సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటు విషయంలో, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీరు మారాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలప్రదం కావాలంటే కేంద్రం ఆలోచనా విధానం మారాలని ఆయన అన్నారు. ఓట్లు్ల.. సీట్లు ఉన్నాయని, పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని కేంద్రం పరిశ్రమలను ఇష్టారీతిన తరలించడం సరికాదని విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)లో సుమారు 512 ఎకరాల విస్తీర్ణంలో వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల తయారీ కేంద్రానికి మంత్రి కేటీఆర్ బుధవారం భూమి పూజ నిర్వహించారు. వెమ్ టెక్నాలజీస్ చైర్మన్ వెంకటరాజు, రక్షణ శాఖ మాజీ మంత్రి పళ్లంరాజు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వెమ్ టెక్నాలజీస్ భారతదేశపు లాక్‌హీడ్ మార్టిన్ (అమెరికా ఆయుధ కంపెనీ)గా ఎదుగుతుందన్న నమ్మకం తనకుందని అన్నారు. హైదరాబాద్, బెంగళూరులలో ఇప్పటికే కొన్ని రక్షణ రంగ పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు నగరాల మధ్య రక్షణ రంగ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేలా ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి గతంలోనే ప్రతిపాదించామని తెలిపారు.
ఈ పారిశ్రామిక కారిడార్ కారణంగా తెలంగాణ మాత్రమే కాకుండా ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకూ ప్రయోజనం చేకూరే అవకాశం ఉండగా.. కేంద్రం దాన్ని ఎకాఎకిన ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని బుందేల్‌ఖండ్‌కు తరలించిందని, ఇది సరికాదని ఆన్నారు.
స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి
వెమ్ టెక్నాలజీస్ నిమ్జ్‌లో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీలో క్షిపణులు, ఆయుధాలు, రాడార్లు, యుద్ధ విమానాల విడిభాగాలన్నీ తయారవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టనున్న ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ వివరించారు.
ఇక్కడి పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత వెమ్ టెక్నాలజీస్ వంటి సంస్థలపై ఉందని అన్నారు. అవసరమైతే స్థానికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిననిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తున్న రైతులకు తగినంత పరిహారం ఇచ్చేందుకు కలెక్టర్లు అన్ని చర్యలూ తీసుకోవాలని చెప్పారు.
స్వదేశీ క్షిపణి ‘అసిబల్’ తయారీకి సిద్ధం: వి.వెంకటరాజు
1988లో స్థాపితమైన వెమ్ టెక్నాలజీస్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్షిపణిని తయారు చేసేందుకు సిద్ధంగా ఉందని ‘అసిబల్’ పేరుతో తయారయ్యే ఈ క్షిపణి ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో వాడుతున్న జావెలిన్ తరహా క్షిపణి అని వెమ్ టెక్నాలజీస్ చైర్మన్ వెంకట రాజు తెలిపారు. ప్రైవేట్ రంగంలో తొలిసారి పూర్తిస్థాయి క్షిపణిని తయారు చేసిన కంపెనీగా వెమ్ రికార్డు సృష్టించనుందని ఆయన ‘సాక్షి’తో చెప్పారు.
సృష్టికర్త బ్రహ్మ చేతి ఖడ్గం పేరు ‘అసి’ కాగా.. బల్లెం అనే అర్థంలో బల్‌ను ఉపయోగించి క్షిపణి పేరును అసిబల్‌గా నిర్ణయించినట్లు చెప్పారు. ఏడాదికి పదివేల క్షిపణులను తయారు చేసేందుకు సంస్థకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో స్వదేశీ టెక్నాలజీతో ఒక యుద్ధ విమానాన్ని, అత్యాధునిక స్నైపర్ ఆయుధాలు, డ్రోన్లు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment