
ఆత్మహత్యే శరణ్యమంటున్న సమీర్
సిరిసిల్ల: బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన మరో యువకుడికి కన్నీళ్లు, కష్టాలు ఎదురయ్యాయి. రెక్కల కష్టాన్ని నమ్ముకుని వెళ్లిన యువకుడు ఏజెంట్ మోసం తో నరకయాతన అనుభవిస్తున్న సంఘటన బుధవారం వెలుగు చూసింది. బాధితుడు గల్ఫ్ దేశంలో అనుభవిస్తున్న కష్టాలను వివరిస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనను విడిపించాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. తనను స్వదేశానికి రప్పించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావును వేడుకున్నాడు.
ఇదీ ఏజెంట్ మోసం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సమీర్ (21) నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏజెంట్ వాహిద్ సౌదీ అరేబియాలోని సిటీలో ఫామ్‌హౌస్‌లో పని అని, నెలకు రూ.1,200 రియాళ్లు (రూ.22 వేలు) జీతం అని చెప్పాడు. అరబ్బు షేక్‌లకు అసిస్టెంట్‌గా పనిచేయాలని, ఫామ్ హౌస్ పని సులభంగా ఉంటుందని వివరించాడు. అతడి మాటలు నమ్మిన సమీర్.. రూ.83 వేలు చెల్లించి వీసా తీసుకున్నాడు. 2019 ఏప్రిల్ 15 సమీర్ సౌదీ అరేబియా వెళ్లాడు. విమానాశ్రమంలో రిసీవ్ చేసుకున్న కఫిల్ (వీసా ఇచ్చిన యజమాని) నేరుగా సిటీకి 1,200 కిలోమీటర్ల దూరంలోని గొర్రె షెడ్డు వద్దకు తీసుకెళ్లి వదిలేశాడు. 300 గొర్రెలకు కాపలా ఉండాలని చెప్పడంతో సమీర్ కంగుతిన్నాడు.
ఎడారిలో ఒంటరిగా..
సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటరిగా గొర్రెలను కాస్తూ సమీర్ ఇబ్బందుల పాలవుతున్నాడు. దయనీయమైన పరిస్థితిలో సమీర్ వద్ద ఫోన్ కూడా లేదు. ఎవరో వస్తే.. వారి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తన పరిస్థితిని వివరించాడు. ఈ విషయమై ఏజెంట్ వాహిద్‌ను కుటుంబ సభ్యులు నిలదీస్తే.. అక్కడ చెప్పిన పని చేయాలి.. లేకుంటే.. రూ.1.20 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తామని ఏజెంట్ వాహిద్ చెప్పాడు. ఇరవై రోజులుగా తిండి సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని సమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు
అన్నా నీ కాల్మొక్త.. ఇంటికి తెప్పించుండ్రి..
సమీర్ తన దయనీయ స్థితిని వివరిస్తూ వీడియో పంపించాడు. ‘కేటీఆర్ అన్నా నీ కాల్మొక్త.. జెర ఇంటికి పంపించుండ్రి అన్నా..’అంటూ కన్నీరు పెట్టాడు. ‘బండిలో ఎక్కడికో తీసుకపోయి టార్చర్ చేస్తుండు. బెదిరిస్తుండు’ అంటూ సమీర్ వాపోయాడు. ఇక్కడుంటే తనకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆస్పత్రి పాలైన తల్లి రఫియా
సమీర్ ఇంటికి పెద్దోడు. తండ్రి ఇబ్రహీం బాబు అనారోగ్యంతో ఏడేళ్ల కిందట మరణించాడు. తల్లి రఫియా, తమ్ముడు సుమీర్, చెల్లెలు నౌషియా ఉన్నారు. అప్పుల బాధలతో సిద్దిపేటలో ఇల్లు అమ్ముకుని ఇల్లంతకుంటలో స్థిరపడ్డారు. గతంలో దుబాయి వెళ్లి వచ్చిన సమీర్.. మెరుగైన జీతం కోసం సౌదీ అరేబియా వెళ్లి బందీ అయ్యాడు. కొడుకు పరిస్థితి తెలిసి తల్లి రఫియా హైబీపీ, షుగర్‌తో సిద్దిపేటలోని ఆస్పత్రిలో చేరింది. సమీర్‌ను ఎలాగైనా ఇండియా రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అతడిపైనే కుటుంబం ఆధారపడి ఉందని సమీర్ మేనమామ అబిద్ తెలిపారు.
సమీర్‌ను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు: కేటీఆర్
ఏజెంట్ మోసం చేయడంతో సౌదీలో చిక్కుకుని కష్టాలు పడుతున్న మహ్మద్ సమీర్‌ను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటకు చెందిన 21 ఏళ్ల మహ్మద్ సమీర్ జీవనోపాధి కోసం గత నెలలో సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఫంక్షన్‌హాల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏజెంట్ ఆశ చూపించాడు. ఉద్యోగం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తీరతాయని భావించిన సమీర్... ఏజెంట్‌కు పెద్దమొత్తంలో నగదును ఇచ్చాడు. తీరా అక్కడికి వెళ్లాక తనను గొర్రెల కాపరిగా పెట్టారని కన్నీటి పర్యంతమైన సమీర్, తన ను రక్షించమంటూ వీడియో సందేశాన్ని పంపాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. సమీర్‌ను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రియాద్‌లోని భారత దౌత్యకార్యాలయ ప్రతినిధిని కోరుతూ ట్వీట్ చేశారు.