ఫీజులను భరించలేని నేపథ్యాన్ని కుష్వంత్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్‌ సాయం అందిస్తామని హమీ ఇచ్చారు. ఈ మేరకు కుష్వంత్‌ పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని మం జూరు చేయించారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి సమక్షంలో రూ.5 లక్షల చెక్కును అందజేశారు.  

మరో ఇద్దరు విద్యార్థులకు కూడా... 
మరో ఇద్దరు విద్యార్థులకు కేటీఆర్‌ వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారు. నేషనల్‌ ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ పోటీ పరీక్షలో దేశ వ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించిన కె. లావణ్య ఫీజుకు అవసరమైన మొత్తం అందించారు. మేడ్చల్‌ జిల్లాలోని గాజుల రామారానికి చెందిన లావణ్య తండ్రి స్థానికంగా ఉన్న ఒక కంపెనీలో రోజువారీ కూలి. తన పేదరికం వలన తన ఫీజులు చెల్లించలేక పోతున్నానని కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా లావణ్య తన సమస్యను తెలిపింది. దీనిపై స్పందించిన కేటీఆర్‌ ఫీజుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు. సిరిసిల్ల పట్టణం, సుందరయ్య నగర్‌కు చెందిన యస్‌.పవన్‌ ఫ్రీ సీటు సాధించి వీయన్‌అర్‌ విజ్ఞాన జ్యోతి కళాశాలలో మూడో ఏడాది బీటెక్‌ చదువుతున్నారు. తన తండ్రి చిన్న టీకొట్టు ద్వారా జీవనం సాగిస్తున్నారు. పవన్‌ ఫీజుల కోసం సాయాన్ని కేటీఆర్‌ అందించారు. 

దివ్యాంగునికి త్రిచక్రవాహనం... 
ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ప్రమాదంలో తన కాళ్లు పోగొట్టుకున్న దివ్యాంగుడు సాగర్‌ కు తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ త్రిచక్ర వాహనాన్ని అందజేశారు. సిరిసిల్ల నియోజకవర్గం రాచర్ల తిమ్మాపూర్‌కు చెందిన కాంభోజ సాగర్‌ ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి అక్కడ జరిగిన ట్రక్కు ప్రమాదంలో తన కుడి కాలును కోల్పోయారు. జీవనోపాధి  మెరుగుకు వైకల్యం అడ్డుగా వస్తున్న విషయాన్ని కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. దీన్ని తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నేత గడ్డం పల్లి రవీందర్‌ రెడ్డి కాంభోజ సాగర్‌కు త్రిచక్ర వాహ నాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు.  శుక్రవారం కేటీఆర్‌ చేతుల మీదుగా సాగర్‌కు ఆ వాహనాన్ని అందించారు. కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌ ’కార్యక్రమంలో భాగంగా ఈ సహాయం అందించడం సంతోషంగా ఉందని రవీందర్‌ రెడ్డి తెలిపారు. సాగర్‌ జీవనోపాధికి సహాయాన్ని అందిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement