వాళ్లు కూడా బోనస్‌ తీసుకుంటారేమో: కేటీఆర్‌ | KTR Chit Chat Over Municipal Elections And Other Issues | Sakshi
Sakshi News home page

ఆ రెండింటిపై త్వరలోనే నిర్ణయం: కేటీఆర్‌

Jan 1 2020 4:31 PM | Updated on Jan 1 2020 5:07 PM

KTR Chit Chat Over Municipal Elections And Other Issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మున్సిపల్ ఎన్నికల్లో సింహభాగం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) పార్టీ గెలుచుకుంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కె.తారకరామారావు అన్నారు. కఠినంగా ఉన్న మున్సిపల్ చట్టం అమలును టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధుల నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా 2020 సంవత్సరం టీఆర్‌ఎస్‌కు బ్రహ్మాండమైన ప్రారంభాన్ని ఇస్తుందన్నారు. ఇది టీఆర్‌ఎస్‌ సంవత్సరమని... ఈ దశాబ్దము కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణది కావాలని ఆకాంక్షించారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే తామే ముందు ఉన్నామని... వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణం పూర్తి చేసుకున్నామని తెలిపారు. 
 
సంక్రాంతి తర్వాత జిల్లా కేంద్రంలో పార్టీ భవనాల్లో అధిక భాగం కేసీఆర్‌తో ప్రారంభించాలని అనుకుంటున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతుల నిర్వహణపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రజల మధ్య వారధిగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. అదే విధంగా మున్సిపోల్స్‌లో గెలిచిన ప్రజా ప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. మున్సిపల్ సిబ్బందికి కూడా ప్రతి నెలా లేదా మూడు నెలలకు ఒకసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

ఏమో బోనస్‌ తీసుకుంటారేమో!
ఇక ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడుతూ... వారు త్వరలోనే బోనస్‌ తీసుకునే రోజు వస్తుందేమోనని కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎన్పీఆర్‌, ఎన్నార్సీపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.  హైదరాబాద్‌లో సీఏఏ అనుకూల, వ్యతిరేక ర్యాలీలు జరిగాయని... కాంగ్రెస్ పార్టీ వాళ్లు సరూర్‌నగర్‌లో చేసుకుంటామంటే పోలీసులు అనుమతి ఇచ్చేవారేమోనని వ్యాఖ్యానించారు. ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని దుర్బాషలాడటం సరికాదని హితవు పలికారు. ఇక దిశ ఘటనపై తాము మానవీయంగా స్పందించామని కేటీఆర్‌ తెలిపారు. 

అదే విధంగా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఏపీ వాళ్ళు ట్విటర్‌లో ఏపీలో టీఆర్ఎస్ రావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇగ్నోర్ చేయడానికి లేదని కేటీఆర్‌ అన్నారు. ఇక బీజేపీ గురించి మాట్లాడుతూ.. తన చిన్నప్పుడు ఆ పార్టీ ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. తాను ముఖ్యమంత్రిని అవబోతున్నానంటూ వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు కదా అని పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంకా ఎందుకు అనుమానాలు అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement