మున్సిపోల్స్‌పై టీఆర్‌ఎస్‌ నజర్‌! | TRS Focus On Municipal Elections | Sakshi
Sakshi News home page

మున్సిపోల్స్‌పై టీఆర్‌ఎస్‌ నజర్‌!

Published Wed, Dec 11 2019 3:40 AM | Last Updated on Wed, Dec 11 2019 3:40 AM

TRS Focus On Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలకు గాను, 130కి పైగా మున్సిపాలిటీ పాలకవర్గాల ఎన్నిక జనవరి మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుండగా, డిసెంబర్‌ 25లోగా వార్డులు, చైర్మన్‌ పదవుల రిజర్వేషన్ల ఖరారు కొలిక్కి వచ్చే అవకాశముంది. డిసెంబర్‌ నెలాఖరులోగా మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో, పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టి సారించింది. దీంతో మున్సి పాలిటీల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ఎమ్మెల్యేలు, నేతలు దృష్టి సారించారు.  మున్సిపోల్స్‌ వ్యూహంపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ త్వరలో పార్టీ ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

బలంపై అంచనా 
లోక్‌సభ మినహా అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఏకపక్ష విజయం సాధించింది. ఎంపీటీసీ స్థానాల్లో 61 శాతం, జెడ్పీటీసీ స్థానాల్లో 83 శాతం విజయం నమోదు చేసిన టీఆర్‌ఎస్‌.. 32 జిల్లా పరిషత్‌ పీఠాలనూ కైవసం చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం సాధించడం లక్ష్యంగా సుమారు 4 నెలలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీల్లో సంస్థాగత నిర్మాణాన్ని వాయిదా వేసింది.

ఆగస్టులో 17 లోక్‌సభ సెగ్మెంట్లకు 64 మంది పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జు లుగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. మున్సిపాలిటీ, జనాభా, వార్డులు, ఓటర్లు, గతంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీల వారీగా సాధించిన ఫలితం తదితర వివరాలతో పాటు 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మున్సిపాలిటీల పరిధిలో సాధించిన ఓట్ల వివరాలను క్రోడీకరించి ఇన్‌చార్జులు కేటీఆర్‌కు నివేదికలు ఇచ్చారు. తాజా పరిస్థితిపై  మళ్లీ నివేదికలు ఇవ్వాల్సిందిగా కేటీ ఆర్‌ ఆదేశించినట్లు సమాచారం. 

వార్డులు, డివిజన్ల వారీగా..
ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో టీఆర్‌ఎస్‌తోపాటు వివిధ పార్టీలు ఎంతమేర ప్రభావం చూపుతాయనే దానిపై టీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల్లో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తల వివరాల సేకరణపైనా దృష్టి సారిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేయనుండగా సుమారు 50కి పైగా మున్సిపాలిటీల్లో ఎంఐఎం కొంత మేర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎంఐఎం పోటీ చేసే స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, అలాంటి చోట్ల అనుసరించాల్సిన వ్యూహంపైనా టీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement